Site icon vidhaatha

టిటిడి చైర్మ‌న్‌గా మ‌ళ్లీ వైవీనే?

విధాత:ప్రస్తుతం టీటీడీ చైర్మన్‌గా ఉన్న సుబ్బారెడ్డి రెండేళ్ల పదవీకాలం ఈనెల 22న ముగియనుంది. తనకు ఆ పదవిపై ఆసక్తిలేదని, క్యాబినెట్‌లో చేరాలని ఉందంటూ జగన్ వద్ద సుబ్బారెడ్డి తన ఆకాంక్షను వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. దానితో నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి సుబ్బారెడ్డికి కేటాయించి, తర్వాత మంత్రివర్గంలో తీసుకుంటారని కొంతకాలం పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. అదే సమయంలో మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి లేదా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డిలో ఒకరికి చైర్మన్ ఇవ్వవచ్చని వైసీపీ వర్గాలు సూచనప్రాయంగా చెప్పాయి.

అయితే, ఇప్పటికే ప్రకాశం జిల్లా నుంచి ఎస్వీ సుబ్బారెడ్డి సమీప బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉన్నందున, ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి పదవులు ఇవ్వడం మంచిదికాద‌ని దాన్ని ప‌క్క‌న‌పెట్టేశారంటున్నారు. ఇక మేకపాటి రాజమోహన్‌రెడ్డి కొడుకు మేకపాటి గౌతంరెడ్డి కూడా మంత్రిగా కొనసాగుతున్నందున, రాజమోహన్‌రెడ్డికి టీటీడీ చైర్మన్ ఎలా ఇస్తారన్న ప్రశ్నలు లేవ‌నెత్తారు. ఈలోగా నాలుగు మండలి స్థానాలు భర్తీ చేయడం, అందులో తన పేరు లేకపోవడంతో మరోసారి టీటీడీ చైర్మన్‌గా కొనసాగేందుకు సుబ్బారెడ్డి అంగీకరించారని పార్టీ వర్గాల స‌మాచారం.

ఎస్.వి.సుబ్బారెడ్డినే కొనసాగించాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి కూడా నిర్ణయించినట్లు సమాచారం.
అయితే, వచ్చే రాజ్యసభ ఖాళీల్లో సుబ్బారెడ్డికి సీటు ఇస్తానని జగన్ హామీ ఇచ్చినందుకే, ఆయన టీటీడీ చైర్మన్‌గా కొనసాగేందుకు అంగీకరించారని వైవీ వర్గీయులు చెబుతున్నారు. అయితే మేకపాటి రాజమోహన్‌రెడ్డి కూడా రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో జగన్ బుజ్జగించినందుకే ఆయన పోటీ నుంచి వైదొలగి, ఆదాల ప్రభాకర్‌రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇటు సుబ్బారెడ్డి కూడా ఒంగోలు లోక్‌సభ సీటు ఆశించినప్పటికీ, జగన్ ఒత్తిడి వల్ల ఆ సీటును మాగుంట శ్రీనివాసులురెడ్డికి వ‌దిలేశారు. ఇప్పుడు ఎంపీ టికెట్లు కోల్పోయిన ఇద్దరూ, వచ్చే రాజ్యసభ ఎన్నికలపై కన్నేయడం గ‌మ‌నార్హం.

Exit mobile version