US Withdraws From WHO | ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలిగిన అమెరికా..కరోనా ఎఫెక్ట్

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి వైదొలిగిన అమెరికా! నిధులు నిలిపివేస్తూ ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం. అంతర్జాతీయ ఆరోగ్య వ్యవస్థపై పెను ప్రభావం.

US formally withdraws from WHO

విధాత : ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి వైదొలుగుతున్నట్లుగా అమెరికా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పలు సందర్భాల్లో డబ్ల్యుహెచ్ వో సంస్థ నుంచి వైదొలుగుతామని హెచ్చరించిన విషయం తెలిసిందే. కొవిడ్‌ మహమ్మారిని అదుపు చేయడంలో, ఆరోగ్య సంస్కరణలను అమలు చేయడంలో డబ్ల్యూహెచ్‌వో విఫలమైందని అమెరికా ఆరోగ్య, మానవ సేవల విభాగం (HHS) ఈ సందర్బంగా ఆరోపించింది. ఇక నుంచి పరిమిత పరిధి మేరకు ఆ సంస్థతో కలిసి పనిచేయనున్నట్లు యూఎస్‌ అమెరికా ఆరోగ్య శాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్. కెనడీ జూనియర్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ఇకపై డబ్ల్యూహెచ్‌వోకు అమెరికా నుంచి వచ్చే అన్నిరకాల నిధులు నిలిపివేస్తున్నామని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాని అన్ని కార్యాలయాల నుంచి యూఎస్‌ సిబ్బందిని వెనక్కి పిలిపించినట్లు వెల్లడించింది. ఈ సంస్థకు సంబంధించిన సాంకేతిక కమిటీలు, వర్కింగ్ గ్రూపుల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు తెలిపారు.

అమెరికా ప్రయోజనాల కోసమే దూరం

అమెరికా ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యానే డబ్ల్యూహెచ్‌ఓ నుంచి వైదొలిగామని అమెరికా ప్రభుత్వం వెల్లడించింది. డబ్ల్యూహెచ్‌ఓ అమెరికాకు శత్రుత్వం ఉన్న దేశాల ప్రభావానికి లోనై పనిచేసిందని మరోసారి అమెరికా ఆరోపించింది. డబ్ల్యూహెచ్‌ఓ వ్యవస్థాపక దేశాల్లో అమెరికా ఒకటని, ఏటా భారీగా నిధులు అందించే దేశం కూడా తమదేనని గుర్తు చేసింది. ఇచ్చిన సహకారాన్ని మరిచి అమెరికాకు వ్యతిరేకంగా, శత్రుదేశాలకు అనుకూలంగా డబ్ల్యూహెచ్‌ఓ నిర్ణయాలు తీసుకుందని ఆరోపించింది. తన వైఫల్యాలను ‘ప్రజారోగ్య ప్రయోజనాలు’ అనే పేరుతో కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిందని వ్యాఖ్యానించింది. చాలా అంతర్జాతీయ సంస్థల మాదిరిగానే డబ్ల్యూహెచ్‌ఓ కూడా తన హామీలను నిలబెట్టుకోలేదని, ప్రాథమిక లక్ష్యాల నుంచి దారి తప్పిందని ఆరోపించింది. కొన్ని దేశాల రాజకీయ ప్రభావాల నుంచి బయటపడి స్వతంత్రంగా పనిచేయలేకపోయిందని అమెరికా మండిపడింది.

బకాయిలపై సందేహాలు

డబ్ల్యూహెచ్‌వో నుంచి అగ్రరాజ్యం వైదొలిగే సమయానికి అమెరికా దానికి 260 మిలియన్‌ డాలర్ల (రూ.2,382 కోట్లు) బకాయిలను చెల్లించాల్సి ఉందని బ్లూమ్‌బెర్గ్ నివేదికలు వెల్లడించాయి. అమెరికా నిర్ణయంలో ప్రపంచ వ్యాప్తంగా డబ్ల్యుహెచ్ వో అమలు చేస్తున్న ఆరోగ్య రక్షణ చర్యలకు నిధుల కొరత ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వెనుకబడిన దేశాలకు ఆ సంస్థ ద్వారా అందించే సేవలపై ప్రతికూల ప్రభావం పడవచ్చని భావిస్తున్నారు. సంస్థకు అమెరికా ఇవ్వాల్సిన బకాయిల చెల్లింపుకు ట్రంప్ నిరాకరించే అవకాశాలే ఎక్కువంటున్నారు.

డబ్ల్యుహెచ్ వో నుంచి తప్పుకోవాలన్న అమెరికా నిర్ణయంపై WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ స్పందించారు. అమెరికా WHO గురించి పునరాలోచించి తిరిగి చేరుతుందని నేను ఆశిస్తున్నాను” అని అన్నారు. “WHO నుండి వైదొలగడం అమెరికాతో పాటు మిగిలిన ప్రపంచానికి నష్టం అని అభిప్రాయపడ్డారు.

“WHO నుండి అమెరికా వైదొలగడం వల్ల ప్రపంచం ఆరోగ్య ముప్పులను గుర్తించడానికి, నిరోధించడానికి, ప్రతిస్పందించడానికి ఆధారపడే వ్యవస్థలు, పరస్పర సహకార చర్యలు బలహీనపడతాయి అని అమెరికాకు చెందిన ప్రజారోగ్య కార్యక్రమ అధిపతి కెల్లీ హెన్నింగ్ ఆందోళన వెలిబుచ్చారు.

ఇవి కూడా చదవండి :

Outsourcing Corporation | ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు శుభవార్త! టీజీ ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్ ఏర్పాటు యత్నాల్లో సర్కార్‌?

Amazing Facts About Snakes | పాముల గురించి 16 ఆశ్చర్యకర నిజాలు! వీటిలో మీకెన్ని తెలుసు?

Latest News