విధాత, హైదరాబాద్ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తాజాగా ఉద్యోగుల బదిలీలు చేపట్టారు. ఆలయంలో 26 మంది ఉద్యోగులు రాష్ట్రంలోని ఇతర ఆలయాలకు బదిలీ అయ్యారు. బదిలీ అయిన వారిలో ఇద్దరు ఏఈవోలు, ఆరుగురు సూపరింటెండెంట్లు, ఏడుగురు సీనియర్ అసిస్టెంట్లు, తొమ్మిది మంది జూనియర్ అసిస్టెంట్లు, ఒక సివిల్ ఇంజినీర్ డీఈ, ఒక ఎలక్ట్రికల్ ఏఈ ఉన్నారు.
యాదాద్రి ఆలయంలో చివరిసారిగా 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బదిలీలు జరిగాయి. అప్పటినుంచి యాదాద్రి ఆలయంలో బదిలీలు జరగలేదు. ఆనాటి నుంచి పలువురు ఆలయ అధికారులు, పలు విభాగాల ఉద్యోగులకు పదోన్నతులు లభించి యాదగిరిగుట్టలోనే ఉద్యోగాలు చేస్తున్నారు. దాదాపుగా 15 ఏళ్ల తర్వాత, తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా మళ్లీ బదిలీల ప్రక్రియ నిర్వహించారు.