పోలవరం–బనకచర్ల లింక్ టెండర్లు రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం

పోలవరం–బనకచర్ల లింక్‌ ప్రాజెక్టు డీపీఆర్‌ టెండర్లను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ ఒక ప్రకటన చేసింది.

banakacelrla

హైదరాబాద్, విధాత:
పోలవరం-బనకచర్ల లింకు ప్రాజెక్టు పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి వెనకడుగు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ వ్యయంతో కూడుకున్న ఈ ప్రాజెక్టు వద్దేవద్దని నీటి పారుదల రంగ నిపుణులు చెబుతున్నా ఆయన విన్పించుకోవడం లేదు. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) నిబంధనల ప్రకారం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించేందుకు ఏపీ నీటి పారుదల శాఖ అక్టోబర్ 11వ తేదీన టెండర్లు ఆహ్వానించింది. రూ.9.2 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. డీపీఆర్ టెండర్లు రద్దు చేస్తున్నట్లు ఏపీ ఈ ప్రొక్యూర్ మెంట్ వెబ్ ఫోర్టల్ లో నీటి పారుదల శాఖ ప్రకటించింది.

ఈ ఏడాది జూలై నెలలో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్.పాటిల్ ఢిల్లీలో తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు, అధికారులతో సమావేశమయ్యారు. ప్రాజెక్టు డీపీఆర్ స్వీకరించవద్దని, టెండర్లు ఆహ్వానించకుండా అడ్డుకోవాలని తెలంగాణ సీఎం ఆయనను కోరారు. ఈ ప్రాజెక్టును మూడు దశల్లో రూ.81,900 కోట్లతో చేపట్టనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆ తరువాత బనకచర్లపై తెలంగాణ ప్రభుత్వం అనవసర వాదనలు చేస్తున్నదని, ఈ ప్రాజెక్టు మూలంగా నష్టం లేదని చంద్రబాబు ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే.