I&PR Telangana | ప్రత్యేక రాష్ట్రం వస్తే వ్యవస్థలు బాగుపడతాయని ఆశిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా ఘోరంగా ప్రభుత్వ విభాగాలు దిగజారిపోయాయనేందుకు తెలంగాణ ఐఅండ్‌పీఆర్ నిదర్శనంగా నిలుస్తున్నదని అక్కడి ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఒకప్పుడు ఉద్యోగులు, సందర్శకులతో కళకళలాడిన ప్రభుత్వ కార్యాలయాలు దివాలా తీసిన బంగళాలను తలపిస్తున్నాయి. తెలంగాణ సమాచార పౌర సంబంధాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఐఅండ్‌పీపీఆర్ కమిషనర్ పరిధిలో ఉద్యోగుల కొరత పట్టి పీడిస్తున్నది. ఖాళీలను భర్తీ చేయాలని ఆర్థిక శాఖ ఆమోదం తెలిపి రెండేండ్లు దాటినా భర్తీ చేయడం లేదు. ఈ నేపథ్యంలో కొలువుల భర్తీని ఆపిందెవరని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
166 కొలువుల భర్తీకి నిర్ణయం కానీ..
అనేక చర్చలు, సుదీర్ఘ సమావేశాల తరువాత మాసబ్ ట్యాంక్ ఐఅండ్ పీఆర్ కమిషనర్ కార్యాలయం పరిధిలో 166 ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ జనవరి 27వ తేదీ 2023న ఉత్తర్వు కూడా జారీ చేసింది. పలు క్యాటగిరీలలో ఏర్పడిన ఖాళీలను ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేయాల్సిందిగా కమిషనర్ నుంచి అందిన ప్రతిపాదనలను పరిశీలించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. రోస్టర్ పాయింట్స్, స్థానికత, విద్యార్హతల ఆధారంగా భర్తీ చేయాల్సిందిగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)కి సూచించింది. ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని పేర్కొంది. అయినా ఇప్పటి వరకు అడుగు ముందుకు కూడా పడలేదు.
మంత్రులు మారినా.. మారని తీరు..
ఐఅండ్ పీఆర్ మంత్రులు మారారు, కమిషనర్లు బదిలీ అయి కొత్తవారు వచ్చినా పెండింగ్‌లో ఉన్న కొలువుల భర్తీ గురించి సమీక్షించడం లేదని సమాచారం. అసిస్టెంట్ ఇన్‌ఫర్మేషన్ ఇంజినీర్ 41, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ 16, ఉర్ధూ ఎడిటర్ 1, ఇన్‌ఫర్మేషన్ టెక్నీషియన్ 22, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ 4, పబ్లిసిటీ అసిస్టెంట్ 82 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎందుకు పక్కనబెట్టిందనే విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఊహించుకోవచ్చని ఉద్యోగులు చెబుతున్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి, మంత్రులకు ఈ ఖాళీలు కన్పించడం లేదా? అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసి నియామకాలు పూర్తి చేస్తే 166 కుటుంబాలకు శాశ్వత ఉపాధి లభించేదంటున్నారు.
భర్తీపై సమీక్షలేవి?
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా గత ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీ కోసం ఆర్థిక శాఖ, విభాగాల వారీగా ఎన్ని ఉత్తర్వులు జారీ చేసింది? ఎన్నింటికి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది? న్యాయపరంగా ఏమైనా వివాదాలు ఉన్నాయా? ఉన్నట్లయితే ఏం చేయాలి? అనే అంశాలపై సంబంధిత మంత్రులు సమీక్షించిన పాపాన పోలేదని అంటున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా 166 పోస్టుల భర్తీ విషయంపై ఇప్పటి వరకు ఐ అండ్ పీఆర్ కమిషనర్ లేదా టీజీపీఎస్సీ అధికారులతో మాట్లాడింది లేదని సమాచారం. మంత్రి ఏమాత్రం చొరవ తీసుకున్నా ఖాళీలు భర్తీ అయ్యేవని, ఉద్యోగుల కొరత తీరేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఇన్‌చార్జీలతో నెట్టుకు వస్తున్నారు. చిన్నస్థాయి ఉద్యోగులను ఇన్‌చార్జ్‌లుగా నియమించి పని కానిచ్చేస్తున్నారు. ప్రధాన కార్యాలయంలో కూడా పనిచేస్తున్న వారిపై ఒత్తిడి పెరిగినా పట్టించుకోవడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పూర్తిస్థాయి సీపీఆర్వో లేరంటే ఐ అండ్ పీఆర్ ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతున్నదని అంటున్నారు.