విధాత : అడవికి రాజు సింహం(Lion)..జంతువుల్లో బలమైనదైనప్పటికి తనకు అనువుగాని చోట ఎంత బలమున్నా నిష్ప్రయోజనమే. ఇందుకు నిలువెత్తు నిదర్శనమన్నట్లుగా ఓ భారీ అనకొండకు(Anaconda) చిక్కిన సింహం వీడియో వైరల్ గా మారింది. ఆఫ్రికన్ పార్కులో ఓ నీటి మడుగు వద్ధ నీళ్లు తాగేందుకు సింహం తన పిల్లలతో కలిసి వెళ్లింది. అక్కడే పొదల్లో పొంచి ఉన్న ఓ భారీ అనకొండ అనూహ్యంగా ఆ సింహంపై దాడి చేసి దానిని బంధించేసింది. సింహాన్ని తన భారీ శరీరంలో చుట్టుకుని దాన్ని ఎటు కదలకుండా చేసి మింగేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
అనకొండ కు బందీగా మారి ప్రాణాలు హరించుకుపోతుంటే విలవిలలాడుతున్న తల్లి సింహాన్ని చూసిన పిల్ల సింహాలు తమ తల్లి సింహాన్ని విడిపించేందుకు తమ శక్తిమేరకు ప్రయత్నించాయి. అయినా వాటి వల్ల కాలేదు. చేసేది లేక ఓ పిల్ల సింహం అక్కడికి దగ్గరలో ఉండి ఇదంతా గమనిస్తున్న పార్క్ సిబ్బందికి విషయం తెలిపేందుకు అతని వద్దకు పరుగెత్తడం వీడియోలో కనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సింహం బలమైనదైనప్పటికి..అనువుగాని చోట అధికులం అనరాదనడానికి ఈ ఘటనే నిదర్శనమని కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో ఇది ఏఐ ద్వారా రూపొందించిన వీడియో అయి ఉండచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా సింహం, అనకొండ ఘర్షణ అత్యంత అరుదైన సందర్భమని అంటున్నారు. అందులోనూ వీడియో సహజంగా చిత్రీకరించినదిగా కాకుండా.. సినిమాటిక్ యాంగిల్స్ ఉండటంతో ఇది ఏఐ పనేనని నెటిజన్లు తేల్చేస్తున్నారు.