- ఐదుగురు ముఖ్య కార్యదర్శులపై వేటు..
- ఏపీ నుంచి టీజీకి మళ్లీ రోనాల్డ్ రోస్?
- ఎమ్మెల్సీ కోడ్ ముగియగానే బదిలీలు..
- సంస్థను గాడిలో పెడుతున్న ఇలంబరితి
- గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న రోస్..
- మళ్లీ ఆయననే తేవడంపై స్టాఫ్ ఆశ్చర్యం
- ఈ ఏడాది చివరిలో జీహెచ్ఎంసీకి ఎన్నికలు
- బీజేపీ నియంత్రణ కోణంలో రోస్‌కు మొగ్గు..
- రంగారెడ్డి కలెక్టర్‌గా ముస్లిం మహిళా ఐఏఎస్..
- మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా మిట్టల్..
- సచివాలయవర్గాల్లో జోరుగా చర్చలు
- మే రెండో వారంలో బదిలీలకు ముహూర్తం?
హైదరాబాద్, ఏప్రిల్ 19 (విధాత) :
తెలంగాణలో ఎమ్మెల్సీ కోడ్ ముగియగానే బదిలీలు చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నిర్ణయించారని తెలిసింది. హైదరాబాద్ లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఏప్రిల్ 25వ తేదీన ముగియనున్నది. ఆ మరుసటి రోజు నుంచి ఎన్నికల కోడ్ ఎత్తివేయనున్నారు. ఆ వెంటనే బదిలీల పర్వం చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా జీహెచ్ఎంసీ కమిషనర్‌తోపాటు 9 జిల్లాల కలెక్టర్లు, తెలంగాణ అంబేద్కర్ సచివాలయంలో ఐదుగురు ముఖ్య కార్యదర్శులకు స్థానచలనం కల్పించనున్నారని అత్యంత విశ్వసనీయవర్గాలు తెలిపాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్‌గా ఇలంబరితి కుంజితపతం పనిచేస్తున్నారు. 2005 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఇలంబరితి.. 2024 అక్టోబర్ నెలలో కమిషనర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు రవాణా కమిషనర్‌గా పనిచేశారు. ఏపీ క్యాడర్‌కు చెందిన కాట ఆమ్రపాలిని ఆ రాష్ట్రానికి బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి చెందిన డీవోపీటీ ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆమెను ఏపీకి పంపించింది. ఏపీకి వెళ్లే ముందు జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమె పూర్తి అదనపు బాధ్యతలతో పనిచేసిన విషయం తెలిసిందే.
సంస్థను గాడిలో పెడుతున్న ఇలంబరితి
ఎలాంటి హడావుడి లేకుండా ప్రతి విభాగంపై లోతుగా అధ్యయనం చేస్తూ, తప్పుడు పనులకు పాల్పడుతున్న అధికారులపై ప్రస్తుత కమిషనర్ ఇలంబరితి చర్యలు తీసుకుంటున్నారు. అక్రమాలకు పాల్పడే అధికారులపై చర్యలు తీసుకోవడమే కాకుండా సంస్థను గాడిలో పెడుతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. మీడియాలో వచ్చే వార్తలను పరిశీలించి, నిజమని తేలితే సంబంధిత అధికారుకు మెమోలు జారీ చేయడం, బదిలీ చేయడం చేస్తున్నారు. మొన్న ఆర్థిక సంవత్సరం ముగిసే నాటి ఆస్తి పన్నుల వసూళ్లలో కఠినంగా వ్యవహరించారు. ఈ చర్యలకు ప్రభుత్వంలోని కొందరి పెద్దలకు, జీహెచ్ఎంసీలో తిష్ఠవేసిన కొందరు తిమింగలాలకు కంటగింపుగా మారిందని అంటున్నారు. ఈ క్రమంలోనే ఇలంబరితిని బదిలీ చేసి, ఆయన స్థానంలో ఏపీ నుంచి వస్తున్న రోనాల్డ్ రోస్‌కు తిరిగి బాధ్యతలు అప్పగించాలనే నిర్ణయం జరిగిందని విశ్వసనీయంగా తెలిసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోనాల్డ్ రోస్ కమిషనర్ గా పనిచేశారు. అప్పట్లో ఆయన పనితీరుపై విమర్శలు వచ్చాయి. పెద్దలకు పనిచేయడం తప్పితే వ్యవస్థను గాడిలో పెట్టకుండా నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి అధికారిని మళ్లీ కమిషనర్‌గా నియమిస్తే జీహెచ్ఎంకసీ ప్రతిష్ఠ మరింత దిగజారుతుందని ఉద్యోగులే వ్యాఖ్యానిస్తున్నారు.
