భక్తులకు టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి పిలుపు
టిటిడికి 25 గిర్ జాతి గోవులను విరాళంగా అందించిన దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్
విధాత:తిరుమల శ్రీవారికి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పదార్థాలైన బియ్యం, పప్పుదినుసులతోపాటు దేశీయ నెయ్యితో ప్రసాదాలు తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తున్నామని, ఈ విధానాన్ని శాశ్వతంగా కొనసాగించేందుకు దేశీయ గోవులను విరాళంగా అందించాలని టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి భక్తులకు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ బుధవారం టిటిడికి 25 గిర్ జాతి గోవులు, 13 దూడలను విరాళంగా అందజేశారు. తిరుపతిలోని ఎస్వీ గోశాలలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో టిటిడి ఛైర్మన్‌తోపాటు ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ శ్రీవారి నైవేద్యానికి రోజుకు 30 కిలోల నెయ్యి అవసరమవుతుందని,ఇందుకోసం టిటిడి ఉన్న గోవులతోపాటు మరో 500 దేశీయ గోవులు అవసరమవుతాయని తెలిపారు. ఏడుకొండలస్వామికి సూచికగా గిర్, రెడ్ సింథీ, హర్యానా, ఒంగోలు, పుంగనూరు తదితర ఏడు దేశీయ గోజాతుల నుండి నెయ్యి తయారుచేయాలని ప్రణాళిక రూపొందించామన్నారు. ఇందులో భాగంగా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ 25 గిర్ జాతి గోవులు, 13 దూడలను విరాళంగా అందించారని,ఇందుకోసం టిటిడి ట్రస్టుబోర్టు మాజీ సభ్యులు శివకుమార్ సహకారం అందించారని వివరించారు.గతంలో గుడికో గోమాత కార్యక్రమానికి 108 గోవులను విరాళంగా అందించేందుకు వేణుగోపాల్ ముందుకొచ్చారని తెలిపారు.
కృష్ణాష్టమి నుండి నవనీత సేవ
దేశీయ గోవుల నుండి సేకరించిన పాల నుంచి పెరుగు తయారుచేసి, దాన్ని చిలికి వెన్నను తయారుచేసి, స్వామివారికి సమర్పించేందుకు ఆగస్టు 30న కృష్ణాష్టమి నుంచి ప్రయోగాత్మకంగా నవనీత సేవను ప్రారంభిస్తామని ఛైర్మన్ తెలిపారు. రాబోవు 3 - 4 నెలల్లో ఈ సేవను పూర్తిస్థాయిలో నిర్వహిస్తామన్నారు.
దీపారాధన కోసం భక్తుల నుండి దేశీయ నెయ్యి విరాళం స్వీకరణ
శ్రీవారి ఆలయంలో నిత్యం దీపారాధన కోసం దేశీయ నెయ్యి విరాళాలను భక్తుల నుండి స్వీకరిస్తామని ఛైర్మన్ తెలిపారు. ఇందుకోసం ఆలయం వద్ద ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటుచేస్తామని, భక్తులు దేశీయ గోవుల నుండి ఉత్పత్తి చేసిన నెయ్యిని విరాళంగా అందించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
సెప్టెంబరు మొదటివారంలో భక్తులకు అందుబాటులోకి అగరబత్తీలు
టిటిడి ఆలయాల్లో వినియోగించిన పుష్పాలతో అగరబత్తీలు తయారు చేస్తున్నామని, సెప్టెంబరు మొదటి వారంలో వీటిని భక్తులకు విక్రయానికి అందుబాటులో ఉంచుతామని ఛైర్మన్ తెలిపారు. మొదట ఆగస్టు 15న భక్తులకు అందుబాటులో ఉంచాలని ప్రయత్నించామని, యంత్రాలు రావడం ఆలస్యమైందని చెప్పారు. అంతకుముందు ఈవోతో కలిసి గోశాలలోని అగరబత్తీల తయారీ ప్లాంట్‌ను పరిశీలించారు. అక్కడ యంత్రాలను పరిశీలించి తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డా. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్, టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పద్మనాభరెడ్డి, ఎస్వీ గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథరెడ్డి, విజివో మనోహర్ తదితరులు పాల్గొన్నారు.