APS RTC | ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. దసరా పండుగ నేపథ్యంలోని తెలంగాణ, చెన్నై, బెంగళూరు నగరాలకు ప్రత్యేక సర్వీసులను నడుపనున్నట్లు వెల్లడించింది. దాదాపు 6,100 ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు వెల్లడించింది. ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, బెంగళూరు ప్రాంతాల్లో ఉండే ప్రయాణికుల కోసం ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ నెల 4 నుంచి 20 వరకు 6,100 సర్వీసులను నడిపేందుకు ప్రణాళికను రూపొందించామని చెప్పింది.
ఈ నెల 4 నుంచి 11 మధ్య 3,040 స్పెషల్ సర్వీసులు, 12 నుంచి 20 వరకు మరో 3,060 బస్సులను నడుపనున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. ప్రత్యేక సర్వీసులను నడుపుతున్న ప్రయాణికులపై ఈ సారి ఎలాంటి భారం మోపబోమని చెప్పింది. ప్రత్యేక సర్వీసుల్లో సాధారణ ఛార్జీలను వసూలు చేస్తామని ప్రకటించింది. అలాగే, ముందస్తుగా వచ్చిపోయేందుకు రిజర్వేషన్లు చేసుకున్న వారికి 10శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి మధ్య నడిచే ఏసీ బస్సుల్లోనూ అడ్వాన్స్‌డ్ టికెట్ల బుకింగ్‌పై 10శాతం రాయితీ ఇవ్వనున్నట్లు సంస్థ పేర్కొంది.