నిలబెట్టేవారికి మోడీ నంబర్‌ గేమ్‌ సంకేతం

పదేళ్ల కిందట సంకీర్ణ ప్రభుత్వాలకు చెక్‌ పెడుతూ ప్రజలు విస్పష్టమైన తీర్పు చెప్పారు

  • Publish Date - June 6, 2024 / 04:50 PM IST

పదేళ్ల కిందట సంకీర్ణ ప్రభుత్వాలకు చెక్‌ పెడుతూ ప్రజలు విస్పష్టమైన తీర్పు చెప్పారు. పేరుకే ఎన్డీఏ అయినా బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటునకు అవరమైన మెజారిటీ ఉండటంతో ఆ కూటమిలోని పార్టీలన్నీ నామమాత్రంగానే మిగిలిపోయాయి. మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాను అమలు చేసినా మౌనంగానే ఉన్నాయి. మొదటి ఐదేళ్ల కంటే రెండోసారి బీజేపీ సొంతంగా 300 మార్క్‌ దాటడంలో ఇక బీజేపీ నేతల విద్వేష వ్యాఖ్యలు, గోరక్షణ పేరుతో ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. భారత్‌లో నెలకొన్న మత రాజకీయాలపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చినా లెక్క చేయలేదు. విపక్ష నేతలు, ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తే దేశ ద్రోహులుగా చిత్రించారు.

ఈ క్రమంలోనే బీజేపీ నినాదాలైన రామ మందిర నిర్మాణం, ఆర్టికల్‌ 370 రద్దు, ఉమ్మడి పౌర స్మృతి వంటి వాటిని అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేశారు. వీటిలో మొదటి రెండింటిని పూర్తి చేసింది. వాటిని బీజేపీ ఘనతగా చెప్పుకుని వివిధ రాష్ట్రాల్లో రాజకీయంగా లబ్ధి పొందింది. దీనివల్ల బీజేపీ బలోపేతం కావడం, ఆ పార్టీకి మద్దతు ఇచ్చిన ప్రాంతీయ పార్టీలు బలహీనపడటం ప్రారంభమైంది. ఇదంతా ఒక వ్యూహాత్మకంగా అమలు చేశారు. స్వతహాగా ప్రాంతీయపార్టీల ఎదుగుదలను అంగీకరించని మోడీ మెల్లగా ప్రాంతీయపార్టీలను దెబ్బతీశాడు. ఆ విశ్వాసంతోనే ఈసారి ఎన్నికల్లోనూ ఎన్డీఏకు 400పైగా సీట్లు వస్తాయని, బీజేపీ సొంతంగా 370 సీట్లు దక్కించుకుంటుంది అని అనుకున్నాయి.

బీజేపీకి కేంద్రంలో రెండుసార్లు స్పష్టమైన మెజారిటీ రావడానికి కారణమైన యూపీలోనే ఇండియా కూటమి దెబ్బతీసింది. 2019లో 62 స్థానాలు గెలుచుకున్న ఆపార్టీ 29 సీట్లు కోల్పోయి 33 స్థానాలకే పరిమితమైంది. రామమందిర నిర్మాణం, ఆర్టికల్‌ 370 రద్దు, త్రిపుల్‌ తలాఖ్‌, సీఏఏ, సర్జికల్‌ స్ట్రైక్స్‌ వంటి ప్రచార నినాదాలతో తమకు గణనీయంగా ఓట్లను రాలుస్తాయని 70కి పైగా సీట్లు గెలుస్తామని అంచనా వేసింది. వాటిని యూపీ ఓటర్లు పట్టించుకోలేదు. చివరికి అయోధ్య జిల్లాలోని ఫైజాబాద్‌లోనే ఆ పార్టీ అభ్యర్థి 54,567 ఓట్ల తేడాతో ఎస్పీ అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు.

