Cigarette Prices | రూ.18 నుంచి రూ.72కి సిగరెట్ ధర? కొత్త ఎక్సైజ్ బిల్లుపై వైరల్ ప్రచారం

సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు 2025 తర్వాత సిగరెట్ ధరలు రూ.18 నుంచి రూ.72కి పెరుగుతాయన్న ప్రచారం ఎంతవరకు నిజం? ఎక్సైజ్ డ్యూటీ లెక్కలు, వాస్తవ ధరల పెరుగుదలపై పూర్తి నిజనిర్ధారణ వివరాలు

Cigarette price hike in India after Central Excise Amendment Bill 2025 sparks public debate

Cigarette Prices in India: Fact Check on రూ.18 to రూ.72 Claim After Central Excise Amendment Bill 2025

విధాత బిజినెస్​ డెస్క్​ | హైదరాబాద్​:

Cigarette Prices | భారతదేశంలో సిగరెట్ ధరలు ఒక్కసారిగా నాలుగు రెట్లు పెరుగుతాయన్న ప్రచారం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. పార్లమెంట్‌లో సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు, 2025 ఆమోదం పొందిన తర్వాత, ప్రస్తుతం రూ.18కి లభిస్తున్న సిగరెట్ ధర త్వరలోనే రూ.72కి చేరుతుందన్న వార్తలు వైరల్ అయ్యాయి. ఈ ప్రచారం పొగతాగేవారిలో ఆందోళనకు, సాధారణ ప్రజల్లో గందరగోళానికి కారణమైంది. అయితే, ఈ వాదనలో ఎంతవరకు నిజం ఉంది? ప్రభుత్వం వాస్తవంగా ఏం మార్చింది? అన్న అంశాలపై స్పష్టత కావాల్సిఉంది.

కేంద్ర ప్రభుత్వం ఈ సవరణ బిల్లు ద్వారా సిగరెట్లు, సిగార్లు, హుక్కా పొగాకు, బీడీ పొగాకు, జర్దా, సువాసన పొగాకు వంటి ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం, సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీని వాటి పొడవు, రకం ఆధారంగా విధిస్తున్నారు. ఇది ప్రతి 1,000 సిగరెట్లను ఒక యూనిట్​గా పరిగణించి వేస్తారు. ఇప్పటివరకు ఈ సుంకం రూ.200 నుంచి రూ.735 మధ్యలో ఉంది. తాజా సవరణతో ఈ మొత్తాన్ని రూ.2,700 నుంచి రూ.11,000 వరకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

ఎక్సైజ్ సుంకం లెక్కలు: అపోహ ఎక్కడ మొదలైంది?

ఇక్కడే అసలు గందరగోళం మొదలైంది. చాలా మంది కొత్తగా నిర్ణయించిన డ్యూటీ మొత్తాన్ని ఒక్క సిగరెట్‌కు ర్తిస్తుందని అర్థం చేసుకున్నారు. వాస్తవానికి, ఎక్సైజ్ సుంకాన్ని ఎప్పటిలాగే 1,000 సిగరెట్లకు కలిపి విధిస్తారు.

పాత డ్యూటీ ప్రకారం,
1,000 సిగరెట్లకు రూ.200 అంటే ఒక్క సిగరెట్‌కు 20 పైసలు,
రూ.735 అంటే ఒక్క సిగరెట్‌కు పైసలు మాత్రమే.

కొత్త సవరణ ప్రకారం,
1,000 సిగరెట్లకు రూ.2,700 అయితే ఒక్క సిగరెట్‌కు రూ.2.70,
రూ.11,000 అయితే ఒక్క సిగరెట్‌కు రూ.11.00 అవుతుంది.

అంటే పాత డ్యూటీతో పోలిస్తే ఒక్క సిగరెట్‌పై పెరుగుదల:
కనిష్టంగా సుమారు రూ.2.50,
గరిష్ఠంగా సుమారు రూ.10.30 వరకు ఉంటుంది.

దీనిని ప్రస్తుతం మార్కెట్‌లో సాధారణంగా లభించే రూ.18 ధర గల సిగరెట్‌పై వర్తింపజేస్తే, ఒక సిగరెట్​ ధర సుమారు రూ.21 నుంచి రూ.28 మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఈ లెక్కల ప్రకారం, ఒక్క సిగరెట్ ధర నేరుగా రూ.72కి చేరుతుందన్న వాదనకు అధికారికంగా ఎలాంటి ఆధారాలు లేవు. ఇది పూర్తిగా తప్పుడు లెక్కలపై ఆధారపడిన అపోహగా స్పష్టమవుతోంది. ఇదే సోషల్​మీడియాలో వైరల్​గా మారింది.

ధరల పెంపుతో పొగతాగడం తగ్గుతుందా?

సిగరెట్ ధరల పెంపుపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు పొగతాగేవారు, ధరలు పెరిగితే కనీసం వినియోగం తగ్గించడానికి లేదా అలవాటు మానేందుకు ఇది తోడ్పడవచ్చని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం ధర ఎంత పెరిగినా అలవాటు మారదని, అయితే గియితే చౌక బ్రాండ్లకు మారడమే జరుగుతుందని అంటున్నారు. కొందరు ఈ నిర్ణయాన్ని ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛపై ప్రభుత్వ జోక్యంగా విమర్శిస్తుంటే, మరికొందరు దీన్ని ప్రజారోగ్య పరిరక్షణ దిశగా అవసరమైన చర్యగా భావిస్తున్నారు.

గత అనుభవాలను పరిశీలిస్తే, మోస్తరు ధరల పెరుగుదల వల్ల పొగాకు వినియోగం కొంతమేర తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, పూర్తిగా నిర్మూలిస్తుందని మాత్రం చెప్పలేం. అయితే, ప్రభుత్వ లక్ష్యం మాత్రం పొగాకు వినియోగాన్ని నిరుత్సాహపరచడం, ఆరోగ్య వ్యయాలను తగ్గించడం అనే అంశాలపైనే కేంద్రీకృతమై ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

సిగరెట్ ధరలు పెరగడం ఖాయమే. కానీ, ఒక్క సిగరెట్ ధర రూ.18 నుంచి రూ.72కి చేరుతుందన్న ప్రచారం నిజం కాదు. కొత్త ఎక్సైజ్ సవరణ వల్ల ధరలు పెరుగుతాయి గానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నంత తీవ్ర స్థాయిలో మాత్రం కాదు. ఇది డ్యూటీ విధానంపై సరైన అవగాహన లేకుండా సృష్టించబడిన అపోహగా స్పష్టమవుతోంది.

Latest News