Black Chicken | న‌ల్ల కోళ్ల వ్యాపారం.. ఏడాదికి రూ. 25 ల‌క్ష‌లు సంపాదిస్తున్న ఐటీ ఇంజినీర్

Black Chicken | ల‌క్ష‌ల జీతం.. ల‌గ్జ‌రీ లైఫ్‌.. ఆ జీతాన్ని, ఆ జీవితానికి స్వ‌స్తి ప‌లికాడు. స్వ‌శ‌క్తితో ఎదగాల‌నుకున్నాడు. ఇక పౌల్ట్రీ రంగం( Poultry Sector )లోకి అడుగుపెట్టాడు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా న‌ల్ల కోళ్ల( Black Chicken ) వ్యాపారం ప్రారంభించి.. ఏడాదికి రూ. 25 ల‌క్ష‌ల ట‌ర్నోవ‌ర్‌కు ఎదిగాడు ఆ ఐటీ ఇంజినీర్( IT Engineer ).

  • Publish Date - August 2, 2025 / 09:50 PM IST

Black Chicken Farm | ఆ ఒక్క ఎక్స్‌పో ఓ ఐటీ ఇంజినీర్( IT Engineer ) జీవితాన్ని మార్చేసింది. నెల‌కు నెల‌కు జీత‌గాడిలా ప‌ని చేయ‌డం మానేసి.. ప‌ది మందికి తానే జీతం స్థాయికి ఎదిగాడు. అంతేకాదు.. వంద‌ల మంది రైతుల‌కు( Farmers ) ఆద‌ర్శంగా నిలిచాడు. ల‌క్ష‌ల జీతాన్ని వ‌దిలేసిన ఆ ఐటీ ఇంజినీర్ న‌ల్ల కోళ్ల( Black Chicken ) వ్యాపారం ప్రారంభించి.. ఇప్పుడు ఏడాదికి రూ. 25 ల‌క్ష‌ల సంపాదిస్తున్నాడు. మ‌రి యువ రైతు( Young Farmer )గా మారిన ఆ ఐటీ ఇంజినీర్ గురించి తెలుసుకోవాలంటే మ‌హారాష్ల్ర‌( Maharashtra )లోని షోలాపూర్( Solapur ) వెళ్లాల్సిందే.

షోలాపూర్‌( Solapur )కు చెందిన అరుణ్ షిండే( Arun Shinde ) బీటెక్ అయిపోయిన వెంట‌నే హైద‌రాబాద్‌( Hyderabad )లో ఐటీ ఇంజినీర్‌గా కొలువు కొట్టాడు. 2018లో జాబ్‌లో చేరిన తొలి రోజుల్లోనే.. హైద‌రాబాద్‌లోని ఓ ఐటీ పార్కు( IT Park )లో నిర్వ‌హించిన గ్లోబ‌ల్ పౌల్ట్రీ ఎక్స్‌పో( Global Poultry Expo ) కు అరుణ్ అటెండ్ అయ్యాడు. ఆ పౌల్ట్రీ ఎక్స్‌పోలో త‌న దృష్టిని న‌ల్ల కోళ్లు( Black Chicken ) ఆక‌ర్షించాయి. ఆస్ట్రేలియా( Australia )కు చెందిన ఆస్ట్రాలార్ప్( Australorp ) అనే న‌ల్ల‌జాతి కోళ్లు అవి. ఈ న‌ల్ల కోళ్లు ఏడాదికి 280 గుడ్లు పెట్టే సామ‌ర్థ్యం గ‌ల‌వి.

