విధాత: తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొమ్మిదిరోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో వైభవంగా ముగిశాయి. తొమ్మిదోరోజు రాత్రి ఆలయంలో ధ్వజావరోహణం జరిగింది. ధ్వజారోహణం నాడు గరుడాళ్వార్ ఆహ్వానించిన దేవతలను తిరిగి సాగనంపే కార్యక్రమమే ధ్వజావరోహణం. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి సమక్షంలో బ్రహ్మాది దేవతలకు, అష్టదిక్పాలురకు వీడ్కోలు చెబుతూ గరుడ కేతనాన్ని ధ్వజస్తంభం మీది నుంచి కిందకు దించారు. తిరిగి వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా గరుడాళ్వార్ దేవతలను కోరతాడు. ఈ సందర్భంగా గరుడధ్యానం, భేరిపూజ, భేరితాడనం, గరుడగద్యం, దిక్పాలకగద్యం, గరుడ లగ్నాష్టకం, గరుడ చూర్ణిక అనే ఏడు మంత్రాలను అర్చకులు జపించారు. దాంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి, తితిదే ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి,జేఈవో సదా భార్గవి, పాలకమండలి సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.