APSRTC Special Buses | భక్తులకు ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) తీపికబురు చెప్పింది. అత్యంత పవిత్రమైన కార్తీక మాసం (Karthika Masam)లో ఏపీలోని పలు శైవక్షేత్రాలతో పాటు శబరిమలకు ప్రత్యేకంగా బస్సులను నడిపించనున్నట్లు ప్రకటించింది. విజయవాడ నుంచి త్రిలింగ దర్శిని, అరుణాచలం, శ్రీశైలం, పంచారామాలు, శబరిమలకు ప్రత్యేక బస్సులు నడిపిస్తామని వెల్లడించింది. ఇందు కోసం ప్రత్యేకంగా ప్యాకేజీలను తీసుకువచ్చింది. పంచారామాల దర్శన ప్యాకేజీ ఈ నెల 2, 3, 4, 9, 10, 11, 15, 16, 17, 23, 24, 25 తేదీల్లో అందుబాటులో ఉంటుందని.. ప్యాకేజీలోని భాగంగా పంచారామ క్షేత్రాలు అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట క్షేత్రాలను దర్శించుకునే వీలుంది. ఆయా తేదీల్లో బస్సు ఉదయం 7 గంటలకకు విజయవాడ బస్టాండ్ నుంచి బయలుదేరుతుంది. అదే రోజు రాత్రి వరకు పంచారామాల దర్శనం పూర్తవుతుంది. ఈ ఒకే రోజు ప్యాకేజీ ధర రూ.1120గా నిర్ణయించింది.
సూపర్ లగ్జరీ బస్‌లో ప్రయాణం ఉంటుంది. ఇక శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి క్షేత్రానికి ప్రతి ఆదివారాలతో పాటు ప్రత్యేక రోజుల్లో సర్వీసులను నడిపిస్తామని తెలిపింది. అలాగే, కేరళ పత్తినంతిట్ట జిల్లాలోని శబరిమల క్షేత్రానికి ప్రత్యేక సర్వీసులు నడిపించనున్నట్లు పేర్కొంది. ఇక త్రిలింగ దర్శిని ప్యాకేజీలో భాగంగా యాగంటి, మహానంది, శ్రీశైలం క్షేత్రాల్ని దర్శించుకునే అవకాశం ఉంది. ప్యాకేజీ ప్రతీ కార్తీక శనివారం రోజున రాత్రి 8 గంటలకు విజయవాడ నుంచి బస్సు బయలుదేరుతుంది. ప్యాకేజీలో ఒక్కొక్కరికి రూ.1800 టికెట్ ధరను నిర్ణయించింది. ఇక అరుణాచలం, గిరి ప్రదక్షిణకు ప్రత్యేక సర్వీసులు నడిపించనున్నట్లు తెలిపింది. అరుణాచలం, గిరి ప్రదక్షిణకు పౌర్ణమికి రెండురోజుల ముందుగా విజయవాడ నుంచి బస్ బయలుదేరుతుంది. శ్రీకాళహస్తి, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ పుణ్యక్షేత్రాలు దర్శించుకొని పౌర్ణమి రోజున అరుణాచలం చేరుకుంటారు. ప్యాకేజీలో ఒక్కొక్కరికి టికెట్ ధరను రూ.2500గా నిర్ణయించారు.