e-Pass | సమ్మర్‌కి ఊటీ, కొడైకెనాల్‌ వెళ్తున్నారా..? ఆగండి ఆగండి..! ఈ-పాస్‌ తీసుకున్నారా మరి..!

e-Pass | వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది చల్లటి ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. తెలుగు రాష్ట్రాలకు దగ్గరలో మండుటెండల్లో చల్లటి ప్రదేశాలను అనగానే అందరికీ తమిళనాడులోని హిల్‌స్టేషన్‌ ఊటీ, కొడైకెనాల్‌ గుర్తుకువస్తుంటాయి. మరి మీరు కూడా వేసవిలో ఊటీ, కొడైకెనాల్‌ వెళ్తున్నారా..? ఇటీవల ఇక్కడికి వచ్చే పర్యాటకులకు మద్రాస్‌ హైకోర్టు ఆంక్షలు విధించింది.

  • Publish Date - May 12, 2024 / 10:00 AM IST

e-Pass | వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది చల్లటి ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. తెలుగు రాష్ట్రాలకు దగ్గరలో మండుటెండల్లో చల్లటి ప్రదేశాలను అనగానే అందరికీ తమిళనాడులోని హిల్‌స్టేషన్‌ ఊటీ, కొడైకెనాల్‌ గుర్తుకువస్తుంటాయి. మరి మీరు కూడా వేసవిలో ఊటీ, కొడైకెనాల్‌ వెళ్తున్నారా..? ఇటీవల ఇక్కడికి వచ్చే పర్యాటకులకు మద్రాస్‌ హైకోర్టు ఆంక్షలు విధించింది. దేశ, విదేశాల నుంచి ఇక్కడి పర్యాటకులు వస్తుంటారు. ప్రస్తుతం ఇక్కడికి వెళ్లేందుకు మద్రాస్‌ హైకోర్టు ఈ-పాస్‌ విధానం తప్పనిసరి చేసింది.

కరోనా సమయంలో అమలు చేసిన తరహాలోనే ఈ-పాస్‌ విధానం అమలు చేయాలని కోర్టు తమిళనాడు సర్కారును ఆదేశించింది. ఈ క్రమంలో ఊటీ, కొడైకెనాల్‌లో కొత్త విధానం ఇటీవల అమలులోకి వచ్చింది. జూన్‌ 30 వరకు ఇదే విధానం కొనసాగించాలని నీలగిరి, దిండిగుల్ కలెక్టర్లను ఆదేశించింది. త‌మిళ‌నాడులోని ప‌ర్యాట‌క ప్రాంతాల ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్షణ కోసం వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. కొండ ప్రాంతాల‌కు పెద్ద సంఖ్యలో వస్తోన్న పర్యాటకుల కారణంగా అనేక ఇబ్బందులు, సవాళ్లు ఎదురవుతున్నాయని, ఈ-పాస్ విధానం తీసుకురావాలని జస్టిస్ డి భరత చక్రవర్తి, జస్టిస్ ఎన్ సతీశ్ కుమార్‌లతో కూడిన హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.

వేసవి సెలవుల్లో ఇక్కడికి 20వేలకుపైగా వాహనాలు వస్తుంటాయని సర్కారు కోర్టుకు ఇచ్చిన నివేదికలో తెలిపింది. ఒకే సమయంలో అన్ని వాహనాలు వెళ్తే ఇక్కడ వాతావరణంతో పాటు జంతుజాలంపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంది. వాహనాల రద్దీని క్రమబద్దీకరించేందుకు హైకోర్టు నిర్ణయం తీసుకున్నది. ఇక ఇక్కడికి వెళ్లాలనుకునే పర్యాటకులు తప్పనిసరిగా ఈపాస్‌ తీసుకోవాల్సి ఉంటుంది. పర్యాటకుల వివరాలు.. వాహనాల నంబరు, ఎప్పుడు వస్తారు ? ఎన్ని రోజులు ఉంటారు ? ఎక్కడ బస చేస్తారు ? అనే వివరాలు సైతం ఇవ్వాల్సి ఉంటుంది. ఊటీ, కొడైకెనాల్ వెళ్లే టూరిస్టులు epass.tnega.org వెబ్‌సైట్‌లో త‌మ వివ‌రాల‌ను న‌మోదు చేసి ఈ-పాస్ పొందవచ్చని అధికారులు తెలిపారు. అయితే, పాసుల సంఖ్యపై ఎలాంటి పరిమితి ఉండదని అధికారులు తెలిపారు.

Latest News