Ayyanna Patrudu | ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవం

ఏపీ అసెంబ్లీ స్పీకర్ పదవికి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయ్యన్నపాత్రుడు తరపున కూటమి నేతలు నామినేషన్ పత్రాలను శాసనసభ కార్యదర్శికి సమర్పించారు

  • Publish Date - June 21, 2024 / 05:38 PM IST

విధాత : ఏపీ అసెంబ్లీ స్పీకర్ పదవికి టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయ్యన్నపాత్రుడు తరపున కూటమి నేతలు నామినేషన్ పత్రాలను శాసనసభ కార్యదర్శికి సమర్పించారు. పోటీగా మరెవరు స్పీకర్ పదవికి నామినేషన్‌లు వేయకపోవడంతో అయ్యన్నపాత్రుడు స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ పాల్గొన్నారు.

సీనియార్టీకి దక్కిన సారధ్యం

టీడీపీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడైన చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు ఎమ్మెల్యే నుంచి మంత్రిగా, ఎంపీగా, చివరకు స్పీకర్‌గా బహుముఖ పదవులకు ఎన్నికయ్యారు. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అనకాప‌ల్లి జిల్లా న‌ర్సీప‌ట్నం నుంచి గెలుపొందారు. ఈ ఎన్నిక‌ల్లో 24,676 ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1982లో తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆయ‌న టీడీపీలోనే కొన‌సాగుతున్నారు. 1983, 1985, 1994, 1999, 2004, 2014, 2024లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

అలాగే 1996లో అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా విజ‌యం సాధించి లోక్‌స‌భ‌లో అడుగుపెట్టారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు కేబినెట్‌లో అయ్యన్నపాత్రుడు మంత్రిగా పనిచేశారు. ఈసారి కూడా చంద్రబాబు కేబినెట్ స్థానం దక్కుతుందని అంద‌రూ భావించారు. కానీ యువతకు ప్రాధాన్యత ఇవ్వడంతో అయ్య‌న్న‌పాత్రుడికి మంత్రి పదవి దక్కలేదు. అయితే గతంలో ఇచ్చిన హామీ మేరకు అయ్యన్నపాత్రుడికి స్పీకర్ పదవి ఖాయం చేసినట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆయ‌న స్పీక‌ర్ ప‌ద‌వికి నామినేష‌న్ దాఖ‌లు చేశారు.

Latest News