Special Desk / Interesting / Viral / 20th August 2025
KBC 17 First Crorepati | ప్రముఖ టెలివిజన్ క్విజ్ షో కౌన్ బనేగా క్రోర్‌పతి (KBC) 17వ సీజన్‌లో తొలి కోటీశ్వరుడిగా ఆదిత్య కుమార్ నిలిచాడు. షో ప్రారంభమైన రెండు వారాల వ్యవధిలోనే హాట్‌సీట్‌పై కూర్చున్న ఆదిత్య ప్రశ్నలను ప్రశాంతంగా ఎదుర్కొని, సమతుల్య ధోరణితో ముందుకు సాగి చివరకు ₹1 కోటి బహుమతిని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రశ్నల ధాటిని ఎదుర్కొంటూ ఒక్క క్షణం కూడా తొందరపడకుండా, లైఫ్‌లైన్‌లపై ఎక్కువగా ఆధారపడకుండా, తన మేధస్సును నమ్ముకుని ఆటను కొనసాగించడం ద్వారా ఆయన ప్రత్యేకమైన ముద్ర వేశారు.
₹1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చినట్టు అమితాబ్ బచ్చన్ ధృవీకరించగానే స్టూడియో మొత్తం చప్పట్లతో మార్మోగిపోయింది. అది సాధారణ సమాధానం కాదు, సీజన్‌కి తొలి కోటీశ్వరుడిగా ఆదిత్యను నిలబెట్టిన కీలక ఘట్టం. ఈ సమయంలో బిగ్ బీ ఆయన ఆట తీరు గురించి మాట్లాడుతూ “కష్టపడి సంపాదించిన జ్ఞానం ప్రపంచాన్ని మార్చగలదు” అని వ్యాఖ్యానించారు. ఈ మాటలే తనకు అసలైన బహుమతిగా అనిపించాయని ఆదిత్య తర్వాత మీడియాతో పంచుకున్నాడు. “ఆయన నా జీవితం గురించి అడిగి తెలుసుకున్నారు, ఒత్తిడి సమయంలో నన్ను ప్రోత్సహించారు, నా ఆటతీరును పొగిడారు. నిజంగా ఆ ప్రశంసే నాకు డబ్బుకన్నా గొప్పది” అని ఆయన అన్నారు.
కోటీశ్వరుడిగా నిలవడం ఆదిత్యకు ఒక పెద్ద మైలురాయి అయినా, ఆయన దృష్టి ఇంకా ముందుకే ఉందని చెప్పాడు. “₹1 కోటి ఒక మెట్టు మాత్రమే. నా అసలైన లక్ష్యం ₹7 కోట్లు. ఈ ఆట కేవలం డబ్బు కోసమే కాదు, సంసిద్ధత, ప్రశాంతత, నమ్మకం మనల్ని ఎంత దూరమైనా తీసుకెళ్తాయని నిరూపించుకోవడమే నాకు ముఖ్యమైంది. నిజానికి నాకు ఈ ప్రయాణమే అసలైన విజయం” అని ధైర్యంగా వ్యాఖ్యానించాడు.
ఇప్పటికే KBC 17లో తొలి బంగారు క్షణాన్ని అందించిన ఆదిత్య ఇప్పుడు ₹7 కోట్ల ప్రశ్నను ఎలా ఎదుర్కొంటాడో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఆయన గెలిచినా, ఓడినా, తొలి కోటీశ్వరుడిగా నిలిచి బిగ్ బీ ప్రశంసలు అందుకోవడం ద్వారా ఈ సీజన్‌లో తన పేరును హైలైట్‌గా నిలిపాడనడంలో సందేహం లేదు.