- కవిత అంశంపై గులాబీ బాస్ సైలెంట్
- బీఆర్ఎస్ కు కంట్లో నలుసుగా కేసీఆర్ తనయ
- కవిత సంధించిన ప్రశ్నలకు నో ఆన్సర్
- మరో నేత ఇలా చేసి ఉంటే ఉపేక్షించేవారా?
- కవిత విషయంలో కేసీఆర్ కన్ఫ్యూజన్ లో ఉన్నారా?
- కేటీఆర్ ఆదేశాలతోనే రాయబారాలు?
- తాను పార్టీ మారబోనంటూ వివరణ ఇచ్చుకున్న హరీశ్
హైదరాబాద్, మే 29 (విధాత) : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిరుగుబాటుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా.. లేదంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారా.. అన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతున్నది. కవిత విషయంలో ఎవరూ స్పందించవద్దని.. గప్ చుప్ గా ఉండాలని పార్టీ క్యాడర్ కు కేసీఆర్ ఆదేశాలు చేశారు. కవిత అమెరికా నుంచి వచ్చిన అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ ఎస్ పార్టీలో దెయ్యాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె వ్యవహారం గులాబీ పార్టీకి కంట్లో నలుసుగా తయారైంది. అయితే ఈ అంశంపై కేసీఆర్ నోరు మెదపపోవడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నది. కవిత కాకుండా మరే నేత అయినా బీఆర్ఎస్ పార్టీ మీద ఇటువంటి కామెంట్లు చేసి ఉంటే కేసీఆర్ ఉపేక్షించి ఉండేవారా.. అన్న డిస్కషన్ కూడా పార్టీలో మొదలైంది.
అంతా వ్యూహంలో భాగమేనా..
కేసీఆర్ కవిత విషయంలో వ్యూహాత్మకంగానే మౌనం పాటిస్తున్నారన్న చర్చ జరుగుతున్నది. ఒక వేళ స్పందిస్తే కింది స్థాయి కార్యకర్తలకు అలుసు అవుతామేమోనని కేసీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్టు విశ్లేషణలు సాగుతున్నాయి. ఇక కవిత ఎపిసోడ్ అనంతరం మాజీ మంత్రి హరీశ్ రావు కూడా పార్టీ మారుతారు అన్న ప్రచారం సాగుతున్నది. దీంతో ఆయన బుధవారం ఎర్రవెళ్లిలోని ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిసి తాను పార్టీ వీడే ప్రసక్తే లేదని వివరణ ఇచ్చుకున్నట్టు తెలుస్తున్నది.
కవిత ప్రశ్నలకు సమాధానమేది
అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చి రాగానే ఎయిర్ పోర్టులోనే కవిత కేసీఆర్ పై సూటి ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవాల్సిన పరిస్థితులు కల్పించారు. అయినా ఇప్పటి వరకు ఈ విషయంలో కేసీఆర్ స్పందించకుండా వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. వేరే నాయకుడు వేలెత్తి చూపిస్తే ఈ పాటికి క్రమశిక్షణ పేరుతో హడావుడి చేసి పార్టీ నుంచి మెడలు పట్టి వెళ్లగొట్టేవారు కదా అన్న చర్చ జరుగుతున్నది. గతంలో రాత్రికిరాత్రే దళితుడైన డిప్యూటీ సీఎం రాజయ్యను పదవీచ్యుతుడిని చేసిన విషయం తెలిసిందే. ఇలా పార్టీ నుంచి ఎందరినో క్రమశిక్షణ పేరుతో బయటకు గెంటేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ అలా ఉంచితే కవిత ఎపిసోడ్ లో ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి స్పందిస్తే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనేది కార్యకర్తల్లోకి వెళ్తుంది. స్వంత కుమార్తె కాబట్టి స్పందించారని, నాయకులు అయితే ఇలా స్పందించేవారా అనే వాదన కూడా ఉంది. ఎటూ పాలుపోని కేసీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కేటీఆర్ ఆదేశాలతోనేనా..
కేటీఆర్ ఆదేశంతోనే ఎంపీ దీవకొండ దామోదర రావు, అడ్వకేట్ గండ్ర మోహన్ రావు బంజారాహిల్స్ లోని కవిత నివాసానికి రెండు రోజుల క్రితం వెళ్లినట్టు సమాచారం. తామంతట తామే ఆమెతో రాయబారం నడిపామని వారు చెబుతున్నారు. ఏది ఏమైనా వారిద్దరూ కవితతో సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఈ చర్చలు సఫలం కాలేదని తెలుస్తున్నది.
కవిత పోటీ సంఘం..
సింగరేణి కాలరీస్ లో ఇప్పటికే తెలంగాణ బొగ్గు గని కార్మిక సమాఖ్య బీఆర్ఎస్ కు అనుబంధంగా పనిచేస్తున్నది. దీనికి పోటీగా సింగరేణి జాగృతిని ఏర్పాటు చేస్తూ, 11 ప్రాంతాలకు కో ఆర్డినేటర్లను నియమించారు కవిత. ఇకనుంచి జాగృతి తరఫున ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. ఈ మేరకు తన నివాసంలో సింగరేని కో ఆర్డినేటర్లు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించడం గమనార్హం. ఆమె దూకుడును గమనిస్తే ఎక్కడా కూడా పార్టీతో సర్ధుకుపోయే విధంగా కాకుండా తన స్వంత శైలిలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ పరిణామాలను ముందే పసిగట్టి, బిడ్డ మనస్తత్వం తెలిసిన కేసీఆర్ ఎవరూ నోరు జారవద్దని, విమర్శలు చేయవద్దని ఆదేశించారు. గీత దాటవద్దని, ఏ విమర్శలు చేసినా పట్టించుకోవద్దని సూచించడంతో బీఆర్ఎస్ ముఖ్యనాయకులు మౌనం దాల్చారు. మీడియాకు కన్పించకుండా కొందరు, కన్పించినా స్పందించకుండా తప్పించుకు తిరుగుతున్నారు.
కవిత పార్టీపై సోషల్ మీడియాలో ప్రచారం
పార్టీ మారతారంటూ వస్తున్న వార్తలపై దిగులు చెందిన మాజీ మంత్రి హరీశ్ రావు మేనమామ కేసీఆర్ ముందు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కవిత పార్టీ స్థాపిస్తారని.. హరీశ్ రావు బీజేపీ లేదా వేరే పార్టీలో చేరతారని సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ నడుస్తున్నది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున కవిత తన సొంత రాజకీయ పార్టీని ప్రకటిస్తారని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రకటించడంతో ఈ అంశం మరింత హీటెక్కింది. బీఆర్ఎస్ లో పనిచేసిన నాయకులే హరీశ్ బయటకు రావడం ఖాయమైందని, ఇప్పుడా అప్పుడా అనే విధంగా ఆయన ఉన్నారని ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శల దాడి నేపథ్యంలో మరోసారి హరీశ్, కేసీఆర్ కు తన మనోగతాన్ని సుస్పష్టం చేశారు.