Site icon vidhaatha

SLBC Dispute: ఎస్సెల్బీసీకి 30 టీఎంసీల కేటాయింపులు అలానే ఉన్నాయా?

SLBC Dispute : శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (SLBC) సొరంగం ప్రాజెక్టు ప్రమాదంలో ఎనిమిది మంది గల్లంతైన నేపథ్యంలో సొరంగం ప్రాజెక్టు పనులపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పరస్పర ఆరోపణలు హాట్ టాపిక్‌గా మారాయి. కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందన్న అక్కసుతో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో సొరంగం పనులను అటకెక్కించిందని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా.. తమ హ‌యాంలో ఎస్‌ఎల్‌బీసీ పనులు చేయలేదని నిరూపిస్తే రాజీనామాకు తాను సిద్ధ‌మ‌ని, లేదంటే ముఖ్య‌మంత్రి పదవికి రాజీనామా చేస్తావా? అని రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్‌ విసిరారు. ఇదెలా ఉన్నా.. అస‌లు ఎస్సెల్బీసీకి నీటి కేటాయింపులు ఉన్నాయా? ఉంటే అవి భ‌ద్రంగానే ఉన్నాయా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  ఎస్సెల్బీసీకి శ్రీ‌శైలం ప్రాజెక్టు నుంచి 30 టీఎంసీల కృష్ణా జ‌లాల‌ను గ‌తంలో కేటాయించారు. అయితే.. గ‌త బీఆరెస్ ప్ర‌భుత్వంలో వాటిని పాల‌మూరు రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి మ‌ళ్లిస్తూ జీవో జారీ చేశారు. వాస్త‌వానికి బీఆరెస్ ప‌దేళ్ల హ‌యాంలో ట‌న్నెల్ త‌వ్వ‌కం ప‌నులు ఇంత చేశాం.. అంత చేశాం అని చెబుతున్నా.. త‌వ్వ‌కాలు మాత్రం కొన‌సాగ‌లేద‌ని కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. ఎస్సెల్బీసీకి ఉన్న కేటాయింపును రద్దు చేసి, పాల‌మూరు రంగారెడ్డికి ఆ నీటిని మళ్లించడం అంటేనే ఎస్సెల్బీసీని పూర్తి చేయాలనే ఉద్దేశం నాటి ప్రభుత్వానికి లేదని తేలిపోయింది. అందుకే బీఆరెస్ హ‌యాంలో ట‌న్నెల్ త‌వ్వకం ప‌నుల‌ను అట‌కెక్కించార‌న్న వాద‌న వినిపిస్తున్న‌ది. ఎస్సెల్బీసీ నీటిని మ‌రో ప్రాజెక్టుకు ఎలా మ‌ళ్లిస్తారంటూ నాటి బీఆరెస్ ప్ర‌భుత్వంపై అప్ప‌టి ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ నేత‌లుగా ప్ర‌స్తుత మంత్రులు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి వంటివారు తీవ్ర‌స్థాయిలో ఫైర‌య్యారు. ఈ నేప‌థ్యంలో తాజాగా అస‌లు ఎస్సెల్బీసీకి నీటి కేటాయింపులు ప‌దిలంగానే ఉన్నాయా? లేదా? అనే విష‌యంలో ఇదే మంత్రులు వివ‌ర‌ణ ఇస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అడుగడుగునా ఆటంకాలే
శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (SLBC) సొరంగం పనులకు ఆది నుంచి ఆటంకాలే ఎదురవుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4.15లక్షల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరైడ్ పీడిత 516 గ్రామాలకు తాగునీటిని గ్రావిటీ ద్వారా అందించేందుకు ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ – SLBC)ను ప్రతిపాదించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 30టీఎంసీల నీటిని తీసుకునేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట నుంచి నల్లగొండ జిల్లాను ఆనుకొని ఉన్న మన్నెవారిపల్లి (ఔట్ లెట్) వరకు 43.930 కిలోమీటర్ల పొడవున 10 మీటర్ల వెడల్పుతో తొలి సొరంగాన్ని ప్రతిపాదించారు. అవుట్‌లెట్ వద్ద 7.64 టీఎంసీల సామర్ధ్యంతో నక్కలగండి రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారు. ఇక్కడి నుంచి నీటిని పెండ్లిపాకల రిజర్వాయర్‌కు తరలించేందుకు 7.13 కిలోమీటర్ల రెండవ సొరంగాన్ని చేపట్టారు. దీన్ని గుర్రపు డెక్క ఆకారంలో బ్లాస్టింగ్ పద్ధతిలో చేపట్టారు. పెండ్లి పాకల రిజర్వాయర్ నుంచి 15 కిలోమీటర్ల ఓపెన్ చానల్ ద్వారా అక్కంపల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తారు. ఇక్కడి నుంచే హైదరాబాద్‌కు తాగునీటి సరఫరా చేయాల్సి ఉన్న‌ది. అక్కంపల్లి నుంచి ఇప్పటికే ఉన్న ఎమ్మార్పీ ప్రధాన కాలువ ద్వారా పానగల్‌ ఉదయం సముద్రం వరకు నీటిని తరలిస్తారు. మధ్యలో పానగల్ ఉదయ సముద్రం రిజర్వాయర్ నుంచి బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల పథకానికి కూడా నీటిని పంపింగ్ చేయనున్నారు.

