(తిప్పన కోటిరెడ్డి)
Bhu Bharathi । అనుభవదారు కాలం (కాస్తు కాలం) ఉండాలా? వద్దా? ఉంటే తిరిగి రైతుల భూములు కబ్జాలకు గురవుతాయా? భూ యజమానుల భూములను కౌలుకు తీసుకున్న రైతులు ఆక్రమించుకునే ప్రమాదం ఉందా? అన్న చర్చ రాష్ట్రంలో జరుగా జరుగుతోంది. ఒక వర్గం ఇప్పటికే భూ భారతి చట్టం ద్వారా రైతుల భూములను కబ్జాదారులకు అప్పగించే విధంగా తిరిగి అనుభవ దారు కాలంను తీసుకు వస్తున్నారన్న ఆందోళనలు వ్యక్తం చేస్తున్నది. ఈ చట్టం ఆసాంతం రైతులకు కీడు చేస్తుందని, రైతులకు మేలు చేసే ధరణిని రద్దు చేసి, భూ భారతి చట్టం తీసుకురావడం అంటేనే కాంగ్రెస్ పార్టీ కబ్జాలను ప్రోత్సహిస్తోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వాస్తవంగా అనుభవదారు కాలం (కాస్తు కాలం) వల్ల రైతులకు మేలే జరుగుతుంది కానీ, కించిత్ నష్టం కూడా జరుగదని న్యాయ నిపుణులు చెపుతున్నారు.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోని భూమి రికార్డులలో కాస్తు కాలం అమలులో ఉన్నది. మన పక్క రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాలలో బ్రహ్మాండంగా భూమి రికార్డులున్నాయి. ఈ రాష్ట్రాలలో కూడా కాస్తు కాలం అమలులో ఉన్నది. కాస్తు కాలం అమలులో ఉన్నంత మాత్రాన భూమిని కౌలుకు తీసుకున్న రైతు ఆ భూమి ఆక్రమించుకోలేడని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కాంట్రాక్ట్ వ్యవసాయం అమలులో ఉన్నది. తరతరాలుగా వివిధ కారణాల వల్ల స్వయంగా భూమిని సాగు చేయలేని రైతులు పక్క రైతులకు లేదా, ఇతరులకు భూమిని కౌలుకు ఇస్తున్నారు. అంత మాత్రాన ఏనాడూ కూడా కౌలుదారులు రైతుల భూములు ఆక్రమించుకున్నట్టు లేదు. తెలంగాణలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో, అంతకు ముందు హైదరాబాద్ రాష్ట్రంలో కూడా కాస్తు కాలం అమలులో ఉన్నది. కాస్తు కాలాన్ని వ్యతిరేకిస్తున్న వారు, దీనిపై పని కట్టుకొని ప్రచారం చేస్తున్న వారు కాస్తు కాలానికి, భూమిని కౌలుకు ఇచ్చే విధానానికి ఉన్న తేడాను గుర్తించడం లేదని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు.
తేడా గుర్తించకుండా చేస్తున్న ప్రచారం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో వ్యవసాయ భూములు ఉండి… ఉద్యోగం, వ్యాపార రీత్యా హైదరాబాద్‌తోపాటు పాటు వివిధ ప్రాంతాలకు, ఇతర దేశాలకు వెళ్లి నివసిస్తున్న మధ్య తరగతి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఒకసారి చరిత్ర పుటల్లోకి వెళితే.. దేశంలో బ్రిటిష్ పాలన ఉంటే తెలంగాణ అంతా నిజాం ఏలుబడిలో ఉన్నది. ఇక్కడ భూస్వామ్య వ్యవస్థ వేళ్లూనుకుని ఉన్నది. తెలంగాణ ప్రజల చేతుల్లో భూమిలేదు… ఇక్కడి ప్రజలు భూమి కోసం భూస్వామ్య వ్యవస్థపై, రాజరిక పాలనపై తిరుగుబాటు చేశారు. కమ్యూనిస్టుల నాయకత్వంలో సాయుధ పోరాటం కూడా జరిగింది. భూస్వాములు, దేశ్‌ముఖ్‌లను ప్రజలు గ్రామాల నుంచి తరిమి కొట్టారు. నిజాం పాలన అంతం అయింది. హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనం అయింది.
ఆ తరువాత అలాగే గాంధేయ వాది అయిన వినోబా భావే 1951లో నిర్వహించిన భూదానోద్యమంలో భూములు పేదలకు పంచారు. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ప్రజలు స్వాధీనం చేసుకొని సాగు చేసుకుంటున్న భూములకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 1955లో పీటీ (పర్మినెంట్ టెనెంట్) యాక్ట్ తీసుకు వచ్చింది. పేదలు భూ స్వాముల నుంచి ఆక్రమించుకున్న భూములకు పీటీ సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో వారికి శాశ్వత హక్కులు కల్పించబడ్డాయి. వీరి పేర్లు అనుభవదారు (కాస్తు) కాలంలో ఎక్కించారు. ఈ చట్టం ఒక నిర్థిష్ట కాలపరిమితికి సంబంధించినది మాత్రమేనని గుర్తించాలి. కానీ దీనికి విరుద్దంగా మధ్య తరగతి, వేతన జీవులు తమ భూములు సాగు కోసం కౌలుకు ఇస్తే అనుభవదారు కాలంలో చేర్చి భూ ములు గుంజుకుంటారన్నది వాస్తవ విరుద్దమైన ప్రచారమేనని భూ న్యాయ నిపుణులు భూమి సునీల్ స్పష్టం చేశారు.
