Warangal Congress | విధాత, ప్రత్యేక ప్రతినిధి : వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ప్రారంభమైన ముసలం ఇక ఒడువని ముచ్చటగా మారుతోందా? అంటే తాజా పరిణామాలను పరిశీలించిన తర్వాత నిజమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్రి కొండా సురేఖ, మురళికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, పార్టీ ముఖ్య నేతలకు మధ్య భగ్గుమన్న (Warangal Congress rift) విభేధాల మంటలిప్పుడిప్పుడే చల్లారే అవకాశం లేదంటున్నారు. అసలే అది కాంగ్రెస్ పార్టీ .. క్రమశిక్షణ పాటించడం కంటే కాలదన్నడమే ఎక్కువనే నానుడి ఉంది. ప్రజాస్వామ్యం పేరుతో విచ్చలవిడితనం అమలవుతోందనే అపవాదు ఉంది. గమ్మత్తేమిటంటే ఎవరిపై చర్య తీసుకుంటారో? ఎవరిని విస్మరిస్తారో? పార్టీ అధిష్టానానికే తెలియాలి. ఈ నేపథ్యంలో కొండా దంపతులు వర్సెస్ ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పట్లో తేలే అంశం కాదంటున్నారు జిల్లా రాజకీయ విశ్లేషకులు. గాంధీభవన్ సాక్షిగా శనివారం జరిగిన పరిణామాలే తాజా ఉదాహరణగా పేర్కొంటున్నారు. కొండా మురళి తనపై ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదు పై స్పందిస్తూ ఆరు పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, సభ్యులకు అందజేశారు. దీని కోసం వరంగల్ నుంచి భారీ కాన్యాయ్ తో మురళి గాంధీభవన్ కు తరలివెళ్ళారు. కొందరు దీన్ని బలప్రదర్శనగా చూస్తున్నారు. ఆరు పేజీల లేఖలో కూడా వివరణ కంటే విమర్శలతో పాటు అదనంగా ఆరోపణలు చేశారని భావిస్తున్నారు. ఈ వివాదంలోకి జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కూడా లాగారు. దీంతో ఈ సమస్య అంత ఈజీగా సమసిపోయే అవకాశం లేదంటున్నారు.
దయచేసి నన్ను రెచ్చగొట్టకండి -కొండా మురళి
లేఖ అందించిన తర్వాత గాంధీభవన్ లో కొండా మురళి మీడితో మాట్లాడుతూ ‘దయచేసి నన్ను రెచ్చగొట్టకండి.. నేను బలహీనున్నికాదు…చావుకు భయపడను…ఇంకా నా శరీరంలో నాలుగు బుల్లెట్లున్నయంటూ’ వ్యాఖ్యానించారు. నన్నెవరూ విచారణకు పిలువలేదనీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పై ఉన్న గౌరవంతో తానే వచ్చానని మురళి చెప్పారు. మంత్రి పొంగులేటి తమపై కుట్ర చేస్తున్నారని..తమ వ్యతిరేక వర్గాలను ఏకం చేస్తున్నారని ఆరోపించారు. కడియం శ్రీహరి పార్టీలోకి వచ్చినప్పటి నుండి సమస్యలు మొదలయ్యాయన్నారు. కొండా సురేఖకు, సీతక్కకి గ్యాప్ ఉందని కడియం ప్రచారం చేశారని విమర్శించారు. పరకాల పూర్తిగా తమదే అన్నారు. గత ఎన్నికల్లో రేవూరికి నిస్వార్ధంగా సహాయం చేశాం.. అతనిప్పుడు తమపై గుడుపుఠాని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పెద్ద పెద్ద సెటిల్మెంట్ చేస్తున్నాడనీ, తనకు సంబంధం లేని నియోజకవర్గంలో పోస్టులు ఇప్పించుకుంటున్నాడని విమర్శించారు. కడియం శ్రీహరి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ఇందిరకు చుక్కలు చూపిస్తున్నాడనీ, అమె అనుచరులను టార్చర్ చేస్తున్నాడని విమర్శించారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి సీటు గతంలో ఎగిరిపోవడానికి తానే కారణమనే కోపంగా ఉన్నట్టున్నాడని ఆరోపించారు. ఇదే సందర్భంలో లేఖలో మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి గురించి పేర్కొన్నారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణతో పాటు వర్ధన్నపేటలో ఎమ్మెల్యే నాగరాజు, పరకాలలో రేవూరి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణల విజయానికి కృషి చేసినట్లు వివరించారు. పాలకుర్తిలో యశస్విని రెడ్డికి సహకరించానన్నారు. డోర్నకల్, మానుకోటలో తమకు పట్టులేదని చెప్పారు కొండా మురళి. కొండా మురళి హాజరు పై క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి స్పందన వేరేగా ఉంది. తమ పిలుపు మేరకే కొండా మురళి హాజరయ్యారని, తమకు ఆరు పేజీల లేఖ అందజేసినప్పటికీ ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదులోని అంశాలకు ఇందులో వివరణ లేదని పేర్కొన్నారు. దీనిపై కొండా మురళి మరోసారి వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అయితే, రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తారనుకుంటున్న వేళ ఓరుగల్లు కాంగ్రెస్ ప్రజాప్రతిధులు, మంత్రి దంపతుల మధ్య నెలకొన్న కుంపటి ఇప్పట్లో చల్లారే అవకాశం లేనట్లుగా తెలుస్తోంది. ఎవరూ వెనక్కి తగ్గకుంటే ఈ ప్రభావం సైతం తీవ్రంగా ఉంటుందంటున్నారు.
