Site icon vidhaatha

Raghupati Bhat | హిజాబ్‌ వ్యతిరేక ఆ ఉద్యమాన్ని నడిపించిన ఎమ్మెల్యేకు షాక్‌ ఇచ్చిన బీజేపీ..!

Raghupati Bhat |

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నది. నామినేషన్ల పర్వం నేటితో మొదలుకానున్నది. దాంతో పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇక అధికార పార్టీ బీజేపీ రెండు విడుతల్లో అభ్యర్థులను ప్రకటించింది. అయితే, కొందరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వగా.. మరికొందరికి మొండి చేయి ఇచ్చింది.

ఇందులో కీలక ఉద్యమాన్ని నడిపిన ఎమ్మెల్యేకు మళ్లీ సీటు ఇవ్వకుండా షాక్‌ ఇచ్చింది. ఆయన ఎవరో కాదు ఉడిపి అసెంబ్లీ శాసనస సభ్యుడు రఘుపతి భట్‌. గతేడాది కర్ణాటక ఉడిపిలో హిజాబ్‌ ఆందోళన ప్రారంభమై.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం విధితమే.

విద్యా సంస్థల్లో హిజాబ్‌ ధరించడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరుగడంతో ప్రభుత్వం మద్దతు తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని హైకోర్టు సైతం సమర్థించిన విషయం తెలిసిందే. హిజాబ్‌ ఆందోళనలో కీలకంగా వ్యవహరించిన ఉడిపి ఎమ్మెల్యే రఘుపతి భట్‌కు ఈ సారి బీజేపీ టికెట్‌ నిరాకరించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

అతని స్థానంలో యశ్‌పాల్‌ సువర్ణను అభ్యర్థిగా ప్రకటించింది. టికెట్‌ నిరాకరించడంపై ఆయన భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయంపై తానేమీ బాధపడడం లేదన్న ఆయన.. పార్టీ తనతో వ్యవహరించిన విధానం నచ్చలేదన్నారు.

తనకు టికెట్‌ ఇవ్వడం లేదన్న సమాచారం కూడా ఇవ్వలేదని, కేవలం టీవీ చానల్స్‌ ద్వారా తెలుసుకొని బాధపడ్డానని చెప్పారు. తన కులాన్ని చూసి టికెట్‌ను తిరస్కరిస్తే అంగీకరించనన్నారు. అలుపు లేకుండా పనిచేసే నేతలు బీజేపీకి అవసరం లేదేమోనని, పార్టీ ఎక్కడికి వెళ్లినా విజయం సాధిస్తున్నందున తన లాంటి వ్యక్తుల అవసరం లేదని పార్టీ భావిస్తుండొచ్చన్నారు. కఠిన పరిస్థితుల్లో పార్టీ కోసం పని చేశానని, తనకు ఇచ్చిన అవకాశాలకు కృతజ్ఞుడినై ఉంటానని రఘుపతి భట్‌ చెప్పుకొచ్చారు.

Exit mobile version