Site icon vidhaatha

Indian Spice Factory | జపాన్‌లో భారతీయ రుచుల ఘుమఘుమలు – చీర కట్టుకుని వడ్డన

Indian Spice Factory | భారతీయ సంస్కృతి, భారతీయ వంటకాలు, భారతీయతతో మమేకమైపోయిన ఒక జపనీస్ దంపతుల కథ ఇది. జపాన్‌లోని ఒక చిన్న పట్టణంలో ఉన్న “ఇండియన్ స్పైస్ ఫ్యాక్టరీ” (Indian Spice Factory) అనే రెస్టారెంట్‌ ఈ మధ్య అంతర్జాతీయ స్థాయిలో వైరల్ అయింది. కారణం – ఇక్కడి వంటల రుచి మాత్రమే కాదు, వాటి వెనుక ఉన్న భారతీయతకు సంపూర్ణంగా అంకితమైన ప్రేమ.

చీర కట్టుకొని వడ్డించే సచికో

ఇక్కడ భోజనానికి వచ్చిన వారిని ముందుగా ఆకర్షించేది వంటకాలు కాదు, ఆ వంటకాలను వడ్డించే తీరు. రెస్టారెంట్ యజమానురాలు సచికో సాన్, ప్రతిరోజూ భారతీయ సాంప్రదాయ దుస్తులలో – చీర కట్టుకొని భోజనం వడ్డిస్తారు.
ఆమె చిరునవ్వుతో “ఇదిగో మీకు మా ఇంటి వంట” అన్నట్టుగా వడ్డించే తీరు చూసి భారతీయులైనా, జపనీస్ అయినా వారి హృదయం కరిగిపోతుంది.

అరిటాకు మీద భోజనం – దక్షిణాది శైలి

ఇక్కడ భోజనాన్ని ప్లేట్లలో కాకుండా, పచ్చని రిటాకు మీద వడ్డించడం ప్రత్యేకత. దక్షిణ భారతదేశంలో వాడే ఈ పద్ధతిని జపాన్‌కు తీసుకువచ్చారు. పచ్చని రిటాకు మీద వడ్డించినప్పుడు ఆ వంటకాల వాసన, రుచి రెట్టింపు అవుతాయంటారు దక్షిణ భారతీయులు.

బెంగాలీ నుంచి దక్షిణాది వంటల వరకు

ఇక్కడి మెనూ చూసినవారికి ఇది నిజంగా “భారతీయ రుచుల పండుగ” అనిపిస్తుంది. ఫిర్నీ, మురుక్కు నుంచి మొదలు పెట్టి, ప్రత్యేకంగా బెంగాలీ కూరలు, దక్షిణాది వంటకాలు అందరికీ అందుబాటులో ఉంటాయి. భోజనంలో వాసన, రుచి, సంప్రదాయం – అన్నీ కలిసిన ఒక సంపూర్ణ భారతీయ అనుభవం ఇక్కడ లభిస్తుంది.

వీడియో  చూడండి:

భారతదేశంతో అనుబంధం – నకయామా కథ

సచికో భర్త నకయామా సాన్, భారతదేశంలోనే ఈ అనుభవాన్ని సొంతం చేసుకున్నారు. కోల్​కతా, ఢిల్లీ నగరాల్లో ఆయనకు రెస్టారెంట్ నిర్వహణలో అనుభవం ఉంది. అందుకే బెంగాలీ వంటలు ఆయనకు సులువైనవి. “నేను భారతదేశంలో గడిపిన రోజులు నాకు చాలా నేర్పాయి. కోల్​కతా రుచులను, బెంగాలీ వంటల ప్రత్యేకతను జపనీస్ ప్రజలకు పరిచయం చేయగలగడం నాకు ఆనందంగా ఉంది” అని ఆయన చెబుతున్నారు.

రెస్టారెంట్ లోపల భారతీయతే భారతీయత

రెస్టారెంట్ లోపల అడుగుపెట్టగానే కస్టమర్‌కి భారతదేశపు వాతావరణమే ఎదురవుతుంది. గోడలపై భారతీయ కళాఖండాలు, మూలల్లో సంగీత వాయిద్యాలు, అలంకరణలో సంప్రదాయ భారతీయ డిజైన్లు – ఇవన్నీ చూసిన కస్టమర్‌కు ఇది ఒక వంటశాల మాత్రమే కాదు, “మినీ ఇండియా” లా అనిపిస్తుంది.

సోషల్ మీడియాలో వైరల్ – హృదయాలను కదిలించిన ప్రేమ

సోషల్ మీడియాలో వీరి కథ బయటకొచ్చిన వెంటనే వేలాది భారతీయులు, జపనీస్ ఫుడ్ లవర్స్ స్పందించారు.

భారతీయతతో మమేకమైన జపనీస్ దంపతులు

“భోజనం కేవలం కడుపు నింపడం కోసం కాదు, అది సంస్కృతిని పంచుకోవడానికి కూడా ఒక మార్గం” అని నకయామా–సచికో దంపతుల నమ్మకం. అందుకే వారు ప్రతి రోజూ భారతీయ సంప్రదాయాన్ని అనుసరిస్తూ, ఆత్మీయంగా, ఆప్యాయంగా కస్టమర్లకు వడ్డిస్తున్నారు.

Exit mobile version