BRS Telangana Sentiment Politics | ఉద్యమం నుంచి స్వరాష్ట్ర సాధన వరకు, అటు నుంచి అధికార పీఠాన్ని పదేళ్ల పాటు అధిష్టించేందుకు తెలంగాణ సెంటిమెంట్ బీఆర్ఎస్‌కు ప్రాణవాయువు. రాష్ట్రం ఏర్పడ్డాక ఇక మాది ఉద్యమ పార్టీ కాదు..ఫక్తు రాజకీయ పార్టీ అని ఉద్యమ సారధి కేసఆర్ స్వయంగా ప్రకటించుకున్నారు. అయితే తమ రాజకీయ మనుగడకు కష్టం వచ్చిన ప్రతిసారి అదే తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించడాన్ని బీఆర్ఎస్ నాయకత్వం అలవాటుగా కొనసాగిస్తోంది. తాజాగా బనకచర్ల, భద్రాచలం ఆలయ భూములు, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ అఖండ భారత్ మ్యాప్ వివాదంపై బీఆర్ఎస్ రగడ దీనికి నిదర్శనంగా కనిపిస్తుంది. స్వరాష్ట్ర సాధన ఉద్యమ సెంటిమెంట్‌తో తొలిసారి అధికారంలోకి వచ్చి…రెండోసారి 2018లో ముందస్తు ఎన్నికల్లో.. చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తు అంశాన్ని బూచీగా చూపి మరోసారి అధికారంలోకి వచ్చిన విషయం అందరికి తెలిసిందే. ఆ తర్వాత టీఆర్ఎస్ ను కాస్తా బీఆర్ఎస్ గా చేసింది. జాతీయ పార్టీగా దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెస్తామంటూ తెలంగాణ ఆత్మను వదిలేసి నేల విడిచి సాము చేసి ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ బాట పట్టిన బీఆర్ఎస్ పతనం కూడా అంతా చూసిందే. అధికారం మత్తు దిగగానే మరోసారి కేసీఆర్ సహా కేటీఆర్, హరీష్ రావులు తమది జాతీయ పార్టీ అన్న సంగతి మరిచి.. పార్లమెంటు ఎన్నికల్లో మళ్లీ సెంటిమెంట్ రాగం అందుకున్నారు. మనకు ఢిల్లీ గులామ్ లు వద్దు..మన ఇంటిపార్టీ బీఆర్ఎస్ ముద్దు అన్న నినాదం అందుకున్నారు. స్వయంగా కేసీఆర్ బస్సు యాత్ర పెట్టుకుని ప్రచారం చేసినా పార్లమెంటు ఎన్నికల్లో జీరోకే పరిమితమైంది. మరీదారుణంగా మూడో స్థానానికి పార్టీ ఓట్ల బలం పడిపోయింది.
చంద్రబాబు పావుగా మరోసారి అదే ఆట
పార్లమెంటు ఎన్నికల సమయంలో ఏపీలో తమ మిత్రుడు వైఎస్ జగన్ అధికారంలో ఉండటం..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొన్ని నెలలే కావడం..కేంద్రంలో ప్రధాని మోదీ హవా సాగుతుండటంతో కేసీఆర్ ఆశించిన రీతిలో తెలంగాణ సెంటిమెంట్ వర్కవుట్ కాలేదు. అయితే ఇప్పుడు ఏపీలో చంద్రబాబు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ..అందులోనూ చంద్రబాబు శిష్యుడిగా ముద్ర పడ్డ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నారు. కేంద్రంలో బీజేపీ ఉండటంతో బీఆర్ఎస్ మరోసారి తన రాజకీయ అస్త్రంగా తెలంగాణ సెంటిమెంట్‌నే ప్రయోగిస్తుంది. ఇందుకు ఇటీవలి వరుస పరిణామాలు బలం చేకూరుస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తొలుత బనకచర్ల వివాదాన్ని ఎత్తుకున్న బీఆర్ఎస్ నాయకత్వం.. తెలంగాణ నది జలాల హక్కుల పరిరక్షణలో చంద్రబాబుకు సన్నిహితులైన రేవంత్, బీజేపీలు విఫలమవుతున్నారంటూ నది జలాల సమస్యపై రచ్చ రేపుతోంది. నదిజలాల వివాదాన్ని రాజేయడం ద్వారా చంద్రబాబును బూచీ(2018ఎన్నికల మాదిరి)గా చూపి రేవంత్ రెడ్డి సర్కార్ ను..కేంద్రంలో టీడీపీ బలంపై ఆధారపడిన బీజేపీ సర్కార్ ను ఇరకాటంలో నెట్టేందుకు బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తుందంటున్నారు. నది జలాల వివాదాన్ని పరిష్కరించాల్సిన కేంద్రంలోని బీజేపీ ఏపీకి వంతపాడుతూ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందంటూ విమర్శిస్తోంది బీఆర్ ఎస్. దీంతో రాష్ట్రంలో బలం పుంజుకుంటున్న బీజేపీని కట్టడి చేయాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. వీలైనంత వరకు నది జలాల వివాదంపై రచ్చ రేపుతూ.. కేంద్ర, రాష్ట్రాల్లోని అధికార పార్టీలను ఇరకాటంలో పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో దెబ్బతీయాలని బీఆర్ఎస్ నాయకత్వం ఆలోచనగా ఉందంటున్నారు విశ్లేషకులు.
