- ప్రభుత్వంలోకి వచ్చి ఏడాదిన్నర
- ఇంకా భర్తీకాని వివిధ చైర్మన్ పోస్టులు
- పైరవీలు చేసుకుంటున్న నాయకులు
- దానిపైనా అధిష్ఠానం నాన్చుడు ధోరణి
- రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకుల్లో నిరాశ
హైదరాబాద్, మే 2 (విధాత)
Nominated Posts | తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకులు, కార్యకర్తలు మహా సంబురపడ్డారు. తమ కష్టానికి అంతో ఇంతో ఫలితం దక్కుతుందని, తమ స్థాయిని బట్టి పదవులు లభిస్తాయనే గంపెడాశతో ఉన్నారు. గతేడాది మార్చి నెలలో నెలలో కొందరికి చైర్మన్, డైరెక్టర్ పదవులు ఇచ్చారు. ఆ తరువాత నుంచి నామినేటెడ్ పదవుల జాతర ఉంటుందంటూ ఊరిస్తున్నారేకానీ.. ప్రకటించడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో నామినేటెడ్ పదవులు ఇవ్వకుండా మురగబెట్టారు. ఆ తరువాత కార్యకర్తల విశ్వాసం, అధికారం కూడా కోల్పోయింది.
మార్చి 10 దాటిపోయింది..
ప్రత్యేక రాష్ట్రంలో పదేళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టింది. పదేళ్లు బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నానా ఇబ్బందులు పడ్డారు. నియంతృత్వ పాలన, కేసీఆర్ కుటుంబ పాలనతో విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించడం, బేగంపేటలో ప్రగతి భవన్ గడీలను బద్దలు కొట్టడంతో కార్యకర్తలు తమ దశ తిరిగిందనుకున్నారు. తొలి విడతగా కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ పోస్టులను భర్తీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మార్చి 10వ తేదీ లోపు పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇచ్చి సముచితంగా గౌరవిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాని మార్చి నెల దాటి ఏప్రిల్ వచ్చినా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మే 10వ తేదీ కూడా సమీపిస్తున్నది. అంతకు ముందు పీసీసీ అధ్యక్షుడు బీ మహేశ్ కుమార్ గౌడ్ జనవరి నెలాఖరు కల్లా ప్రకటిస్తామని, ఏఐసీసీ నాయకులతో కూడా చర్చిస్తున్నామని చెప్పారు. జిల్లా కాంగ్రెస్ కమిటీల నుంచి ఆశావహుల జాబితా, పార్టీ కోసం శ్రమించిన వారి పేర్లను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) సేకరించింది. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి కచ్చితంగా అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా సమావేశాల్లో స్పష్టం చేస్తూ వస్తున్నారు. తమ ప్రతిపాదనలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు పీసీసీ అధ్యక్షుడికి కూడా పంపించారు.
టికెట్ దక్కనివారి ఆశలు
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన వారు తమకు ఛైర్మన్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. పార్టీ గెలవాలనే లక్ష్యంతో చివరి నిమిషంలో టికెట్ దక్కని వారు తమ తమ స్థాయిలో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ అయిన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఆశావహులు ఉన్నారు. ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా తమకు పదవి ఇవ్వాల్సిందేనని పట్టబడుతున్నారు. వీరే కాకుండా గాంధీ భవన్ లో అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, ముఖ్య నాయకులు కూడా తమకు అవకాశం కల్పించాలని ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి పెంచుతున్నారు.
రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు
ప్రస్తుతం రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కార్పొరేషన్ చైర్మన్‌తోపాటు డైరెక్టర్ పోస్టులు, జిల్లా చైర్మన్ పోస్టులు భర్తీ కాకుండా ఖాళీగా ఉన్నవి ఎన్నో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చిన్న, పెద్ద కలుపుకొని మొత్తం వంద వరకు కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉన్నది. ఇందులో 37 వరకు గతేడాది మార్చి నెలలో భర్తీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో పలువురు మహానంద పడ్డారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో పదవీ బాధ్యతల స్వీకారం జూలై నెలకు వాయిదా పడింది. ఛైర్మన్ పదవులు పొందిన వారిలో ఓసీలు 18, బీసీ లు 11, ఎస్టీలు ముగ్గురు, ఎస్సీ ఒకరు ఉన్నారు. కాని తొలి విడత పదవుల భర్తీ జరిగి ఏడాది అవుతున్నా ఇంత వరకు మలి జాబితాను ప్రకటించలేదు. అప్పుడు ఇప్పుడు అంటూ ఆరు నెలలుగా వాయిదాలు వేస్తూ వస్తున్నారు. మధ్య మధ్య ఒకరిద్దరిని నియమించడం జరిగింది కాని భారీ సంఖ్యలో నామినేటెడ్ పదవులను భర్తీ చేయడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రావణం వెళ్లిపోయింది, దసరా, దీపావళి అన్నారు. ఈ లోపు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా పూర్తయినా నియామకాలు జరగడం లేదు. అయితే కులాల మధ్య సమతూకం పాటించలేదని, జనాభా దామాషా ప్రకారం అయినా మున్ముందు భర్తీ చేయాలని అధిష్టానం పెద్దలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్, రైతు బంధు సమితి, బేవరేజేస్, మార్క్ ఫెడ్, ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, తెలంగాణ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, లెదర్ ఇండస్ట్రీ, ఇండస్ట్రీ డెవలప్‌మెంట్, ఎడ్యుకేషన్ ఇన్ ఫ్రా వంటి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఖాళీగా ఉన్నాయి. జిల్లా స్థాయిలో గ్రంథాలయ సంస్థ, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు కూడా ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేయడం లేదు.
ఇవి కూడా చదవండి..
Bhu Bharathi | అలా చేస్తే అసైన్డ్ పట్టాలు రద్దు : మంత్రి పొంగులేటి
Another SkyLab | పది పదిహేను రోజుల్లోనే భూమిపై పడనున్న మరో ‘స్కైలాబ్’.. పడేది ఎక్కడంటే..
DOST | దోస్త్ షెడ్యూల్ విడుదల.. కావాల్సిన ధృవపత్రాలు ఏంటి..? దరఖాస్తు చేసుకోవడం ఎలా..?
Telangana | ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు.. ‘శాశ్వత’ సెగ
Telangana | ఆర్థిక దిగ్బంధంలో రేవంత్ సర్కార్! ఆదాయానికీ.. ఖర్చులకు కుదరని పొంతన