మురళి విమర్శలతో పంచాయితీ షురూ..
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేదికగా మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తమ పార్టీకే చెందిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్యతో పాటు ఇతర నేతలపై పరుషపదజాలంతో చేసిన విమర్శలతో కాంగ్రెస్ లో నెలకొన్న విభేదాలు భగ్గుమన్నాయి. ఇదే సమయంలో అగ్నికి ఆజ్యం పోస్తూ మంత్రి కొండా సురేఖ భద్రకాళి బోనం వ్యవహారంపై ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిని విమర్శించడం, కడియం శ్రీహరిని ఉద్దేశించి విమర్శించడంతో సమస్య మరింత జఠిలమైంది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ఎమ్మెల్యేలు కడియం, రేవూరి తో పాటు కేఆర్ నాగరాజు,గండ్ర సత్యనారాయణ రావు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యతో పాటు హనుమకొండ, వరంగల్ జిల్లాల పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణ, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి తదితరులు ఆగమేఘాల మీద సమావేశమై బహిరంగంగానే కొండా మురళి, సురేఖ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గాల్లో అనవసర జోక్యం చేసుకుంటూ గ్రూపులు ప్రోత్సహిస్తున్నారని, బీసీ కార్డు వాడుకుంటున్నారని మండిపడ్డారు. తాము కావాలో… కొండా ఫ్యామిలీ కావాలో తేల్చుకోవాలని తీవ్రంగా స్పందించారు. ఈ విషయాన్ని పీసీసీ దృష్టికి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదుచేయడంతో సమస్య తీవ్రమైంది. దీనిపై స్పందించిన మీనాక్షి నటరాజన్ పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సహించేది లేదని తేల్చిచెప్పారు. క్రమశిక్షణ కమిటీ తక్షణం చర్యలు చేపట్టాలని సూచించారు.
ఇద్దరు ఎమ్మెల్యేలతో విచారణ కమిటీ
వరంగల్ జిల్లా ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న పంచాయితీపై ఇంచార్జ్ మినాక్షి నటరాజన్ సూచన మేరకు క్రమశిక్షణ కమిటీ తాజాగా ఇద్దరు ఎమ్మెల్యేలతో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. చీఫ్ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, వనపర్తి ఎమ్మెల్యే వంశీతో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. జిల్లాకు సంబంధంలేని వారితో విచారణ జరిపిస్తామంటూ ఇచ్చిన హామీ మేరకు వీరిద్దరితో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కొండా సురేఖ, మురళి దంపతులతో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పార్టీ నేతలతో మాట్లాడి క్రమశిక్షణ నివేదిక సమర్పించే అవకాశం ఉంది. ఈ విచారణ ఇప్పట్లో ముగిసే అవకాశం లేదని తెలుస్తోంది. కొద్ది కాలం క్రితం పటాన్ చెరు కాంగ్రెస్ లో నెలకొన్న పంచాయతీ పై కమిటీ ఏర్పాటు చేసినా ఇప్పటికీ అతీగతీలేదంటున్నారు. కాంగ్రెస్ మార్కు కాలాయాపన తప్పదేమోనని అనుమానిస్తున్నారు. అయితే, కొండా మురళి ఎపిసోడ్ కాండ్రెస్ పార్టీతో పాటు వరంగల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.