Etala Rajender vs Bandi Sanjay | హైదరాబాద్, జూలై 20 (విధాత) : వారిద్దరూ బీజేపీ నాయకు. ఇద్దరూ ఎంపీలు కూడా! కానీ.. ఇద్దరూ ఢీ అంటే ఢీ అంటున్నారు. ఒకరు కేంద్ర మంత్రి బండి సంజయ్, మరొకరు ఈటల రాజేందర్! హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ శ్రేణులు శనివారం ఈటల నివాసంలో భేటీ, ఆ సమయంలో ఈటల చేసిన హాట్ కామెంట్లు.. అంతర్గతంగా ఉన్న ఈ ముఠా తగాదాలను బహిర్గతం చేసింది. ‘బీకేర్ ఫుల్ బిడ్డా’ అంటూ ఈటల రాజేందర్ తాడో పేడో అన్నట్టు మాట్లాడారు. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ ఈ వ్యాఖ్యలతో మరింత పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటల రాజేందర్ ఆశించినా.. దక్కలేదు. మరో వైపు హుజూరాబాద్‌లో తన వర్గాన్ని కాపాడుకోవాల్సిన అనివార్య పరిస్థితులు ఆయనకు వచ్చాయి. ఈ పోరాటంలో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితికి ఈటలదని అంటున్నారు. తనను నమ్ముకున్న వారి కోసం రాజేందర్ ఎటువైపు అడుగులు వేస్తారనేది ప్రస్తుతం సర్వత్రా ఆసక్తిగా మారింది.
బీఆర్ఎస్ నుంచి ఈటల రాజేందర్‌ను వెళ్లగొట్టిన తర్వాత రాష్ట్రంలోని కాంగ్రెస్ సహా ఇతర పార్టీలకు చెందిన కీలక నాయకులతో అప్పట్లో ఆయన సమావేశాలు నిర్వహించారు. ఈటలను బీజేపీలో చేర్చుకునే ప్రతిపాదనను అప్పట్లో బీజేపీలో ఉన్న వివేక్ వెంకటస్వామి ద్వారా అప్పటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌కు చేరిందని చెబుతారు. బీజేపీ అధినాయకత్వంతో చర్చించేందుకు బండి ప్రయత్నించారనని, కానీ, అధిష్ఠానం ఇతర రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులు, పనుల ఒత్తిడితో ఫోకస్ చేయలేదనే ప్రచారం ఉండింది. ఆ సమయంలో కిషన్ రెడ్డి చొరవ చేసి.. అమిత్ షాతో చర్చించడంతో ఈటల బీజేపీలో చేరికకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అప్పట్లో చర్చలు జరిగాయి. రాజేందర్‌ను పార్టీలో చేర్చుకొనే విషయంలో బండి సంజయ్‌కు సమాచారం ఇచ్చినా సరిగా స్పందించలేదనే ఫీడ్ బ్యాక్ అప్పట్లో పార్టీ పెద్దలకు వెళ్లిందనే అభిప్రాయాలు ఉన్నాయి. తనతో కాకుండా కిషన్‌రెడ్డి ద్వారా పావులు కదపడం తనను ఇబ్బందికి గురి చేసిందని సంజయ్ తన సన్నిహితుల వద్ద అసంతృప్తి వెళ్లగక్కారనే ప్రచారం సాగింది. ఇక్కడ తొలి వైరుధ్యం నెలకొన్నదని చెబుతారు. రోజులు గడుస్తున్నకొద్దీ అంతరం పెరుగుతూ వస్తున్నదని అంటున్నాయి.