అలాగే సుల్తాన్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి మేనకాగాంధీ ఎస్పీ అభ్యర్థి రాంభూపాల్‌ నిషాద్‌ చేతిలో 43,174 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ రెండు స్థానాల్లో బీజేపీ ఓటమి చెందడానికి కారణం ఆ పార్టీ పదేళ్లు చేస్తున్న నినాదాలను ప్రజలు విశ్వసించలేదు. ఫైజాబాద్‌, సుల్తాన్‌పూర్‌ రెండూ పక్కనే ఉంటాయి. కానీ పైజాబాద్‌లో బీజేపీ రామనామ జపం చేసింది. సుల్తాన్‌పూర్‌ ఆ అంశాన్ని పెద్దగా ప్రస్తావించలేదు. మేనకాగాంధీ కూడా స్థానిక సమస్యలపైనే ప్రచారం అయినా ఓటమి తప్పలేదు. దీనికి పదేళ్లుగా మోడీ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి కల్పనలపై దృష్టి సారించకపోవడం, ద్రవ్యోల్బణం కట్టడికి చర్యలు చేపట్టకపోవడం వంటివి ప్రభావం చూపెట్టాయి.

ఈ రెండు చోట్ల బీజేపీ ఓడిపోవడానికి కారణం ఆపార్టీ ప్రజలు ఏం కోరుకుంటున్నారో పట్టించుకోకుండా అన్నింటికీ జైశ్రీరాం ఒకటే మంత్రం అన్నట్టు వ్యవహరించింది. భక్తి విశ్వాసాలను రాజకీయాల కోసం వాడుకోవడానికి ప్రజలు తిరస్కరించారు అనడానికి ఇదే నిదర్శనం. దీనిపై బీజేపీ వాట్సప్‌ యూనివర్సిటీ విష ప్రచారం చేస్తున్నది. హిందువులంతా ఆపార్టీ కార్యకర్తలైనట్లు, ఫైజాబాద్‌లోని ఓటర్లకు బుద్ధి లేదన్నట్టు ప్రచారం చేస్తున్నారు. వాళ్లు ఒక విషయాన్ని మరిచిపోతున్నారు. బీజేపీ పుట్టకు ముందు నుంచే అక్కడ వాళ్లు నివసిస్తున్నారు. వాళ్లు దేవుడి ఆరాధిస్తున్నారు. అక్కడి ప్రజలు ఎవరి మత విశ్వాసాలను వాళ్లు పాటిస్తున్నారు. పదేళ్లుగా మేం ఏం చేయకపోయినా రాముడి పేరు చెప్పి మేము ఓట్లు అడుగుతాం. మీరు వెయాల్సిందే అన్నట్టు మాట్లాడుతున్నారు.

అలాగే బీజేపీ గెలిస్తే పాకిస్థాన్‌లో టీవీలు పగలగొడుతారు అని బీజేపీ నేతలు ప్రచారం చేస్తారు. ఫైజాబాద్‌లో బీజేపీ ఓడిపోయాక టీవీలు పగలగొట్టారు. హిందువులు బీజేపీకి అన్యాయం చేశారని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం కట్టడి విఫలం, వ్యవసాయ వ్యతిరేక విధానాలు, అగ్నివీర్‌ పథకంపై యువతలో ఉన్న అసంతృప్తే యూపీ, బీహార్‌, హర్యానా, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల్లో బీజేపీ సీట్లకు భారీగా గండి కొట్టాయన్న విషయాన్ని పార్టీ నేతలు గ్రహించాలి. అంతేగానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోతే ఓటర్లదే తప్పు అన్నట్టు బీజేపీ వాళ్లు కూడా ప్రజలను నిందించడం హాస్యాస్పదంగా ఉన్నది.

ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల సమావేశంలో ప్రధాని మోడీ రాజకీయాల్లో నంబర్‌ గేమ్‌ ఒక భాగమే అని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రమాణ స్వీకారం తర్వాత ప్రభుత్వం మెల్లగా కుదుటపడ్డాక. నంబర్‌ గేమ్‌ రాజకీయం మొదలుపెట్టి బీజేపీ యేతర ప్రభుత్వాలను గతంలో వలె కూల్చే కుట్రలు చేసే అవకాశమూ లేకపోలేదు. మోడీ-షా రాజకీయ వ్యూహాలను ఎప్పటికప్పుడు పసిగట్టకపోతే ముందు మునిగేది టీడీపీ, జేడీయూలే. ఎందుకంటే దేశ ప్రజలు మోడీకి వ్యతిరేకంగా తీర్పు చెప్పారు అని ఇండియా కూటమి ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఆర్థిక అభివృద్ధి ద్రవ్యోల్బణ కట్డడి, నిరుద్యోగ సమస్య అభివృద్ధి అంశాల ఎజెండాగా సంకీర్ణ ప్రభుత్వం ముందుకు వెళితే ఎలాంటి ఇబ్బంది ఉండదు.

