తెలంగాణ స్థానిక ఎన్నికల్లో ‘కూటమి’! టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయా?

ఏపీలో విజయవంతమైన ‘కూటమి’ ఫార్ములాను తెలంగాణలో ప్రయోగించేందుకు బీజేపీ సిద్ధమవుతున్నదా? రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా తిరిగి నిలదొక్కుకున్న కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు టీడీపీ, జనసేన సహకారం తీసుకోవాలనుకుంటున్నదా? అంటే రాజకీయ వర్గాలు అవుననే అంటున్నాయి.

  • Publish Date - July 1, 2024 / 01:59 AM IST

తెలంగాణలోనూ ‘కూటమి’?
ఏపీ తరహాలో బీజేపీ, టీడీపీ, జనసేన జట్టు!
రాబోయే స్థానిక ఎన్నికల్లో పోటీకి యోచన
నానాటికీ బలహీనపడుతున్న బీఆరెస్‌
దాని స్థానాన్ని కూటమితో భర్తీ చేసే ప్లాన్‌
(విధాత ప్రత్యేకం)
ఏపీలో విజయవంతమైన ‘కూటమి’ ఫార్ములాను తెలంగాణలో ప్రయోగించేందుకు బీజేపీ సిద్ధమవుతున్నదా? రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా తిరిగి నిలదొక్కుకున్న కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు టీడీపీ, జనసేన సహకారం తీసుకోవాలనుకుంటున్నదా? అంటే రాజకీయ వర్గాలు అవుననే అంటున్నాయి. ఏపీలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ.. ఆయనను గద్దె దించేందుకు టీడీపీకి జనసేన, బీజేపీ మద్దతు కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీ కన్ను తెలంగాణపై పడింది. ఎలాగైనా ఇక్కడ బలమైన ప్రతిపక్షంగా ఎదిగి.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను సవాలు చేయాలనే టార్గెట్‌ పెట్టుకుని పనిచేస్తున్నది.
అయితే.. రాష్ట్రంలో బీఆరెస్‌ నానాటికీ బలహీనపడుతున్నదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి.. పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారి లోక్‌సభలో ప్రాతినిథ్యం లేని దుస్థితికి బీఆరెస్‌ చేరుకున్నది. అయితే.. ఈ రాజకీయ ఖాళీని భర్తీ చేయాలని బీజేపీ ఆశిస్తున్నా.. రాష్ట్రంలోని ప్రజల రాజకీయ చైతన్యం బీజేపీ రాజకీయాలను పూర్తిస్థాయిలో ఆమోదించే పరిస్థితి లేదు. ఇక్కడి పరమత సహనం బీజేపీకి పెద్ద మైనస్‌ పాయింట్‌గా పరిణమిస్తున్నది. ఈ క్రమంలోనే దానిని జనాదరణతో అధిగమించడానికి కూటమి రాజకీయం పనిచేస్తుందనే అభిప్రాయం కాషాయ పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో టీడీపీ, జనసేనలకు మళ్లీ తెలంగాణలో ప్రవేశానికి మార్గం సుగమం చేయాలనే ఉద్దేశంతో బీజేపీ ఉన్నట్టు తెలుస్తున్నది. టీడీపీకి తెలంగాణలో ఒకప్పుడు బలమైన నాయకత్వం, క్యాడర్‌ ఉన్నది. కానీ.. రాష్ట్రంలో తనకు ప్రత్యామ్నాయంగా ఎవరూ ఉండరాదని భావించిన ఆనాటి బీఆరెస్‌ నాయకత్వం.. మొదట టీడీపీని తెలంగాణ రాజకీయ చిత్రపటం నుంచి మాయం చేసింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలను బీఆరెస్‌లో కలుపుకొన్నది. అప్పటికి బీజేపీ పెద్ద ప్రభావం కలిగిన పార్టీగా లేదు. దీంతో కాంగ్రెస్‌ను సైతం బలహీనపర్చింది.
బీఆరెస్‌ చేసిన ఈ రాజకీయ తప్పిదంతో అనూహ్యంగా ఆ ఖాళీని బీజేపీ భర్తీ చేసింది. పలువురు నేతలు బీఆరెస్‌లోకి వెళ్లలేక బీజేపీని ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. దీంతో గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో బలీయమైన శక్తిగా ఎదిగింది. వాస్తవానికి పార్టీ బలం కంటే.. ఆ పార్టీలోకి వెళ్లిన నాయకుల బలంతోనే తన సీట్ల సంఖ్యను పెంచుకున్నదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఉదాహరణకు లోక్‌సభ ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, డీకే అరుణ, గొడం నగేశ్‌ వంటివారు బీజేపీ బలంమీద కంటే.. సొంత బలంపైనే గెలిచారు. ఈ సూత్రం ఆధారంగానే బీజేపీ ఈసారి పార్టీ సిద్ధాంతం కంటే జనాదరణ ఉన్న నాయకులపైనే ఆధారపడాలని భావిస్తున్నది. దీంతో హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో సెటిలర్ల ఓటింగ్‌ను, ఇతర ప్రాంతాల్లో టీడీపీకి సంప్రదాయంగా ఉన్న మద్దతుదారులతోపాటు.. పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిగత అభిమానులను దృష్టిలో పెట్టుకుని జనసేనను ఇక్కడ పోటీకి దింపితే సంఖ్యాబలాలు తనకు అనుకూలంగా పుంజకుంటాయనే అభిప్రాయంతో ఉన్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో దీనికి త్వరలో తెలంగాణలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రయోగవేదికగా మార్చాలనే అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తున్నది. స్థానిక ఎన్నికల్లో ఏపీ తరహాలోనే కూటమి పేరుతో పోటీ చేసే ఉద్దేశంతో బీజేపీ ఉన్నట్టు తెలుస్తున్నది. దీనిని తెలంగాణ ప్రజలు ఏ మేరకు ఆమోదిస్తారు? కాంగ్రెస్‌ ఈ కూటమిని ఎలా తిప్పికొడుతుందన్న దానిపై భావి రాజకీయ దృశ్యం ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Latest News