విధాత: గ్రూప్-1పరీక్షల వివాదంలో వారం రోజుల్లో సమగ్ర సమాచారాన్ని అందించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశంకు లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. పరీక్షలతో అవతవకలపై అభ్యర్థులు లేవనెత్తిన సందేహాలను ఆ లేఖలో ప్రస్తావించిన సంజయ్ వాటికి వివరణ ఇవ్వాలని కోరారు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకన విధానం, ఫలితాల విషయంలో అనేక అక్రమాలు, అవకతవకలు, తప్పిదాలు జరిగాయని, నిబంధనల ఉల్లంఘన జరిగిందని పేర్కొంటూ గ్రూప్ 1 అభ్యర్థులు పలుమార్లు తన ద్రుష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో అభ్యర్థుల విజ్ఝప్తులను, ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత టీజీఎస్పీఎస్సీ పైన ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు.
హైకోర్టులో గ్రూప్ 1 కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో టీజీపీఎస్సీ నుండి వచ్చిన సమాచారం ఆధారంగా అవసరమైతే తాను సైతం కేసులో ఇంప్లీడ్ కావాలని బండి సంజయ్ నిర్ణయించారు. లేఖలో ప్రధానంగా మార్కుల ప్రకటన, నోటిఫికేషన్ ఉల్లంఘన, అభ్యర్థుల సంఖ్యలో మార్పులు.. పరీక్ష కేంద్రాల కేటాయింపు.. పరీక్షా పత్రాల మూల్యాంకనంలో జరిగిన పొరపాట్లతో పాటు ఉర్దూ మీడియంలో రాసిన అభ్యర్థులకు, కొన్ని పరీక్ష కేంద్రాల్లోని అభ్యర్తులకు టాప్ ర్యాంకులు రావడాన్ని ఆ లేఖలో ప్రస్తావించారు. వీటికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని వారం రోజుల్లో పంపాలని చైర్మన్ ను కోరారు.