అమరావతి : మద్దతు ధర అందక ఓవైపు..వరుస వర్షాలు, తుపాన్ దెబ్బకు ఇంకోవైపు ఏపీ ఉల్లి, టమాటా, పత్తి, అరటి రైతులు ఆగమాగమవుతున్నారు. ఉల్లి కిలో 30పైసలు..టమాట రూపాయికి పడిపోవడంతో తీవ్రంగా నష్టపోయిన ఏపీ రైతులు తాజాగా పత్తి కొనుగోలులో ఎదురవుతున్న సమస్యలతో నష్టపోతూ పత్తి పంటలను తగలబెట్టుకుంటున్నారు. మరికొందరు ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు. ఇప్పుడు అదే వంతు అరటి రైతులకు వచ్చింది.
మొన్నటిదాక అరటికి టన్నుకు 10నుంచి 12వేలు ఉన్న మద్దతు ధర..అకస్మాత్తుగా రూ.1000నుంచి 4వేలకు పడిపోవడంతో అరటి రైతులు లబోదిబోమంటున్నారు. అరటి తోటలను ట్రాక్లర్లతో దున్నిస్తూ, జేసీబీలతో తొలగిస్తూ ధ్వంసం చేసేస్తున్నారు. కొంతమంది రైతులు పంటను పశువులు, గొర్రెలకు మేతగా పడేస్తున్నారు. ఇప్పటికే మొంథా తుపాన్ వర్షాలతో అరటి తోటలు చాల వరకు దెబ్బతిన్నాయని..ఇప్పుడు మిగిలిన పంటకు కూడా మద్దతు ధర దక్కకపోవడంతో తీవ్ర నష్టాల పాలవుతున్నామని అరటి రైతులు వాపోతున్నారు. ఏపీ నుంచి అరటి ఎక్కువగా ఇరాన్, ఇరాక్‌లకు ఎగుమతవుతోంది. ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేసిన అరటి రైతులు ఇప్పుడు మద్దతు ధర కోసం అల్లాడుతున్నారు. ఎగుమతులకు కావాల్సిన పంటను వ్యాపారస్థులు రవాణా ఖర్చులు తగ్గించుకునేందుకు..ముంబై పోర్టు దగ్గరగా ఉండటంతో మహారాష్ట్ర నుంచి తీసుకుంటున్నారు. దీంతో ఏపీ అరటి కొనుగోలు దారుణంగా పడిపోయింది.
గత ఏడాది టన్నుకు 28వేలు..ఇప్పుడు రూ.1000
గత ఏడాది అరటి టన్ను 28 వేలకు పైగా పలకగా ఈసారి టన్ను వెయ్యికి పడిపోయిందని అంటే కిలో రూపాయికి కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఎకరానికి అప్పు చేసి మరీ 2 లక్షల వరకు ఖర్చు చేశామని ఇప్పుడు అప్పులకు వడ్డీ కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల్లో 60వేల ఎకరాల మేరకు సాగవుతుంది. అనంతపురం జిల్లాలో దాదాపు 30 వేల ఎకరాల్లో రైతులు అరటి పంట సాగు చేశారు. నెల రోజుల పాటు కురిసిన వర్షాలు, చల్లని వాతావరణం వల్ల చాలా చోట్ల పంటకు సిగటోగా ఫంగస్ సోకింది. దీని వల్ల ఆకులు చీలిపోయి గెలలు ఒక్కసారిగా మాగిపోయి నేలకూలుతున్నాయి. మరోవైపు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో గెలల నాణ్యత బాగుండటంతో వ్యాపారులంతా ఆయా రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రైతు అరటిని అమ్మబోతే రూ.15 కూడా దక్కకపోతుండగా..పట్టణాల్లో ఇప్పటికీ డజను అరటి పళ్లు రూ.40-70 వరకు ధర పలుకుతున్నాయి. అరటి కొనుగోలులో వ్యాపారుల దోపిడి, ప్రతికూల ప్రకృతి రెండు కూడా శాపంగా మారాయి. ఈ పరిస్థితులలో తమను ప్రభుత్వం ఆదుకుని అరటి కొనుగోలులో నష్టం లేకుండా చూడాలని అరటి రైతులు కోరుతున్నారు.
అరటి రైతులది అరణ్య రోదన : వైఎస్ షర్మిలా రెడ్డి
రాష్ట్రంలో అరటి రైతులది అరణ్య రోదన అయ్యిందని.. సిరులు కురిపించే పంట నేడు రైతన్న కంట కన్నీరు తెప్పిస్తుందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్. షర్మిలా రెడ్డి ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. అన్నదాతను అరటి పంట ముంచుతుంటే, రైతన్నల ఆక్రందన కూటమి ప్రభుత్వానికి పట్టక పోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. టన్నుకు 28 వేల నుంచి వెయ్యికి పడిపోతే, రైతులు దుర్భర పరిస్థితి ఎదుర్కొంటుంటే.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఉన్నట్లా ? లేనట్లా?
అని ప్రశ్నించారు. ఉద్యానవన శాఖ పని చేస్తుందా.. మొద్దు నిద్ర పోతుందా ? అని నిలదీశారు. ఆరుగాలం కష్టించి పండించిన అరటి గెలలను పశువులకు మేతగా పడేస్తుంటే ఇక రాష్ట్రంలో ఎక్కడుంది రైతు సంక్షేమం ? అని షర్మిల మండిపడ్డారు. లక్షల్లో పెట్టుబడికి వేలల్లో ఆదాయమైతే రైతు సుభిక్షంగా ఎలా ఉంటాడు ? అని ప్రశ్నించారు. అరటికి కిలో ధర రూ.1 పెట్టే కూటమి ప్రభుత్వం రైతన్నకు చేసింది దగానే అని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం అరటి రైతుల బాధలను విని, ధరల పతనంపై సమీక్ష జరపాలని షర్మిల డిమాండ్ చేశారు. గల్ఫ్, యూరప్ దేశాలకు ఎందుకు ఎగుమతులు తగ్గాయో, పరిశీలించి తక్షణం ఎగుమతులు ప్రారంభించాలన్నారు. రైతుకు టన్నుకు కనీసం 25 వేలు గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు చేపట్టాలని ఏపీ కాంగ్రెస్ సీఎం చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని తెలిపారు.
