Site icon vidhaatha

Home Minister Anitha | మాది డీఎన్‌ఏ ప్రభుత్వం కాదు.. ఎన్డీఏ ప్రభుత్వం: హోంశాఖ మంత్రి అనిత

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఏపీ హోంశాఖ మంత్రి అనిత ఘాటు కౌంటర్‌

విధాత, హైదరాబాద్ : ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య ట్విట్టర్‌ (ఎక్స్‌) వార్ ఆసక్తికంగా సాగింది రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారుతున్నాయని హోంమంత్రి వైఫల్యం వల్లనే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీటర్‌లో ఆరోపించారు. హోంమంత్రి మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు మాత్రం గడప దాటడం లేదని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. కల్లబొల్లి మాటలతో కాలక్షేపం చేయడం వల్లనే రాష్ట్రం భయం గుప్పిట్లోకి వెళ్లిపోయిందని విమర్శించారు. బయటకు వస్తే ఏమవుతుందో తెలియని దారుణ స్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఈ పరిస్థితికి హోంమంత్రిదే బాధ్యత అని తెలిపారు. దీనికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ వైఫల్యంపై కూడా గవర్నర్‌ విచారణకు ఆదేశించాలని అన్నారు. విజయసాయిరెడ్డి ట్వీట్‌పై హోంమంత్రి వంగలపూడి అనితా ధీటుగా స్పందించారు. శాంతి భద్రతల విషయాల్లో మీరు రాజీనామా చేయాలో.. నేను చేయాలో త్వరలో కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు. అయినా ఇది డీఎన్‌ఏ ప్రభుత్వం కాదు.. ఎన్డీయే ప్రభుత్వం అని.. ప్రజలు బాగానే ఉన్నారని చెప్పారు. దొంగలే కోటల్లో దాక్కుని ప్రెస్‌మీట్‌లు, ఎక్స్‌లో రెట్టలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు.

Exit mobile version