బీజేపీలో చేరి హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల గెలిచారు. రాజేందర్ గెలుపు అప్పట్లో బీఆర్ఎస్‌కు పెద్ద షాక్. యావత్ పార్టీ యంత్రాంగాన్ని నియోజకవర్గంలో దింపినా, దళిత బంధు పేరిట భారీ పథకాన్ని మొత్తం నియోజకవర్గానికి వర్తింపచేసినా.. బీఆరెస్ ఓడిపోయింది. రాజేందర్‌కు బీజేపీ నాయకత్వం వద్ద పలుకుబడి పెరిగేందుకు ఈ విజయం దోహదపడిందని చెబుతుంటారు. అమిత్ షా కూడా రాజేందర్‌కు టాప్ ప్రయారిటీ ఇస్తారనేది బీజేపీ వర్గాల్లో టాక్. పార్టీలో తన ప్రాధాన్యం పెంచుకోవడంతోపాటు రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం కూడా ఈటల ప్రయత్నాలు ప్రారంభించారనే చర్చ కూడా సాగింది. బండిని తప్పిస్తే ఈటలకు ఈ పదవిని ఇస్తారని టాక్ వచ్చింది. కానీ.. అధ్యక్ష బాధ్యతలు కిషన్ రెడ్డికి అప్పగించారు. దీని వెనుక ఈటల ఉన్నారని బండి వర్గం అనుమానించింది. కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో అధిష్ఠానానికి తప్పుడు సమాచారం చేరవేయవద్దని బండి సంజయ్ కోరారు. ఈ వ్యాఖ్యల ద్వారా తనపై అధిష్ఠానానికి తప్పుడు సమాచారం చేరవేశారని బండి చెప్పకనే చెప్పారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయంలో నాయకులంతా కలిసి పనిచేయాలని అమిత్ షా సూచించారు. తమ మధ్య ఉన్న గ్యాప్ ను పూడ్చుకోవాలని బండి, ఈటలకు కేంద్ర మంత్రి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే తేల్చి చెప్పారనేది పార్టీవర్గాల్లో ప్రచారంలో ఉంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఆశాజనకంగా లేవు. బీజేపీని గెలిపిస్తే బీసీని సీఎం చేస్తామనే నినాదం ఫలించలేదు. ఆ పార్టీ ఎనిమిది సీట్లకు మాత్రమే పరిమితమైంది. అప్పడు ఉన్న రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్‌కు కలిసివచ్చాయనేది కమలనాథుల భావన. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో బీజేపీ గెలిచింది. గతంతో పోలిస్తే అదనంగా నాలుగు సీట్లు దక్కించుకుంది. బీఆర్ఎస్ ఓట్ల డైవర్షన్‌తోనే బీజేపీ ఎనిమిది ఎంపీ సీట్లు గెలుచుకుందనేది కాంగ్రెస్ ఆరోపణ. ఈ విషయాన్ని పక్కన పెడితే మరోసారి బీజేపీ అధ్యక్ష మార్పు అంశం తెరమీదికి వచ్చింది. ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, ఎన్. రామచందర్ రావు పేర్లు తెరమీదికి వచ్చాయి. పార్టీలోని కొందరు సీనియర్లు ఈటలకు మద్దతు పలికారు. ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించిందని, ఈ క్రమంలోనే సంఘ్‌తో అనుబంధం ఉన్న ఎన్.రామచందర్ రావు అధ్యక్ష పదవికి ఎంపికయ్యారని సమాచారం. అమిత్ షా, సునీల్ భన్సల్ వంటి కీలక నాయకులు ఈటలకు అధ్యక్ష పదవి ఇవ్వాలనే భావించారనే చర్చ కూడా సాగింది. కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న పీసీ ఘోష్ కమిషన్ ముందు ఈటల రాజేందర్ స్టేట్ మెంట్ తర్వాత బీజేపీ నాయకత్వం కూడా ఈటలపై కొంత అసంతృప్తితో ఉందనే ప్రచారం మొదలైంది. ఇదే అదనుగా ఆర్ఎస్ఎస్ పట్టుబట్టి రామచందర్ రావుకు అధ్యక్ష పదవిని కట్టబెట్టడంలో సక్సెస్ అయిందని అంటారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ స్థానాల నుంచి ఈటల పోటీ చేశారు. కేసీఆర్‌పై పోటీ చేస్తానని ప్రకటించినట్టుగానే రాజేందర్ గజ్వేల్ నుంచి పోటీ చేసినా.. గెలవలేదు. హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించేందుకు ప్రయత్నించారని రాజేందర్ మొదటిసారిగా ఇవాళ ప్రకటించడం గమనార్హం. పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి గెలిచిన ఈటల.. కేంద్ర మంత్రివర్గంలో చోటు కోసం యత్నించినట్టుగా ప్రచారం సాగింది. అయితే కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు కేబినెట్‌లో చోటు దక్కింది.
కేబినెట్‌లో చోటుకోసం రాజేందర్ చేసిన ప్రయత్నాలు కిషన్‌రెడ్డితో కూడా గ్యాప్‌ను పెంచాయనే అభిప్రాయాలు పార్టీలో ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల సమయంలో హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని తన అనుచరులంతా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం చేయకుండా హైదరాబాద్‌లో మకాం వేసి మల్కాజిగిరిలో ఈటల గెలుపు కోసం పనిచేశారు. ఇదే తాజా వివాదానికి కారణమైందని చెబుతున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా మండల, గ్రామ, జిల్లా కమిటీల ఎన్నికలు జరిగాయి. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ కమిటీల్లో తమకు ప్రాధాన్యం లభించలేదనేది ఈటల వర్గం వాదన. పార్టీ కోసం పనిచేసేవారికే ప్రాధాన్యం ఉంటుందనేది బండి సంజయ్ వర్గం వాదన. ఎన్నికల సమయంలో సంజయ్ గెలుపు కోసం పనిచేసిన వారికి కమిటీల్లో చోటు కల్పించారు. రెండు రోజుల క్రితం హుజూరాబాద్ లో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సమయంలో పార్టీలో వర్గాలు లేవని.. ఎక్కడ లేని సమస్యలు హుజూరాబాద్ లోనే ఎందుకు వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా తమనుద్దేశించి చేసినవేనని ఈటల వర్గం భావిస్తోంది.
