Middlemen Scam | హైదరాబాద్, జూలై 21 (విధాత): ఇందిరమ్మ ప్రజాపాలనలో సచివాలయం దుర్భేద్యంగా మారిపోయిన పరిస్థితిని ఆసరాగా చేసుకొని ఊరూపేరూలేని దళారులు, పైరవీకారులు విజృంభిస్తున్నారన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు తమ సమస్యలు చెప్పుకొనేందుకు సచివాలయానికి రావచ్చని ముఖ్యమంత్రి, ప్రభుత్వ పెద్దలు చెబుతున్నప్పటికీ.. వాస్తవ పరిస్థితి వేరేలా ఉందని సచివాలయానికి వస్తున్న ప్రజలు మొత్తుకుంటున్నారు. పేరుకు మూడు నుంచి ఐదు గంటల వరకూ విజిటర్లకు అనుమతి ఇస్తున్నారు కానీ.. ఆ పాస్‌లు తీసుకొని లోనికి వెళితే ఆ సమయానికి అధికారులు ఎవ్వరూ ఉండటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని దళారులు సొమ్ము చేసుకుంటున్నారని అంటున్నారు. సామాన్య ప్రజలకు సచివాలయంలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో.. వారితో పని చేయిస్తామని చెప్పి.. పైరవీకారులు, దళారులు రంగంలోకి దిగుతున్నారని, అందినంత డబ్బు గుంజి పరారవుతున్నారని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాలు తెలిసి.. మంత్రులు సైతం నివ్వెరబోతున్నారని సమాచారం.
వ్యాపారవేత్తకు 95 లక్షలకు టోకరా!
ఈ మధ్య ఒక వ్యాపారవేత్త ఇలానే దళారీ బారిన పడి దారుణంగా మోసపోయాడని తెలిసింది. తనకు సంబంధించిన పరిశ్రమ విషయంలో ఒక మంత్రిని కలిసి, పని అయ్యేలా చూసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఒక దళారీ ఆయన టచ్‌లోకి వచ్చినట్టు తెలిసింది. తాను మంత్రికి బాగా దగ్గరని, ఆయన అపాయింట్‌మెంట్లు సైతం తానే చూసుకుంటానని నమ్మించిన దళారీ.. మంత్రిని కలిపించడంతోపాటు.. కావాల్సిన పనిని ఆయనతో అయ్యేలా దగ్గరుండి చూసుకుంటానని భరోసా ఇచ్చాడని సచివాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రితో పని చేయించే పేరు చెప్పి.. ఏకంగా 95 లక్షలు తీసుకుని మాయం అయ్యాయడనేది ఆ గుసగుల సారాంశం. ఈ విషయం ఆ నోటా ఈ నోటా భద్రతా సిబ్బందికి చేరిందట. వాళ్లు ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళితే.. ‘ఒక మీటింగ్ పెడతానంటే రెండు మూడు లక్షలు ఇవ్వడానికి కూడా ఇబ్బందిపడతారు.. అలాంటిది రూ.95 లక్షలు ఇచ్చాడంటే ఏమనుకోవాలి?’ అంటూ సదరు మంత్రి ఆశ్చర్యానికి లోనయ్యారని అధికారవర్గాలు చర్చించుకుంటున్నాయి.
గిరిజన రైతులనూ వదల్లేదు!
రంగారెడ్డి జిల్లాకు చెందిన కొందరు గిరిజన రైతుల భూమి సమస్య పరిష్కరించి, పాస్ బుక్ ఇప్పిస్తానని మరో పైరవీకారుడు నమ్మించి, మోసం చేసినట్టు తెలుస్తున్నది. అడ్వాన్స్‌గా రూ.30 లక్షలు తీసుకొని, పని అయిపోతుందని భరోసా ఇచ్చే పంపేశాడని, తర్వాత ఫోన్ స్విచాఫ్ చేసుకుని పత్తా లేకుండా పోయాడని తెలిసింది. తీవ్ర ఆవేదనకు గురైన సదరు గిరిజన రైతులు.. వరంగల్‌లోని ఒక నాయకుడి ద్వారా ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న మరో నాయకుడిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారని సమాచారం. మోసం చేసిన పైరవీకారుడిని పట్టుకొనేందుకు గిరిజనులు మూడు నెలలుగా బైక్‌లు వేసుకొని ఊరంతా గాలిస్తున్నారని తెలిసింది. ఇప్పటి వరకూ అతడి ఆచూకీని కనుగొనలేకపోయారు.
మాట కలిపి.. నమ్మబలికి..
సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలను గుర్తించే ఈ పైరవీకారులు.. తనకు ఫలానా అధికారి తెలుసునని, కొంత ఖర్చు పెట్టుకుంటే.. మాట్లాడి పని చేయిస్తానని నమ్మబలుకుతారని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. లోపల తమకు తెలిసినవాళ్లతో లోపలి నుంచి ఫోన్ చేయించుకుని.. సచివాలయంలోకి దర్జాగా ప్రవేశిస్తారట. అధికారులు, మంత్రుల పేషీల్లోకి వెళుతున్నట్టు చెప్పి.. బాధితులను దూరంగా ఉంచేస్తారని, కాసేపటికి బయటకు వచ్చి.. సార్‌తో మాట్లాడేశానని, పని అయిపోతుందని చెప్పి ఖైరతాబాద్ లేదా లకడీ కా పూల్ సెంటర్లలోని ఏదైనా హోటల్‌కు తీసుకెళతారని తెలుస్తున్నది. అక్కడ పని, వారి ఆర్థిక పరిస్థితి, బాధితుల అవసరం అన్నీ తెలుసుకుని, డీల్ మాట్లాడుకుంటారని సమాచారం. కొన్ని వ్యవహారాలు వెలుగులోకి రావడంతో అప్రమత్తమైన భద్రతాధికారులు.. ఏ పేషీకి ఎంత మంది వెళ్లారనే లిస్ట్ తీసుకుని వారంతా లోపలి నుంచి ఫోన్ చేయించుకుని పిలిపించిన వారేనా? అనే విషయాన్ని నిర్ధారణ చేసుకుంటున్నారని తెలిసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్, గాంధీ భవన్‌లో పీసీసీ నిర్వహిస్తున్న ప్రజా ప్రతినిధులతో ముఖాముఖి కార్యక్రమం మంచిదేనేని, అయితే.. సచివాలయంలోని సామాన్య ప్రజలు ఉమ్మడి రాష్ట్రంలో వచ్చి కలిసిన విధంగానే అవకాశం కల్పించాలని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సచివాలయానికి ఎన్ని గేట్లు పెట్టామనేది ముఖ్యం కాదని, వచ్చినవారి సమస్యలు ఎన్ని పరిష్కారమయ్యాయన్నదే ముఖ్యమని చెబుతున్నారు.