ప్రతిపక్షాలకు దక్కని సమాన అవకాశాలు
ఈసీ పనితీరుపై వీఎఫ్‌డీ ఆందోళనలు
మూడు కీలక అంశాల ఆధారంగా నివేదిక
తొలుత ప్రకటించిన ఓట్లకు, తుది లెక్కలకు మధ్య సుమారు 5 కోట్ల పెరుగుదల
ఏడు దశల ఎన్నికల్లో 3.2% నుంచి 6.32% తేడా
ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లో 12.54%, 12.48% పెరుగుదల
మొత్తంగా తుది లెక్కల్లో 4.72 శాతం పెరుగుదల
79 సీట్లలో గెలిచినవారి మెజార్టీ కంటే పెరిగిన ఓట్లు
అనేక సీట్లలో బొటాబొటీ మెజార్టీతో ఎన్డీఏ గెలుపు
వాటిలో ఏపీలోని 7, తెలంగాణలోని మూడు సీట్లు
తుది ఓట్లలో తీవ్ర పెరుగుదల ఎందుకు ఉన్నది?
సందేహాలను సహేతుకంగా తీర్చాలన్న వీఎఫ్‌డీ
న్యూఢిల్లీ : ఇటీవల ముగిసిన 18వ లోక్‌సభ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పౌర సమాజ ప్రతినిధుల పట్ల తీవ్ర వివక్షను చూపిందనే విమర్శలు మూటగట్టుకున్నది. క్రమం తప్పకుండా మీడియా సమావేశాలు నిర్వహించి, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్న తీరుపై మాట్లాడలేదని, ఓటర్ల అణచివేత, ఈవీఎంల పనితీరుపై విమర్శలను పట్టించుకోలేదని విమర్శలు వచ్చాయి. మొత్తంగా సమాన అవకాశాలు ప్రతిపక్షాలకు దక్కలేదన్న స్థూలాభిప్రాయాన్ని అటు ప్రతిపక్షాలు, రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేశారు. వీటికి మరింత ఆజ్యం పోసింది.. ఎన్నికల ఫలితాలు వచ్చిన నెల తర్వాత మహారాష్ట్రకు చెందిన పౌర వేదిక ‘వోట్ ఫర్ డెమోక్రసీ (వీఎఫ్‌డీ)’ నివేదిక. వీఎఫ్‌డీ ఆరోపణలు ఎన్నికల సంఘం పనితీరుపై తీవ్ర ఆందోళనలు, ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
ఎన్నికల ప్రక్రియలో స్పష్టంగా కనిపించిన కొన్ని అవకతవకలను ప్రస్తావించడంతోపాటు.. మూడు ముఖ్యాంశాలను ఎత్తిచూపింది. అందులో అత్యంత కీలకమైనది ఎన్నికల సంఘం పోలింగ్ తేదీల్లో రాత్రి 8 గంటలకు ప్రకటించిన లెక్కలకు, మొత్తంగా విడుదల చేసిన ఓట్ల సంఖ్యకు గణనీయమైన తేడా ఉన్న విషయాన్ని ఆ నివేదిక ప్రస్తావించింది. మొదట చెప్పిన ఓట్లకు, తర్వాత ప్రకటించిన ఓట్లకు మధ్య భారీ స్థాయిలో పెరుగుదల ఉండటం గమనిస్తే ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నది. ఈ వ్యత్యాసం 4,65,46,885గా ఉన్నదని తెలిపింది. దశలవారీగా జరిగిన ఓటింగ్ సంఖ్యలను జాగ్రత్తగా గమనించి ఈ అంచనాకు వచ్చినట్టు వీఎఫ్‌డీ పేర్కొన్నది.
గత ఎన్నికల్లో పోలింగ్ తేదీ రోజు ప్రకటించని ఓట్ల సంఖ్యకు, తుది ఓట్ల సంఖ్యకు మధ్య సుమారు 1 శాతం తేడా ఉండేదని రిపోర్టు తెలిపింది. కానీ.. 18వ లోక్‌సభ ఎన్నికల్లో ఈ వ్యత్యాసం ఏడు దశల్లో 3.2 శాతం నుంచి 6.32శాతం వరకూ ఉన్నదని పేర్కొన్నది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఈ తేడా మరింత ఎక్కువ ఉన్నదని తెలిపింది. ఈ తేడా ఆంధ్రప్రదేశ్‌లో 12.54 శాతం, ఒడిశాలో 12.48 శాతం ఉన్నట్టు పేర్కొన్నది. మొత్తంగా చూసినా తుది లెక్కల్లో 4.72 శాతం పెరుగుదల ఉన్నదని వివరించింది. ఇంతటి భారీ పెరుగుదలకు ఎన్నికల సంఘం ఇప్పటి వరకూ సహేతుక కారణాన్ని చూపించలేదని నివేదిక విమర్శించింది.