బీజేపీ హుజూరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ పదవికి గౌతం రెడ్డి జూలై 18న రాజీనామా చేశారు. బండి వ్యాఖ్యలు చేసిన మరునాడే గౌతం రెడ్డి రాజీనామా కలకలం రేపుతోంది. పార్టీలో తమకు ప్రాధాన్యం లేకుండా బండి ప్రయత్నిస్తున్నారని గౌతం రెడ్డి ఆరోపించారు. హుజూరాబాద్‌లో ఇంతకాలం ఈటల వెంట ఉన్న క్యాడర్‌ను బండి సంజయ్ పక్కన పెడుతున్నారనేది వారి ఆరోపణ. హుజూరాబాద్‌లో తన ప్రాబల్యం పెంచుకొనేందుకు సంజయ్ ప్రయత్నాలు ప్రారంభించారని, ఈ క్రమంలోనే ఈటల వర్గాన్ని పక్కన పెడుతున్నారనే చర్చ సాగుతోంది. కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో ఓ నియోజకవర్గంలో తనకు తక్కువ ఓట్లు వచ్చేందుకు కొందరు ప్రయత్నించారని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా పరోక్షంగా ఈటల వర్గాన్ని ఉద్దేశించినవేనని చర్చ ఉంది. ఈ పరిణామాలతో తాడోపేడో తేల్చుకోవాలని ఈటల వర్గం కూడా డిసైడ్ అయింది. దీంతో గౌతం రెడ్డి రాజీనామా చేశారు.
హుజూరాబాద్ కేంద్రంగా ఈటల, బండి ఆధిపత్య రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన ఈటల అనుచరులంతా జూలై 19న షామీర్ పేటలోని ఈటల ఇంటికి వచ్చారు. అక్కడి పరిస్థితులు వివరిస్తూ తమకు అండగా నిలవాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు వస్తాయో రావో అనే భయం వారిలో ఉంది. దీంతో ఈ ఎన్నికల్లో హుజూరాబాద్ కు వచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో తన అనుచరుల గెలుపు కోసం పనిచేస్తానని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడిన మాటలు బండి సంజయ్ తో ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఉన్నాయి. ఇక తాడోపేడో తేల్చుకుంటామనే రీతిలో రాజేందర్ మాట్లాడారు.
ఈటల రాజేందర్ విద్యార్థి దశలో లెఫ్టిస్ట్. రాజకీయ కారణాలతో బీజేపీలో చేరారు. బీజేపీలో తొలుత ఆయనకు ప్రాధాన్యం ఉండింది. క్రమంగా అది తగ్గుతూ వస్తోంది. బీసీ నాయకుడిగా కూడా ఆయనకు పార్టీ అధిష్ఠానం పెద్దపీట వేసిందంటారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారికి కీలక పదవులు కట్టబెట్టకుండా ఆర్ఎస్ఎస్ అడ్డుపడుతోంది. ఇదే ఈటలకు బీజేపీ అధ్యక్ష పదవి రాకుండా అడ్డంకిగా మారిందని ఆయన అనుచరుల అభిప్రాయం. సౌమ్యుడిగా ఉండే రాజేందర్ ప్రత్యర్ధులు వేసే ఎత్తుల్లో భాగంగా చేసే వ్యాఖ్యలతో స్పందించి రాజకీయంగా ఇరుకునపడుతున్నారనే చర్చ కూడా ఉంది. ఇదే ఆయుధాన్ని బండి ప్రయోగించి సక్సెస్ అయ్యారని అంటున్నారు. పార్టీ అధ్యక్ష పదవి రాకపోవడం, హుజూరాబాద్ లో అనుచరులకు కమిటీల్లో స్థానం లేకపోవడం, ఇతరత్రా అంశాలతో ఆయన రగిలిపోతున్నారనే చర్చ తెరమీదికి వచ్చింది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని తన వద్దకు వచ్చిన హుజూరాబాద్ అనుచరులకు హామీ ఇచ్చే పేరుతో మాట్లాడిన మాటలు తన అసంతృప్తిని తెలుపుతున్నాయి. ఈ పరిణామాలన్నీ చూస్తే ఈటలకు పొగబెడుతున్నారా అనే సందేహాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. తనను పార్టీ సక్రమంగా ఉపయోగించుకోవడం లేదనేది రాజేందర్ భావనగా కనిపిస్తోంది. ఓపికకు కూడా హద్దుంటుందని….అది దాటవద్దనేది ఆయన మాటల సారాంశం. వీటన్నింటిని చూస్తే బీజేపీలో ఈటల ఉక్కపోతకు గురవుతున్నారా అనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.