విధాత : టాలీవుడ్ లో కొనసాగుతున్న పాత హిట్ చిత్రాల రీరిలీజ్ ట్రెండ్ క్రమంగా బాలీవుడ్ కు విస్తరించింది. భారతీయ సినీ చరిత్రలో మైలురాయి వంటి చిత్రంగా.. ఆల్ టైమ్ క్లాసిక్ గా, సెల్యులాయిడ్ మ్యాజిక్ గా నిలిచిన ఐకానిక్ ఇండియన్ క్లాసిక్ హిందీ ఫిల్మ్ ‘షోలే’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సారి పాన్ ఇండియా సినిమాగా ‘షోలే: ది ఫైనల్ కట్’ పేరుతో పునరుద్ధరించబడిన 4K ఎడిషన్ తో, డాల్బీ 5.1 సౌండ్‌తో పెద్ద తెరపైకి తిరిగి రావడానికి సిద్ధమవుతోంది. సినిమా తొలి విడుదల సందర్భంగా సెన్సార్ బోర్డు షరతులతో మార్చిన క్లైమాక్స్ తో కాకుండా ఒరిజినల్ క్లైమాక్స్ తో రీరిలీజ్ కాబోతుండటం సినిమాపై మరింత ఆసక్తి పెంచిది. ‘షోలే: ది ఫైనల్ కట్’ మూవీ డిసెంబర్ 12న ఒకేసారి దేశ వ్యాప్తంగా 1500థియేటర్లలో రీ రిలీజ్ కాబోతుంది. షోలే రీరిలీజ్ వర్షన్ రీరిలీజ్ సినిమాల కలెక్షన్లలో కొత్త రికార్డులు సాధించవచ్చని అంచనా వేస్తున్నారు.
50ఏళ్లకు మళ్లీ విడుదల
సిప్పీఫిల్మ్స్ నిర్మాణ సారధ్యంలో రమేష్‌సిప్పీ దర్శకత్వం వహించిన షోలే 1973 ఆగస్టు 15న విడుదలైంది. 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ సినిమాను రీరిలీజ్ చేయబోతున్నారు. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమామాలి(బసంతి)ని లీడ్ రోల్స్‌లో వచ్చిన ఈ సినిమాలో కీలక పాత్రలో సంజీవ్ కుమార్, విలన్‌గా అమ్జాద్ ఖాన్(గబ్బర్ సింగ్) నటించారు. హిందీ సినిమా మేకర్స్‌కే కాదు ఎంతోమంది దర్శకులకు మార్గదర్శకంగా నిలిచిన చిత్రం ఇది. ఎంతోమంది యాక్టర్స్, రైటర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్‌కు ఇదొక డిక్షనరీ. లవ్ స్టోరీ, యాక్షన్, సెంటిమెంట్, అప్పటి సామాజిక పరిస్థితులను ప్రతిబింబించేలా సలీం – జావేద్ ఈ కథను రాశారు. రామ్‌గఢ్ అనే కల్పిత గ్రామంలో ఇద్దరు స్నేహితులైన మోసగాళ్లు జై (అమితాబ్ బచ్చన్), వీరు (ధర్మేంద్ర) లను రిటైర్డ్ పోలీసు ఠాకూర్ బల్దేవ్ సింగ్ (సంజీవ్ కుమార్)..బందీపోటు నాయకుడు గబ్బర్ సింగ్ (అమ్జాద్ ఖాన్) ను పట్టుకోవడానికి నియమించుకుంటాడు. ఈ క్రమంలో జరిగే సంఘటనలు, హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ, కథానాయకుల మధ్య స్నేహం, విలన్ పై పోలీస్ అధికారి సహా బాధిత ప్రజల ప్రతీకారం, వారికి లభించిన న్యాయం వంటి అంశాలతో అనేక ఉత్కంఠభరితమైన మలుపులు, పోరాటాలతో సినిమా కథ సాగుతుంది. కర్ణాటకలోని రామ్ నగర్ అనే ప్రాంతంలో రెండున్నరేళ్ల పాటు ఈ చిత్రాన్ని రూపొందించారు.
షోలే ప్రత్యేకతలు ఎన్నో…
అప్పట్లోనే మూడున్నర కోట్లతో రూపొందిన ఈ చిత్రం విడుదలయ్యాక ముప్ఫై ఐదు కోట్లు రాబట్టడం విశేషం. జపనీస్ సినిమా ‘సెవన్ సమురాయ్’ షొలే సినిమాకు ఓ స్ఫూర్తిగా చెబుతారు.ఈ సినిమాను తొలిసారి రీరిలీజ్ చేసినప్పుడు రూ.13 కోట్లు వసూలు చేసింది. 70 ఎంఎం వైడ్ స్క్రీన్ ఫార్మట్‌లో స్టీరియో ఫోనిక్ సౌండ్ ట్రాక్‌లో తీసిన ఫస్ట్ ఇండియన్ సినిమా షోలే కావడం విశేషం. వంద థియేటర్స్‌లో సిల్వర్ జూబ్లీ జరుపుకున్న తొలి భారతీయ చిత్రమిది. షోలే’ సినిమా కొన్ని థియేటర్లలో అయిదేళ్ల వరకు నడిచింది. ఈ సినిమా విశేషాలు తెలియజేస్తూ ‘షోలే: ఏ కల్చరల్ రీడింగ్’, ‘షోలే: ది మేకింగ్ ఆఫ్ ఏ క్లాసిక్’ లాంటి పుస్తకాలు వచ్చాయి. వితంతువు రాధ (జయ బచ్చన్) ఈ సినిమాలో తన నటనతో మెప్పించారు. అలాగే క్లైమాక్స్‌లో ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడంపై అప్పట్లో దేశంలో ఎమర్జన్సీ నేపథ్యంలో సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పడంతో క్లైమాక్స్‌ను రీషూట్ చేసి గబ్బర్ సింగ్ ను పట్టుకునేందుకు పోలీసులు వచ్చినట్టుగా చూపించారు. డైరెక్టర్ కట్ 204 నిమిషాలు కాగా, 198 నిమిషాల వెర్షన్ సెన్సార్ అయింది. ఆ తర్వాత డైరెక్టర్ కట్‌ను డీవీడీలుగా విడుదల చేశారు. కిత్నే ఆద్మీ థే, జో డర్ గయా సంజో మర్ గయా “..ఆరే హో సాంబా గబ్బర్ సింగ్ పాత్రలో అమ్జాద్ ఖాన్ చెప్పిన డైలాగ్ లు ప్రేక్షకులలో చిరస్మణీయంగా నిలిచాయి.