బీజేపీని నియంత్రించగలరా?
ఈ ఏడాది చివరి నాటికి జీహెచ్ఎంసీకి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ప్రజా ప్రతినిధుల మాట వినడంతో పాటు బీజేపీని నియంత్రించే అధికారికి బాధ్యతలు ఇవ్వాలనే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని సమాచారం. ఎంఐఎం సహకారంతో మేయర్ పీఠం కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పావులు కదుపుతున్నట్టు కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే శివారు మున్సిపల్ కార్పొరేషన్ల విలీనంతో నగరంలో రెండు లేదా గ్రేటర్ కార్పొరేషన్ అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ పదవికి ప్రాధాన్యత, ప్రాముఖ్యం ఏర్పడ్డాయి.
ఆ తొమ్మిది మంది బదిలీ ఖాయం!
రాష్ట్రంలో పనిచేస్తున్న 9 జిల్లాల కలెక్టర్ల పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తిగా లేదని తెలుస్తున్నది. వారు సమర్థవంతంగా పనిచేయడం లేదని, క్షేత్రస్థాయిలో పర్యటించకుండా ఏసీ చాంబర్లలో కాలం వెళ్లదీస్తున్నారని ప్రభుత్వానికి నివేదికలు అందుతున్నాయని చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ముస్లిం మైనారిటీ మహిళా ఐఏఎస్ అధికారిని నియమిస్తారనే చర్చ జరుగుతున్నది. మెదక్ జిల్లా కలెక్టర్ పనితీరు ఏమంతగా బాగా లేదని, పొలాల్లో తిరుగుతూ ఫొటోలకు ఫోజులు ఇవ్వడం తప్పితే ఆశించిన స్థాయిలో లేదని ప్రభుత్వ పెద్దలు అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.
మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా మిట్టల్
సచివాలయంలో పనిచేసే ఐదుగురు ముఖ్య కార్యదర్శులకు స్థానచలనం ఉండవచ్చని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా నవీన్ మిట్టల్‌ను ఎందుకు కొనసాగిస్తున్నారనే ప్రశ్నలు ప్రభుత్వ పెద్దలకు ఎదురవుతున్నాయని సమాచారం. భూ భారతి వెబ్ పోర్టల్ రూపకల్పన కారణంగా ఇన్నాళ్లు ఆయనను కొనసాగించారని, ఆ పని పూర్తి కావడంతో ఇక ఆయనను మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేయవచ్చని అంటున్నారు. అక్కడున్న ఎం దాన కిశోర్‌ను రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించే సూచనలు ఉన్నాయని తెలుస్తున్నది. అయితే ఆయన సీఎం పేషీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారని కొందరు సీనియర్ అధికారులు చెబుతున్నారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం రఘునందన్ రావును కూడా మార్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఆ శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి పొసగడం లేదని సమాచారం. ఖమ్మం జిల్లాలో ఒక ప్రాజెక్టు విషయంలో జీవో జారీ చేయకుండా వెళ్లిపోవడం, మంత్రి కార్యాలయం నుంచి ఫోన్ చేసినా ఎత్తకపోవడం ఉత్తమ్‌కు ఆగ్రహాన్ని తెప్పించిందని చెబుతున్నారు. ఆయనను బదిలీ చేయాలని ఉత్తమ్ గత నెలలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిని కోరారని, రాహుల్ కూడా ఆ శాఖ నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చారని చర్చ జరుగుతున్నది. ప్రాజెక్టుల అంచనాలను అమాంతం పెంచడం, వాటిపై సంతకాలు చేయడం వల్ల భవిష్యత్తులో విచారణలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయం ఉందంటున్నారు. ఈ నెలాఖరున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొత్తవారు నియమితులు కానున్నారు. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత మే రెండో వారంలో భారీ ఎత్తున ఐఏఎస్‌ల బదిలీలు ఉండవచ్చని సచివాలయ వర్గాల కథనం.