మంత్రివర్గ స్థానాలపై కూడా కూటమిలో పెద్దగా పేచీ ఉండకపోవచ్చు. అవినీతికి వ్యతిరేకంగా ఎన్డీఏ ప్రభుత్వం గట్టిగా పనిచేస్తుంది అన్నారు. కానీ ఎన్డీఏలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఏం చర్యలు తీసుకున్నారు అంటే సమాధానం ఉండదు. కానీ దీన్ని మోడీ, షా అవకాశంగా తీసుకొని రాజకీయాలకు వాడుతారన్నది పదేళ్ల అనుభవం కళ్లముందున్నది. . మిత్రలాభం పాటిస్తూనే తగిన సమయం చూసుకొని బయటకు పంపుతారు. ఆయా పార్టీలలో ముసలం తయారుచేస్తారు.అలాగే మోడీ స్వభావరీత్యా ప్రాంతీయ పార్టీలు బలోపేతం అవడానికి ఇష్టపడడు. అందుకే భాగస్వామ్య పక్షాలైనా శివసేన, అకాలీదళ్‌, అన్నాడీఎంకే, ఎల్జేపీ, పీడీపీ, తాజాగా జేజేపీ ఇలా అన్నిపార్టీల్లో చీలక తెచ్చాడు.

కనుక రానున్న రోజుల్లో ఏమైనా జరగొచ్చు. బీజేపీ తాను బలోపేతం కావడానికి ప్రాంతీయపార్టీలను, భాగస్వామ్య పార్టీలైనా బలి చేయడానికి వెనుకాడదు. రానున్న రోజుల్లో మహారాష్ట్ర, బీహార్‌, హర్యానాలోనూ బీజేపీ సొంతంగానే మెజారిటీ సాధించేలా ఇప్పటి నుంచే వర్క్‌ ఔట్‌ చేస్తారు. కీలక బిల్లలు పాస్‌ కావాలంటే ఈ రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తే పెద్దల సభలోనూ సంఖ్యా బలం పెరుగుతుందనేది కాషాయపార్టీ ఆలోచన. మహారాష్ట్రలో శిండే వర్గాన్ని, బీహార్‌లో జేడీయూను బలహీనపరిచడానికి ప్రయత్నాలు మొదలుపెడుతారు. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్‌ ఉప ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పించాలన్న సంకేతాలు అవే.

పదేళ్లు మోడీ ఏం చేసినా దేశం కోసమే అన్న ప్రచారం ఇక నడువదు. దాన్ని ప్రజలు విశ్వసించడం లేదని తాజా ఎన్నికల ద్వారా తేటతెల్లమైంది. దానికి కారణం సంపూర్ణ మెజారిటీ ఉండటంతో పదేళ్లు ఎన్ని ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకున్నా ఎన్డీఏ పక్షాలే కాదు వైసీపీ, టీడీపీ, బీఆర్‌ఎస్‌ వంటి పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదు. పార్లమెంటులోనూ ప్రతిపక్షం గట్టిగానే ఉన్నది. అలాగే పదేళ్లుగా జాతీయ మీడియాలో కొన్ని ఛానళ్లు నమో జపం చేశాయి. మొన్నటి ఫలితాలతో సీన్‌ మారింది. ఇక కాంగ్రెస్‌పై , ఇండియా కూటమిలోని పక్షాలపై కాకుండా బీజేపీ విధానాలపై చర్చలు మొదలవుతాయి. కాంగ్రెస్‌ ఓడిపోతే ఖర్గే మీద తోసేస్తారు అని మోడీ సహా బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు.

కానీ ఫలితాల తర్వాత ఇండియా కూటమి నేతల్లో ఉన్న విశ్వాసం బీజేపీలో లేదు. మోడీలో అసలే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీ, జేడీయూ అధినేతలను ఉద్దేశించి గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియా వైరల్‌ అవుతున్నాయి. మోడీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నది వాటి సారాంశం.ఎందుకంటే నిలబెట్టే వారికి రాజకీయాల్లో నంబర్‌ గేమ్‌ భాగమే అని మోడీ చెప్పారు. ప్రస్తుతం త్వరలో కొలువుదీరనున్న మోడీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ భవితవ్యం ప్రాంతీయపార్టీల చేతిలో ఉన్నది. బీజేపీ బలపడితే నిలబెట్టిన పార్టీలనే నిండా ముంచుతుంది అన్నది చరిత్రే.

Latest News