Site icon vidhaatha

కల్పవృక్ష వాహనంపై..శ్రీ గోవిందరాజస్వామివారి వైభవం

విధాత:తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం ఉదయం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ‌గోవిందరాజస్వామివారు కల్పవృక్ష వాహనంపై కటాక్షించారు. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న‌సేవ నిర్వ‌హించారు.

ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టు. అనేక విధాలైన వృక్షాలు సృష్ఠిలో ఉన్నాయి. అందులో మేటి కల్పవృక్షం. ఇతర వృక్షాలు తమకు కాచిన ఫలాలను మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం వాంఛిత ఫలాలనన్నింటినీ ప్రసాదిస్తుంది. సముద్రమథనంలో సంకల్ప వృక్షంగా ఆవిర్భవించిన దేవతావృక్షం కల్పవృక్షం. స్వామివారు ఈ కల్పవృక్షాన్ని అధిరోహించి భక్తుల కోర్కెలు తీరుస్తారు.

అనంతరం ఉదయం 9.30 గంటల నుండి 10.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపనతిరుమంజనం నిర్వ‌హించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్ళు, ప‌సుపు. చందనంల‌తో అభిషేకం చేశారు.

      సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు సర్వభూపాలవాహనంపై స్వామివారు  దర్శనమిస్తారు.

             ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌‌ రెడ్డి, ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ ఏ.టి.శ్రీ‌నివాస దీక్షితులు, కంక‌ణ బ‌ట్టార్ శ్రీ ఏ.టి. పార్థ‌సార‌ధి దీక్షితులు, సూపరింటెండెంట్లు శ్రీ వెంక‌టాద్రి, శ్రీ కుమార్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ మునీంద్ర‌బాబు, శ్రీ కామ‌రాజు, అర్చకులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.
Exit mobile version