Allu Arjun Bail । థియేటర్ వద్ద తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో పుష్ప 2 సినిమా హీరో అల్లు అర్జున్ అరెస్టు.. జైలు.. బెయిలు అంశం అనేక అంశాలను లేవనెత్తుతున్నది. ప్రత్యేకించి నెటిజన్లు ఉమర్ ఖలీద్, గతంలో సుదీర్ఘకాలం జైల్లో ఉండి.. నిర్దోషిగా బయటకు వచ్చి.. జైలు జీవితం కారణంగా కొనసాగిన అనారోగ్యంతో చనిపోయిన ప్రొఫెసర్ సాయిబాబా.. తదితరుల అంశాలను లేవనెత్తుతున్నారు. ఈ అంశంలో సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర చర్చ నడుస్తున్నది. న్యాయ వ్యవస్థ, రాజకీయ జోక్యాలు, వివక్షలేని న్యాయం తదితర అంశాలు ఈ చర్చల్లో చోటు చేసుకుంటున్నాయి. ప్రజాదరణ పొందిన వ్యక్తులకు సంబంధించి ఊహాత్మక సందర్భాలు, సంఘటనలను ప్రస్తావించిన ఒక యూజర్.. అల్లు అర్జున్‌ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారంటూ ప్రశ్నించాడు. ‘దేవుడి ఆదేశంతో క్రికెట్ స్టేడియంలో ఏదైనా జరిగితే విరాట్ కోహ్లీని అరెస్టు చేస్తారా? తెలంగాణలో ఏదైనా జరిగితే ముఖ్యమంత్రిని సైన్యం అరెస్టు చేస్తుందా? అని ప్రశ్నించాడు.
ద్వంద్వ ప్రమాణాల అంశాన్ని ప్రస్తావించిన మరొక యూజర్.. ‘ఒక తప్పిదానికి అల్లు అర్జున్‌ను అరెస్టు చేసినట్టయితే.. కొవిడ్ కాలంలో దారుణాలు, నాణ్యతలేని బ్రిడ్జిల నిర్మాణాలు, రైలు ప్రమాదాలు, అవినీతి విషయంలో మరి రాజకీయ నాయకులపై చర్యలేవని నిలదీశాడు. అల్లు అర్జున్ డబ్బు, రాజకీయ పలుకుబడి ఉంది కాబట్టే రాత్రికి రాత్రే బెయిల్ వచ్చేసిందని కొందరు వ్యాఖ్యానించారు. ‘ఒకే రోజు అల్లు అర్జున్ అరెస్టయ్యాడు, విచారణ జరిగింది, బెయిల్ కూడా లభించింది. న్యాయం మందగమనంలో ఏమీ లేదు; మనం పేదలం అంతే’ అని సదరు యూజర్ తేల్చేశాడు. కొందరు యూజర్లు ఈ విషయంలో రాజకీయ జోక్యాలను ప్రస్తావించారు. ‘రాజకీయ నాయకుల ముందు లీగల్, పోలీస్ డిపార్ట్‌మెంట్లతో ఎలా డ్యాన్స్ చేయించవచ్చునో ప్రపంచానికి రేవంత్‌రెడ్డి చూపారు. బహుశా అసదుద్దీన్ ఒవైసీని మెప్పించేందుకేమో’ అని ఒకరు రాశారు.
‘భారతదేశంలో ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. మీరు తప్పా? ఒప్పా? మీకు సత్వరమే న్యాయం అందుతుందా? అనేది మీ బ్యాంకు బ్యాలెన్స్ డిసైడ్ చేస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?’ అని మిగిలిన యూజర్లను అతను ప్రశ్నించాడు. ఒక యూజర్ చాలా కాలంగా జైల్లో ఉన్న ఉమర్ ఖలీద్ అంశాన్ని ప్రస్తావించాడు. ‘ఒకవైపు అల్లు అర్జున్‌ను అరెస్టు చేస్తారు. విచారణ జరుగుతుంది. ఒకే రోజులో బెయిల్ కూడా వస్తుంది. మరోవైపు ఒమర్ ఖలీద్ బెయిల్ సంగతి పక్కనపెడితే.. ఎలాంటి విచారణ లేకుండా 1530 రోజుల నుంచి జైల్లో మగ్గుతున్నాడు. న్యాయం మందగమనంలో లేదు.. కొన్ని ఎంపిక చేసిన అంశాల్లోనే’ అని వ్యాఖ్యానించాడు. మరికొందరు ప్రొఫెసర్ సాయిబాబాను గుర్తు చేసుకున్నారు.