రెండో అంశం.. 15 రాష్ట్రాల్లోని 79 సీట్లలో విజయం సాధించిన అభ్యర్థుల మెజార్టీ కంటే తుది ఓట్ల సంఖ్య గణనీయంగా పెరగటాన్ని వీఎఫ్‌డీ ప్రస్తావించింది. ఇందులో అనేక సీట్లలో ఎన్డీయే అభ్యర్థులు బొటాబొటీ మెజార్టీతో గెలిచారని పేర్కొన్నది. ఈ 79 సీట్లలో ఒడిశాలో 18, మహారాష్ట్రలో 11, పశ్చిమబెంగాల్‌లో 10, ఆంధ్రప్రదేశ్‌లో 7, కర్ణాటకలో 6, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో ఐదు చొప్పున, బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్, తెలంగాణలో మూడు చొప్పున, అసోంలో రెండు, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, కేరళలో ఒక్కొక్కటి ఉన్నాయని వీఎఫ్‌డీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఓటింగ్ రోజు పోలింగ్‌తో పోల్చితే తుది ఓట్లలో తీవ్ర పెరుగుదల ఎందుకు ఉన్నదన్న సందేహాలను సహేతుకంగా తీర్చాలని వీఎఫ్‌డీ కోరింది. అయితే ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు గెలిచిన చోట్ల పెరిగిన ఓట్ల కంటే తక్కువ మెజార్టీలతోనే వారు విజయం సాధించడంతో వాటిని పరిగణనలోకి తీసుకోలేదు.
మూడో అంశం.. దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లోని 18 సీట్లలో ఎన్డీయే అభ్యర్థులు చాలా స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ఇక్కడ పోలింగ్ సమయంలో, ఓట్ల లెక్కింపులో అవకతవకలు, ఈవీఎంలు సరిగా పనిచేయకపోవడం వంటి ఆరోపణలను ప్రతిపక్ష పార్టీలు, వివిధ పౌర సమాజ సభ్యులు లేవనెత్తడం గమనార్హం. బీహార్‌లోని శరణ్, మహారాష్ట్రలోని వాయవ్య ముంబై, ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్, బాన్స్‌గావ్, ఫూల్పూర్ వంటివి కూడా ఉన్నాయి. ఇక్కడ అత్యంత స్వల్ప ఓట్ల మెజార్టీతో ఎన్డీయే అభ్యర్థులు గెలుపొందారు.
ఎన్నికల సమయంలో ఓటర్లను అడ్డుకోవడం, ఈవీఎంలు మొరాయించడం, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమైన అధికారుల వివాదాస్పద బదిలీలు, రిటర్నింగ్ అధికారుల దుష్ప్రవర్తన, ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రతిపక్ష నేతలు, పలువురు పరిశీలకులు చేసిన ఫిర్యాదులకు ఎన్నికల సంఘం స్పందించకపోవడం వంటి అనేక అంశాలను వీఎఫ్‌డీ నివేదిక ప్రస్తావించింది. ఈ నివేదికను మాజీ అధికారి ఎంజీ దేవ సహాయం, సామాజిక కార్యకర్త డాక్టర్ ప్యారేలాల్ గార్గ్ రూపొందించారు. తాము ఎన్నికల సంఘం విశ్వసనీయతను సందేహించడం లేదని, కానీ.. ఈ దేశ పౌరులుగా, ఓటర్లుగా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత గురించే తాము ఆందోళన చెందుతున్నామని వీఎఫ్‌డీ తెలిపింది.
జూలై 22, 2024న ముంబైలో ఈ నివేదికను విడుదల చేసిన వీఎఫ్‌డీ.. ఎన్నికల సమయంలో రేకెత్తిన అనుమానాలు, వివిధ పక్షాలు లేవనెత్తిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని స్వతంత్ర దర్యాప్తుతో ఈ నివేదికను రూపొందించినట్టు వెల్లడించింది. ఎన్నికల ఫలితాలపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఫలితాలు వెలువడిన 45 రోజులలోగా ఎవరైనా అభ్యర్థి లేదా ఓటరు సవాలు చేసేందుకు ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 80 అవకాశం ఇస్తున్నది. 2024 ప్రజా తీర్పు చోరీకి గురైందా? అనే ప్రశ్న తలెత్తుతున్నదని, దీనికి ఎన్నికల సంఘమే సమాధానం చెప్పాలని కోరింది.