Mushrooms Cultivation | ఆర్థికంగా ఎదగాలంటే ఉద్యోగమే చేయాల్సిన అక్కర్లేదు.. వ్యవసాయం చేస్తూ కూడా లక్షల రూపాయాలు సంపాదించొచ్చు. కాస్త వినూత్నంగా ఆలోచిస్తే.. ఉన్న భూమిలో బంగారం పండించొచ్చు. మూడు పీజీలు చేసిన ఓ గ్రాడ్యుయేట్( PG Graduate ) తనకున్న భూమిలో.. అది కూడా మామిడి చెట్ల( Mango Trees ) కింద పుట్టగొడుగుల సాగు( Mushrooms Cultivation ) చేస్తూ రోజుకు రూ. 10 వేలు సంపాదిస్తున్నాడు. మరి ఈ ట్రిపుల్ పీజీ గ్రాడ్యుయేట్ గురించి తెలుసుకోవాలంటే ఛత్తీస్‌గఢ్( Chhattisgarh) వెళ్లాల్సిందే.
ఛత్తీస్‌గఢ్ మహాసముంద్ జిల్లా బస్నా తాలుకాకు చెందిన రాజేంద్ర కుమార్ సాహు( Rajendra Kumar Sahu ).. మూడు పీజీలు చేశాడు. 2002లో ఎంఏ సంస్కృతం, 2004లో ఎంఏ హిందీ, 2006లో సోషల్ వర్క్‌లో పీజీ పట్టా పుచ్చుకున్నాడు. ఇక రాజేంద్ర కుమార్ తండ్రి అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగి. తన తండ్రితో నిత్యం వ్యవసాయం, పంటలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే రైతుల గురించి రాజేంద్ర చర్చిస్తుండేవాడు.
వరిగడ్డిని వినియోగించి.. పుట్టగొడుగుల సాగు
ఈ క్రమంలోనే 2005లో పుట్టగొడుగుల సాగు ప్రారంభించాడు. తొలుత ఆయిస్టర్ మష్రూమ్స్‌ను సాగు చేశాడు. కానీ పెద్దగా లాభం లేదు. స్థానికులు కూడా వాటిని అంతగా ఇష్టపడలేదు. దీంతో కొత్త ఆలోచనకు రాజేంద్ర పురుడు పోశాడు. వరిగడ్డిని వినియోగించి.. పుట్టగొడుగుల సాగు చేయాలనుకున్నాడు. క్షణం కూడా ఆలోచించకుండా తన పొలంలో ఉన్న మామిడి చెట్ల కింద షెడ్లను ఏర్పాటు చేశాడు. వరిగడ్డితో ఏర్పాటు చేసిన ఆ షెడ్లలో పుట్టగొడుగుల సాగు ప్రారంభించాడు.
2010లో ఐజీకేవీలో శిక్షణ
2006లో ఒడిశా నుంచి 5 కేజీల స్పాన్‌ను రూ. 200కు కొనుగోలు చేశాడు. 25 బెడ్లలో వాటిని సాగు చేశాడు. మొత్తంగా 15 కేజీల పుట్టగొడుగులు చేతికొచ్చాయి. కేజీ పుట్టగొడుగులను రూ. 200కు పైగా విక్రయించాడు. ఈ సాగుకు మే నెల నుంచి సెప్టెంబర్ వరకు అనుకూలమైనది. 2010లో ఐజీకేవీలో శిక్షణ కూడా పొందాడు. ఆ తర్వాత తన సాగును మరింత విస్తరించాడు.
రోజుకు రూ. 10 వేలు సంపాదిస్తూ
2014, 2015 నాటికి ప్రతి రోజుకు 20 కేజీల పుట్టగొడుగులను పండించాడు. స్థానికులకే వాటిని విక్రయించడం మొదలుపెట్టాడు. నాణ్యమైన పుట్టగొడుగులు కావడంతో జనాలు కూడా బాగానే కొనుగోలు చేశారు. ఇక మామిడి చెట్ల కింద సాగు చేయడంతో.. అన్ని సీజన్లలో వాతావరణానికి తట్టుకుని పుట్టగొడుగులను సాగు చేశాడు. అలా రాజేంద్ర పుట్టగొడుగులను విక్రయిస్తూ రోజుకు రూ. 10 వేలు సంపాదిస్తూ స్థానిక రైతులకు, యువ రైతులకు మార్గదర్శకంగా నిలిచాడు.
