హైద‌రాబాద్‌లో రూ. 20 కోట్ల ఖ‌రీదైన శున‌కం..

కోట్ల రూపాయాలు పెట్టి కుక్క‌ల‌ను కొనుగోలు చేయడం ఏంటని అనుకుంటున్నారా..? అది కూడా హైద‌రాబాద్ న‌గ‌రంలో అంటే కొంత ఆశ్చ‌ర్యంగా అనిపిస్తుంది క‌దా..?

  • Publish Date - December 16, 2023 / 02:28 PM IST

హైద‌రాబాద్ : కోట్ల రూపాయాలు పెట్టి కుక్క‌ల‌ను కొనుగోలు చేయడం ఏంటని అనుకుంటున్నారా..? అది కూడా హైద‌రాబాద్ న‌గ‌రంలో అంటే కొంత ఆశ్చ‌ర్యంగా అనిపిస్తుంది క‌దా..? కానీ కోట్ల రూపాయాల ఖ‌రీదైన ఓ శున‌కం మియాపూర్‌లో క‌నిపించింది. ఆ శున‌కాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్య‌లో ఎగ‌బ‌డ్డారు. బెంగ‌ళూరుకు చెందిన ఇండియ‌న్ డాగ్ బ్రీడ‌ర్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు, న‌టుడు స‌తీశ్ ఇటీవ‌ల కాకాసియ‌న్ షెపెర్డ్ జాతికి చెందిన శున‌కాన్ని రూ. 20 కోట్ల‌కు కొనుగోలు చేశారు. ఆ ఖ‌రీదైన శున‌కానికి ముద్దుగా కాడాబామ్ హైడ‌ర్ అనే పేరును నామ‌క‌ర‌ణం చేశారు. అయితే ఆరోగ్య ప‌రీక్ష‌ల నిమిత్తం ఆ కుక్క‌ను శ‌నివారం మియాపూర్‌లోని విశ్వ పెట్ క్లినిక్‌కు తీసుకువ‌చ్చారు. దీంతో ఆ శున‌కాన్ని చూసిన స్థానికులు.. దాంతో ఫోటోలు దిగేందుకు ఆస‌క్తి చూపించారు.

ఈ సంద‌ర్భంగా స‌తీశ్ మాట్లాడుతూ.. హైద‌రాబాద్‌లో జ‌రిగే డాగ్ షో కోసం న‌గ‌రానికి వ‌చ్చిన‌ట్లు పేర్కొన్నారు. కాకాసియ‌న్ షెపెర్డ్ అంత‌ర్జాతీయ స్థాయిలో అనేక పోటీల్లో పాల్గొన్న‌ద‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు 32 ప‌త‌కాలు సాధించింద‌ని తెలిపారు. శున‌కాల‌ను ఎంతో ఇష్ట‌పడుతాన‌ని, ప‌లు జాతుల కుక్క‌ల‌ను కోట్ల రూపాయాలు పెట్టి కొనుగోలు చేసిన‌ట్లు చెప్పారు. రూ. 10 కోట్ల విలువ చేసే టిబెట‌న్ మ‌స్తిఫ్‌, రూ. 8 కోట్ల అల‌స్క‌న్ మాలామ్యూట్‌, రూ. కోటి విలువ చేసే కొరియ‌న్ డోసా మ‌స్తిఫ్ జాతి కుక్క‌లు ఉన్న‌ట్లు పేర్కొన్నారు.