Site icon vidhaatha

Pinnelli Ramakrishna Reddy | మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్

జూన్ 6వరకు అరెస్టు వద్దని ఆదేశాలు

విధాత : ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున, తర్వాత రోజు జరిగిన ఘర్షణలకు సంబంధించి నమోదైన కేసుల్లో ఏపీ హైకోర్టులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రానుకృష్ణారెడ్డికి ఊరట లభించింది. ఆయనపై నమోదైన 3 కేసుల్లో ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 6వరకు పిన్నెల్లిని అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్ షరతులే వర్తిస్తాయని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది.

ఇప్పటికే ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లికి జూన్ 6వరకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరీ చేసింది. పిన్నెల్లిపై రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌స్టేషన్‌లో టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి చేసి హత్యాయత్నం చేశారని రెంటచింతల పోలీసులు హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.

అలాగే పోలింగ్ మరుసటి రోజు ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడి వెళ్లిన సమయంలో తలెత్తిన గొడవల్ని అడ్డుకోబోయిన సీఐ టీపీ నారాయణస్వామిపై దాడిచేసి గాయపరిచారనే ఫిర్యాదుపై పిన్నెల్లి, ఆయన తమ్ముడు, అనుచరులపై 307 తదితర సెక్షన్ల కింద కారంపూడి పీఎస్‌లో మరో కేసు నమోదైంది.

మరోవైపు పాల్వాయిగేటు పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంను ధ్వంసం చేసి బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పిన్నెల్లిని మరో మహిళ ప్రశ్నించగా.. ఎమ్మెల్యే తీవ్రంగా దుర్భాషలాడినట్లు ఆ మహిళ ఫిర్యాదుతో రెంటచింతల పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఈ మూడు కేసుల్లో బెయిల్ కోసం పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించగా షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది.

Exit mobile version