తెలంగాణ ఆవిర్భావం అనంత‌రం..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నాటి కేసీఆర్ ప్రభుత్వం పనులు చేపట్టేందుకు 2015లో కాంట్రాక్టు సంస్థకు రూ.100 కోట్లను అడ్వాన్స్‌గా చెల్లించింది. పనులు కొనసాగుతుండగానే మరో రూ.100 కోట్లను కూడా అడ్వాన్స్‌గా చెల్లించింది. కాంట్రాక్టర్ పెండింగ్ బిల్లులు, కరెంటు బిల్లులకే ఆ నిధులు స‌రిపోయాయి. ఇంతలో శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి ఇన్‌లెట్‌ టన్నెల్‌లోకి 2018న భారీగా నీరు వచ్చి చేరింది. ఫలితంగా బోరింగ్‌ పనులు ఆగిపోయాయి. డీవాటరింగ్‌ సిస్టమ్‌ను మెరుపరచి, 2019 డిసెంబర్‌ వరకు నీటిని తొలగించారు.

సొరంగం పనులలో ఎవరెవరు ఎంత..?
శ్రీశైలం అభయారణ్య ప్రాంతంలో సంప్రదాయ పద్ధతిలో సొరంగం తవ్వకానికి అటవీ అనుమతి వచ్చే అవకాశం లేక భూమికి 400 నుంచి 450 మీటర్ల దిగువన టీబీఎం యంత్రాలతో తవ్వకం పనులు చేపట్టారు. 10 మీటర్ల వ్యాసంతో టీబీఎం యంత్రం సొరంగం తవ్వి లైనింగ్‌ పూర్తయ్యాక 9.2 మీటర్ల వ్యాసంతో నీటి ప్రవాహానికి మార్గం వేస్తారు. టీబీఎం మిషన్లతో తవ్వకం జరిగే తొలి సొరంగం పొడవు: 43.93 కిలోమీటర్లలో 34.71 కిలోమీటర్లు పూర్తయ్యింది. ఇన్ లెట్, అవుట్ లెట్ మధ్య 9.6 కిలోమీటర్లు పెండింగ్ ఉంది. సంప్రదాయ పద్ధతిలో తవ్వకాలు సాగిన రెండో సొరంగం పొడవు 7.13 కిలోమీటర్లకుగాను తవ్వకం పనులు మొత్తం పూర్తయ్యాయి.

4,870 రోజులు ప‌నులు బంద్‌
ఇప్పటిదాకా జరిగిన సొరంగ పనులు మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే జరిగాయని.. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సొరంగం పనులు జరగలేదని కాంగ్రెస్ చెబుతున్న‌ది. పనుల వివరాలలోకి వెళితే ఎస్‌ఎల్‌బీసీలో సొరంగం పనులు నిలిచిపోయి ఏకంగా 4,870 రోజులు గడిచింది. విద్యుత్తు బిల్లులు చెల్లించక 460 రోజులు సరఫరా నిలిచిపోయింది. 2020-21, 2023-24లలో రెండు టీబీఎంలు ఒక్క రోజు కూడా పనిచేయలేదు. శ్రీశైలం నుంచి నీటిని తీసుకొనే (ఇన్‌లెట్‌) వైపు సొరంగం తవ్వే టీబీఎం (ప్రస్తుతం ప్రమాదం జరిగింది) 2008-09 నుంచి 2010-11 వరకు, 2020-21 నుంచి 2023-24 వరకు ఒక్క రోజు కూడా పనిచేయలేదు. ఈ ఏడాదిలో ప్రమాదం జరగడానికి ముందు 18 రోజులపాటు పనిజరిగింది. 2014 మే నెల వరకు నీటిని బయటకు వదిలే (ఔట్‌లెట్‌) వైపు నుంచి ఒక టీబీఎం యంత్రం 13.920 కి.మీ. తవ్వగా, ఇన్‌లెట్‌ వైపు ఇంకో టీబీఎం యంత్రం 8.970 కి.మీ. కలిపి మొత్తం 22.89 కి.మీ. దూరం పని జరిగింది. 2014 నుంచి ఇప్పటివరకు శ్రీశైలం వైపు నుంచి 4.985 కి.మీ., ఔట్‌లెట్‌ నుంచి 6.515 కి.మీ కలిపి 11.5 కి.మీ. పని జరిగింది. మొత్తం మీద రెండువైపులా కలిపి 34.39 కి.మీ. దూరం పూర్తయింది. బీఆర్ఎస్ హయాంలో సొరంగం పనులు జరుగలేదనడానికి ఈ లెక్కలే నిదర్శనమని కాంగ్రెస్ ఆరోపిస్తున్న‌ది.

Exit mobile version