Site icon vidhaatha

ఆగ‌స్టు 18 నుంచి 20వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

విధాత:తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగ‌స్టు 18 నుంచి 20వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఆగ‌స్టు 17న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలిసి తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి.

1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఉదయం 9.00 నుంచి 11.00 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు. ఆగ‌స్టు 18న పవిత్ర‌ ప్రతిష్ట, ఆగ‌స్టు 19న పవిత్ర సమర్పణ, ఆగస్టు 20న పూర్ణాహుతి నిర్వహిస్తారు.

ఆర్జితసేవలు రద్దు : ప‌విత్రోత్స‌వాల కార‌ణంగా ఆగ‌స్టు 18 నుండి 20వ తేదీ వ‌ర‌కు వ‌ర్చువ‌ల్ సేవ‌లైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. అదేవిధంగా ఆగ‌స్టు 17న అంకురార్ప‌ణ సంద‌ర్భంగా సహస్రదీపాలంకార సేవను ర‌ద్ధు చేసింది. కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో శ్రీ‌వారి ప‌విత్రోత్స‌వాల‌ను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

Exit mobile version