చేవెళ్ల బాధితులను పరామర్శించే తీరిక లేదా?

కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం వెళ్లే ఘాట్ రోడ్డు లో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు లోయలో పడి 65 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన తరువాత అప్పటి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు బాధితులను పరామర్శించలేదని బీజేపీ మొదలు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు.

 

హైదరాబాద్, విధాత: కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం వెళ్లే ఘాట్ రోడ్డు లో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు లోయలో పడి 65 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన తరువాత అప్పటి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు బాధితులను పరామర్శించలేదని బీజేపీ మొదలు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. సోమవారం నాడు చేవెళ్ల లో జరిగిన బస్సు-టిప్పర్ యాక్సిడెంట్ లో 19 మంది ప్రయాణీకులు ప్రాణాలు విడిచారు. ప్రమాద ఘటన జరిగిన రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించి, బాధితులను పరామర్శిస్తారని స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆశించారు. మరునాడు అయినా రేవంత్ రెడ్డి బాధిత కుటుంబాలను ఓదార్చుతారని, రోడ్డు విస్తరణ పనులపై ప్రకటన చేస్తారని ఎదురు చూసి నిరాశపడ్డారు.

జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం ఘాట్ రోడ్డులో 2018 సెప్టెంబర్ 11వ తేదీన ఘోర బస్సు ప్రమాదం జరిగింది. దేవాలయం నుంచి ఘాట్ రోడ్డులో కిందికి వస్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. బస్సులో 108 మంది ప్రయాణీకులు ఉండగా, 65 మంది చనిపోయారు. దేశ చరిత్రలోనే బస్సు ప్రమాదాలలో ఒకటిగా నిలిచింది. సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో 2018 నవంబర్ లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ, 65 మంది చనిపోతే పరామర్శించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సమయం లేదని విమర్శించారు. అక్కడెక్కడో పంజాబ్ లో రైతులు చనిపోతే చెక్కులు ఇస్తున్నారు, కొండగట్టులో భక్తులు చనిపోతే కేసీఆర్ పరామర్శించలేదని అప్పటి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు.

పేదోళ్ల ఉసురు ఊరికే పోదని ఆయన దుమ్మెత్తిపోశారు. బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకుంటే కేసీఆర్ కు పాలాభిషేకం చేస్తానన్నారు. కొండగట్టు బస్సు ప్రమాదం తరువాత అప్పటి మంత్రి టీ.హరీశ్ రావు ఎందుకు నోరు మెదపలేదని మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి ఇటీవలే ప్రశ్నించారు. కేసీఆర్ కూడా ప్రమాదం జరిగిన ఘాట్ రోడ్డు వద్దకు ఎందుకు వెళ్లలేదని ఆయన నిలదీశారు. బస్సు ప్రమాదంలో మరణించిన 65 మంది కుటుంబాల సభ్యులను పరామర్శించేందుకు కేసీఆర్ ఎందుకు వెళ్లలేదని టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ కూడా ప్రశ్నించారు. ఇప్పటికైనా బాధిత కుటుంబాలను పరామర్శించి, ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంతటి విషాద ఘటనపై కేసీఆర్ స్పందించకపోగా ఇతర రాష్ట్రాలలో రైతులకు చెక్కులు పంపిణీ చేస్తున్నారనే విమర్శలను ఎదుర్కొన్నారు.

చేవెళ్ల బస్సు ప్రమాదం బాధితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శిస్తారని మంగళవారం సాయంత్రం వరకు ఎదురు చూశారు. బస్సులో ప్రయాణించిన వారిలో ఎక్కువగా వికారాబాద్ జిల్లా ప్రాంతానికి చెందిన వారే ఉన్నారు. దీంతో ఆయన తప్పకుండా వస్తారని, బాధితులను ఓదార్చుతారని కాంగ్రెస్ నాయకులు కూడా ఊహించారు. సోమవారం నాడు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఎస్.ఎల్.బీ.సీ టన్నెల్ పనులను పరిశీలించి సమీక్షించారు. మంగళవారం నాడు ఇతర కార్యక్రమాలతో పాటు నగరంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి రాకపోయినా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రంగారెడ్డి జిల్లా ఇన్ ఛార్జీ మంత్రి డీ.శ్రీధర్ బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. వీరితో పాటు మాజీ మంత్రి పీ.సబితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సందర్శించి, బాధితులను ఓదార్చారు. క్షతగాత్ర కుటుంబాల నుంచి ప్రతిఘటన, విమర్శలు ఎదురైనా, వారిని సముదాయించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ఇచ్చిన విలువ, సమయం బస్సు ప్రమాదంలో చనిపోయిన 19 మంది కుటుంబాలకు రేవంత్ రెడ్డి ఇవ్వడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పుడు కొండగట్టు ప్రమాద ప్రాంతాన్ని కేసీఆర్ సందర్శించలేదని, ఇప్పుడు చేవెళ్ల బస్సు దుర్ఘటన బాధితులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించలేదనే వ్యాఖ్యలు మొదలయ్యాయి.