1971 రికార్డ్స్ ఆఫ్ రైట్స్ చట్టం ఏం చెబుతున్నది?
1971లో రికార్డ్స్ ఆఫ్ రైట్స్ (ROR ACT) చట్టం అమలులోకి వచ్చిన తరువాత భూమి హక్కులు ఉన్నవారందరికీ పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. అయితే 1989లో ఈ చట్టం ప్రకారం 90 శాతం మంది రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు, భూ యజమాన్య హక్కు పత్రాలు ఇవ్వలేమని అప్పటి జిల్లా కలెక్టర్లు స్పష్టం చేసినట్లు భూమి సునీల్ తెలిపారు. నాటి నుంచి నేటి వరకు పట్టాదార్ పాస్ పుస్తకాల్లో ఎక్కలేని 90 శాతం భూ యజమానులు 2020 ధరణిలో చట్టం వచ్చిన తరువాత ఏమైనట్లు? అన్న సందేహాన్ని కూడా వ్యక్తం చేశారు. 90 శాతం తెలంగాణ రైతులు భూ యజమానులు కాకుండా పోయారా? అని కూడా అన్నారు.
తెలంగాణలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా అనేక మంది భూ యజమానులు పట్టాదారులుగా లేరని, కాస్తు కాలంలో అనుభవదారులుగానే ఉన్నారని సీనియర్ జర్నలిస్ట్ ఒకరు తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో, ఆ తరువాత కమ్యూనిస్టులు, ఎం ఎల్ పార్టీల నాయకత్వంలో జరిగిన పోరాటాల ఫలితంగా ప్రజలకు పంచిన భూములను ప్రజలే అనుభవిస్తున్నారు. ఇలాంటి భూములన్నింటికీ గత ప్రభుత్వాలు చట్టం పరిధిలో ఉన్న అవకాశాలను వినియోగించి యజమాన్య హక్కులు కల్పిస్తూనే రెవెన్యూ రికార్డుల్లో (పహణీల్లో) అనుభవాదారులుగా నమోదు చేశారు.
ఇలాంటి భూములతో పాటు తెలంగాణలో మెజార్టీ రైతుల భూములు ఇంటికి పెద్ద కుమారుడైన అన్నయ్య పేరున పట్టా ఉంటుంది. తమ్ములందరూ ఎవరి భూమికి వారు అనుభవదారు కాలంలో ఉంటారు. అలాగే తండ్రి పేరు పైన భూమి ఉంటుంది. కుమారులందరూ భూమిని పంచుకుంటారు. రెవెన్యూ రికార్డులో కుమారుల పేర్లు అనుభవదారు కాలంలో ఎక్కిస్తారు. ఇలా వివిధ రకాలుగా భూ యజమానుల పేర్లే అనుభవ దారుల కాలంలో ఎక్కిస్తారు కానీ, భూమిని కౌలుకు తీసుకొని సాగు చేసే రైతుల పేర్లు మాత్రం ఎక్కించడానికి ఎలాంటి అవకాశం లేదని భూమి సునీల్ విధాత న్యూస్ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
ధరణితో హక్కులు కోల్పోయిన అనుభవదారులు
ధరణి చట్టం 2020 అమలులోకి వచ్చిన తరువాత అనుభవదారు కాలంలో ఉన్న భూ యమానులందరూ తమ హక్కులు కోల్పోయారు. వీరికి ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు నిధులు రాలేదు.. రైతు బీమా లేకుండా లేకుండా పోయింది. పైగా ఏనాడో భూములు వదులుకొని పట్టణాలకు పోయిన అనేక మంది భూస్వాములకు పట్టాదార్ పాస్ పుస్తకాలు వచ్చాయి.. భూమిని అనుభవించకున్నా రైతు భరోసా నిధులు లక్షల కొద్ది రూపాయలు తిరిగి భూస్వాముల అకౌంట్లలో చేరాయని సీనియర్ జర్నలిస్టు ఒకరు అన్నారు. కొంతమంది భూస్వాములు తిరిగి ఆయా భూములను కూడా గుంజుకున్నట్లు సందేహాలు వ్యక్తం చేశారు. ఇలా లక్షల ఎకరాల భూములు పేదల చేతుల్లో నుంచి తిరిగి భూస్వాముల చేతుల్లోకి వెళ్లినట్లు రైతు ఉద్యమ నాయకులు చెపుతున్నారు. కాస్తు కాలం వస్తే తిరిగి వాస్తవంగా భూమిని యజమానులుగా అనుభవిస్తున్న వారికి వచ్చే అవకాశం ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఆరు లక్షలకు పైగా సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న విషయాన్నిగుర్తు చేస్తున్నారు.
