(విధాత ప్రత్యేకం)
BJP President | ముఖ్యమంత్రులను నిర్ణయించడంలో, మంత్రివర్గ నిర్మాణంలో ఆలస్యమైనప్పుడు కాంగ్రెస్, బీఆరెస్‌లను ఎగతాళి చేసిన బీజేపీ.. సొంత పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని ఎంపిక చేసే విషయంలో ఎందుకు వెనుకబడిపోయింది? సమారు పది మాసాల నుంచి కొత్త అధ్యక్షుడిని ఎందుకు ప్రకటించలేకపోతున్నది? బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో ఉన్న అంతఃకలహాల కారణంగానే రాష్ట్రశాఖ అధ్యక్షుని ఎన్నిక వాయిదాపడుతున్నదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ముందు నుంచీ బీజేపీలో ఉన్న నాయకులకూ కొత్తగా పార్టీలో చేరి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారికి మధ్య సయోధ్య లేదని ఆ పార్టీ నాయకుడొకరు తెలిపారు. ముఖ్యంగా బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మధ్య అస్సలు పొసగడం లేదని ఆ నాయకుడు తెలిపారు. ఇద్దరి మధ్య రాజీ కుదర్చడానికి జరిగిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని ఆ బీజేపీ నాయకుడు చెప్పారు. సీనియర్ నాయకుడైన లక్ష్మణ్‌ను కాదని రాష్ట్ర అధ్యక్షుడిని నియమించే అవకాశాలు తక్కువ. ‘లక్ష్మణ్ పెద్ద నాయకుడు. సౌమ్యుడు. నిబద్ధత కలిగిన నాయకుడే కానీ ఆయనకు జనంలోకి దూసుకెళ్లే చొరవ, దూకుడు లేదు. జనాంగీకారం కూడా అంతగా లేదు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని అధికార పీఠంవైపు పరుగెత్తించాలంటే లక్ష్మణ్ చాలరు. ఆయనను ఒప్పించో మెప్పించో మరొకరిని పార్టీ అధ్యక్షుడిని చేయాలని పార్టీ ప్రయత్నిస్తున్నది’ అని బీజేపీ నాయకుడు తెలిపారు.
ఇకపోతే ఈటల రాజేందర్! ఆయనకు రాష్ట్రవ్యాప్తంగా అనుచరగణం ఉంది. చొరవ ఉన్న నాయకుడు. కేసీఆర్‌ను ఎదిరించిన నాయకునిగా పేరుంది. మంచి వక్త. బీసీ సమూహాలను సమీకరించగలిగిన సంబంధాలు ఉన్నాయి. కానీ ఆయనకు బీజేపీ, ఆరెస్సెస్ పాత నాయకత్వం ఆదరణ అంతగా లేదనే అభిప్రాయాలు కాషాయ శిబిరంలో వినిపిస్తున్నాయి. వారు రాజేందర్‌ను విశ్వాసంలోకి తీసుకోవడం లేదని అంటున్నారు. రాజేందర్ తమనెక్కడ వెనుకబడేసి పోతాడోనన్న ఆందోళన వారిలో ఉందని, రాజేందర్‌తో లక్ష్మణ్ పంచాయితీ అటువంటిదేనని ఒక బీజేపీ నేత చెప్పారు. వీరిద్దరు కాకుండా.. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రరావు, మురళీధర్‌రావు వంటివారు కూడా పార్టీ అధ్యక్షపదవిని ఆశిస్తున్నవారిలో ఉన్నారు. బండి సంజయ్ కేంద్రమంత్రిగా ఉండడానికే ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం.
కాంగ్రెస్ రాష్ట్రంలో పది మాసాలయినా పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయలేదని, ముఖ్యమంత్రి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని బీజేపీ నాయకులు నిత్యం విమర్శలు కురిపిస్తూ ఉంటారు. అదే బీజేపీ నాయకులు తమ పార్టీ అధ్యక్షుడిని ఎందుకు ఎంపిక చేసుకోలేకపోతున్నారు? పార్టీ అధ్యక్షుని ఎంపిక కోసం ఎన్నిసార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడతారు? ఇటు కాంగ్రెస్, అటు బీఆరెస్ ప్రశ్నిస్తున్నాయి. బీజేపీ కార్యకర్తలు కూడా పార్టీలో ఎవరితో పోవాలో, ఎవరి మాట వినాలో అర్థం కాక గందరగోళానికి గురవుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకే కిందికిమీదికి అవుతున్న బీజేపీ నేతలు.. అనూహ్యంగా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిని ఎంపిక చేసుకోవడానికి ఇంకెన్ని నెలలు తీసుకుంటారోనన్న సెటైర్లు సైతం వెలువడుతున్నాయి.