భద్రాచలం భూముల రగడ అందుకేనా?
బనకచర్లతో నది జలాల వివాదాలపై రచ్చ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి తాజాగా భద్రాచలం ఆలయ భూములు..ఏపీలో కలిపిన ఏడు మండలాల సమస్య మరో సెంటిమెంట్ అస్త్రంగా మారింది. ముందుగా తెలంగాణ జాగృతి తరుపునా ప్రస్తుతం కవిత ఈవివాదాన్ని ఎత్తుకుంది. సకాలంలో స్పందించిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ డ్యామేజ్ కాకముందే మంత్రి తుమ్మల సారధ్యంలో ఇటీవల రాష్ట్రానికి వచ్చిన అమిత్ షాను కలిసి వినతి పత్రం అందించారు. దీని ద్వారా ఏడు మండలాల అప్పగింత వ్యవహారంలో తమవంతు పాత్ర పోషించేశారు. అయితే ఏపీ పరిధిలో ఉన్న భద్రాచలం ఆలయ భూముల ఆక్రమణను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ ఈవో రమాదేవిపై అక్కడి స్థానికులు దాడి చేయడం బీఆర్ఎస్ కు మరో అస్త్రంగా మారింది. రాముడి భూముల రక్షణకు వెళ్లిన తెలంగాణ అధికారిణిపై ఆంధ్రోళ్లు దాడి చేశారంటూ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. దీనిపై కాంగ్రెస్, బీజేపీలు, టీడీపీలు స్పందించాలని..ఆ మండలాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ కు పదును పెట్టారు. ఈ క్రమంలోనే కవిత, కేటీఆర్, హరీష్ రావులు ఈ వివాదంపై వరుస ప్రకటనలు చేస్తున్నారు. భద్రాచలం భూముల వివాదంలోనూ చంద్రబాబు భుజాలపై తుపాకి పెట్టి బీజేపీ, కాంగ్రెస్ లపై బీఆర్ఎస్ రాజకీయ దాడి చేస్తుండటం గమనార్హం.
అందివచ్చిన భారత్ మ్యాప్ వివాదం
ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ మంత్రి నారా లోకేష్ కు బహుకరించిన అఖండ భారత్ మ్యాప్ వ్యవహారాన్ని కూడా బీఆర్ఎస్ వదలిపెట్టలేదు. ఆ మ్యాప్‌లో తెలంగాణ రాష్ట్రం మినహా దేశంలోని మిగతా రాష్ట్రాలను చూపిన తీరును బీఆర్ఎస్ ఎత్తిచూపుతూ బీజేపీ, టీడీపీలను తప్పుబడుతోంది. దేశ సాంస్కృతిక వైభవం పేరుతో రూ పొందించిన చిత్రపటంలో ఏపీలోనే తెలంగాణ ఉన్న ట్టు చూపించడం వెనుక పెద్ద కుట్రనే ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. తెలంగాణ అస్తిత్వాన్ని భౌగోళిక గుర్తింపుని లెక్కచేయకపోవడం బీజేపీ అధికారిక విధానమా? అని ప్రధాని నరేంద్ర మోదీని కేటీఆర్ ప్రశ్నించారు. దేశ చిత్రపటం నుంచి మా చరిత్రను తొలగిస్తే మేమెవరం? ఇది మీ పార్టీ అధికారిక అభిప్రాయమా? లేదా ఈ చర్య కేవలం ఒక పొరపాటా అనే విషయంపై వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పొరపాటైతే మీ పార్టీ నాయకత్వం వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇలా వరుసగా బనకచర్ల..భద్రాచలం..అఖండ భారత్ మ్యాప్ వంటి సెంటిమెంట్ వివాదాలు అస్త్రంగా రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ లకు చెక్ పెట్టాలన్న బీఆర్ఎస్ వ్యూహం ఎంతమేరకు ఆ పార్టీ బలపేతానికి ఉపకరిస్తుందన్నది మునుముందు చూడాల్సి ఉందంటున్నారు విశ్లేషకులు.