కౌలుదారులకు అనుభవదారు కాలంతో ఎలాంటి సంబంధం లేదు
కౌలుదారుకు అనుభవదారు కాలానికి ఎలాంటి సంబంధం ఉండదు. భూమిని సాగు చేయడం కోసం మాత్రమే ఇచ్చేది కౌలు.. ఇది ఇంటిని అద్దెకు ఇవ్వడం లాంటిదే. ఇంటిలో అద్దెకు ఉన్న వారు ప్రభుత్వ రికార్డుల్లో కూడా ఫలానా ఇంటిలో ఉంటున్నట్లు ఆధార్ కార్డ్‌లో అడ్రస్ ఇస్తారు. అలాగే గ్యాస్ డెలివరీ కోసం గ్యాస్ డీలర్‌కు ఇస్తారు. చదువుకునే పిల్లల కోసం స్కూల్, కాలేజీల్లో, ఉద్యోగం చేసే వాళ్లు కమ్యూనికేషన్ కోసం వర్క్ స్టేషన్‌లో కూడా అద్దె ఇంటినే అడ్రస్‌గా ఇస్తారు. ఇదే తీరుగా కౌలు రైతులకు ప్రభుత్వం ఎల్ఈసీ కార్డులు జారీ చేస్తుంది. కానీ ఇతరత్రా ఉండదు. కేంద్ర ప్రభుత్వం 2016లో భూమిని కౌలుకు సాగుచేసే వారి కోసం మోడల్ లీజ్ అగ్రిమెంట్ చట్టం చేసింది.
ఈ చట్టాన్ని భారత ప్రభుత్వం భూమిని సాగు కోసం కౌలుకు ఇస్తే యాజమాన్య హక్కులు కోల్పోతారనే భయం లేకుండా చేయడం కోసమే. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 6 శాతం భూమి లీజు (కౌలు) పద్దతిలో ఉంది. దీంతో కౌలు రైతులకు బ్యాంకుల నుంచి పెట్టుబడి రుణాలు అందించడానికి వీలుగా, అలాగే భూమిని ఎన్ని సంవత్సరాలు కౌలుకు చేసినా యాజమాన్య హక్కులు సంక్రమించవని స్పష్టం చేసే విధంగా కేంద్రం చట్టం చేసింది. కాగా భూములు బీడు పడకుండా సాగులోకి తీసుకురావడానికి ఈ చట్టం ఎంతగానో ఉపయోగ పడుతుందని తెలిపింది. నీతి ఆయోగ్ రూపొందించిన ఈ చట్టాన్ని రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా స్వంత చట్టాలు రూపొందించుకోవడానికి అవకాశం కల్పించింది కూడా.
కౌలుదారు (ఎల్ఈసీ) చట్టం ప్రధాన లక్షణాలను పరిశీలిస్తే..
1) బీడు భూములను సాగు భూములుగా మార్చడానికి అవకాశం ఉంటుంది. దీని వల్ల వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయి. భూమి లేని రైతులు.. కూలీలుగా కాకుండా రైతులుగా మారి భూములు సాగు చేస్తారు. దీంతో గ్రామీణ ప్రాంతాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయి.
2) భూమిని కౌలుకు తీసుకున్న రైతులు అధిక ఉత్పత్తి చేయడం కోసం శ్రమించి భూమిని అభివృద్ధి చేస్తారు.
3) ఎల్ఈసీ చట్టం ద్వారా వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల కోసం పరస్పర అంగీకారంలో భూమిని కౌలు (లీజు)కు తీసుకోవచ్చే కానీ ఎట్టి పరిస్థితిలో భూమిపై లీజు (కౌలు) దారుల క్లైయిమ్ చెల్లు బాటు కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
4) ఈ చట్టం ద్వారా లీజుకు తీసుకున్న కౌలు రైతు సంస్థాగత రుణం బ్యాంకుల నుంచి తీసుకోవచ్చు. బీమాతో పాటు ప్రకృతి విపత్తులు వచ్చినప్పడు సహాయం పొందడానికి అవకాశం ఉంటుంది. దీంతో సదరు కౌలు రైతు వ్యవసాయంలో ఎక్కువ పెట్టుబడి పెట్టి, ఎక్కువ పంట ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది.
5) ఈచట్టం ద్వారా భూమిని కౌలుకు తీసుకొని సాగుచేస్తున్న కౌలు రైతుకు తెలంగాణతో సహా ఏ రాష్ట్రంలోనైనా ఎన్ని సంవత్సరాలు సాగు చేసినా భూమిపై ఎలాంటి యాజమాన్య హక్కులు రావని సీనియర్ న్యాయవాది, భూ చట్టాల నిపుణులు భూమి సునీల్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి..
Bhu Bharathi । భూ యజమానికి భరోసా కంప్యూటరా? కాగితమా? నిపుణులేమంటున్నారు?