ఇంకేముంది.. ఆ ఐటీ ఇంజినీర్ ఇక త‌న మ‌న‌సు మార్చుకున్నాడు. అదే ఏడాది త‌న ఐటీ జాబ్‌ను వ‌దిలేసి షోలాపూర్‌కు వెళ్లిపోయాడు. త‌న‌కున్న పొలంలో ఆగ్రో ప్రోశ‌క్తి( Agro ProShakthi ) పేరిట న‌ల్ల కోళ్ల‌ను పెంచ‌డం ప్రారంభించాడు. పంజాబ్( Punjab ) నుంచి 200 ఆస్ట్రాలార్ప్ కోడి పిల్ల‌ల‌ను కొనుగోలు చేశాడు. వాటిని అత్యంత భ‌ద్ర‌తా ప్ర‌మాణాల మ‌ధ్య పౌల్ట్రీ ఫామ్‌లో పెంచ‌డం ప్రారంభించాడు. అయితే ఈ న‌ల్ల‌కోళ్లు పెరుగుతున్న కొద్ది క‌డ‌క్‌నాథ్ కోళ్ల మాదిరి క‌నిపించేవి. కానీ అవి ఆ జాతి కాదు. ప్రారంభంలో కాస్త న‌ష్టాలు చ‌విచూసిన‌ప్ప‌టికీ.. కోళ్ల పెంప‌కంలో మెళ‌కువ‌లు పెంచుకున్నాడు. ఇక ఆ న‌ల్ల కోళ్లు పెట్టిన గుడ్ల‌ను పొదిగేలా చూసి పిల్ల‌ల‌ను తీయ‌డం ప్రారంభించాడు. దాంతో కాస్త త‌న వ్యాపారం మెరుగుప‌డింది.

కోళ్ల‌తో పాటు కోడి గుడ్ల‌ను విక్ర‌యించ‌డం ప్రారంభించాడు. ఒక్కో కోడిగుడ్డును రూ. 16 నుంచి రూ. 17 వ‌ర‌కు విక్ర‌యించాడు. వీటిని ఒక్క మ‌హారాష్ట్ర‌కే ప‌రిమితం చేయ‌కుండా.. త‌మిళ‌నాడులోని సేలం, హైద‌రాబాద్‌కు స‌ర‌ఫ‌రా చేశాడు. కోడి పిల్ల‌ల‌ను ఒక్కో దాన్ని రూ. 40కి అమ్మ‌డం ప్రారంభించాడు. మొత్తానికి ఎన్నో క‌ష్టాలు ప‌డి కోళ్ల‌ను పెంచి లాభాల బాట ప‌ట్టాడు.

అయితే అవి క‌డ‌క్‌నాథ్ కోళ్లు అని న‌ల్ల కోళ్ల‌ను కొనేందుకు చాలా మంది సుముఖ‌త చూప‌లేదు. అయితే ఇవి ప్యూర్ న‌ల్ల కోళ్లు అని.. వాటి తేడా చెప్పిన త‌ర్వాత వాటిని కొన‌డం ప్రారంభించారు. న‌ల్ల కోళ్ల‌పై పూర్తిస్థాయి అవ‌గాహ‌న క‌ల్పించి, ప్ర‌జ‌ల‌కు దాని విలువ‌ను తెలిపాడు. మొత్తం 2.5 ఎక‌రాల్లో త‌న కోళ్ల వ్యాపారాన్ని వ్యాపించాడు. కోళ్ల‌తో పాటు బాతులు, ఆవులు, మేక‌లు పెంచుతున్న‌ట్లు అరుణ్ తెలిపాడు.

ఇక న‌ల్ల కోళ్ల వ్యాపారం ప్రారంభించిన మొద‌ట్లో రూ. 50 వేలు ఇన్వెస్ట్ చేయ‌గా.. గ‌త ఏడేండ్ల‌లో మొత్తం రూ. 20 ల‌క్ష‌లు పెట్టుబ‌డి పెట్టాడు. అయితే ఏడాదికి రూ. 25 ల‌క్ష‌ల ఆదాయం స‌మ‌కూరుతుంది. ఒక్క న‌ల్ల కోళ్ల మీద రూ. 14 ల‌క్ష‌ల దాకా సంపాదిస్తున్నాడు. మిగ‌తా ఆదాయం బాతులు, ఆవులు, మేక‌ల మీద వ‌స్తుంద‌ని తెలిపాడు అరుణ్‌.

అయితే భ‌విష్య‌త్‌లో 10 వేల కోళ్ల‌ను పెంచడ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని అరుణ్ స్ప‌ష్టం చేశాడు. ఈ ఫామ్‌లో అనేక మందికి ఉపాధి క‌ల్పిస్తున్న‌ట్లు పేర్కొన్నాడు. త‌న కుటుంబ స‌భ్యుల స‌హ‌కారంతోనే ఈ స్థాయికి ఎదిగాను అని తెలిపాడు. పౌల్ట్రీ ఫామ్‌పై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తూ.. అధిక దిగుబ‌డికి కావాల్సిన మెళ‌కువ‌ల‌ను నేర్పిస్తున్న‌ట్లు అరుణ్ తెలిపాడు.