సీఎం జగన్ మీద దాడి ఘటనపై కేసు నమోదు

సీఎం జగన్ మీద దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 307 సెక్షన్ కింద హత్యయత్నం కేసు నమోదు చేశారు. సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు

  • Publish Date - April 14, 2024 / 03:46 PM IST

హత్య యత్నం కేసు నమోదు..ఆగంతకుడి కోసం గాలింపు
వైసీపీ శ్రేణుల నిరసన హోరు

విధాత, హైదరాబాద్ : సీఎం జగన్ మీద దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 307 సెక్షన్ కింద హత్యయత్నం కేసు నమోదు చేశారు. సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోలీసులు వెల్లంపల్లి ఇంటికి వెళ్లి స్టెట్‌మెంట్ రికార్డు చేసుకున్నారు. శనివారం సాయంత్రం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బస్సుయాత్రలో భాగంగా సీఎం జగన్ బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తుండగా, జనం పూలు చల్లుతు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సమయంలో ఓ ఆగంతకుడు రాయిని విసరడంతో అది నేరుగా జగన్ ఎడమ కనుబొమ్మపై భాగంలో తగిలి గాయమైంది. అదే రాయి వెల్లంపల్లి కన్నుకు కూడా తగిలింది. వైద్యులు జగన్ ఎడమ కనుబొమ్మపై మూడుకుట్లు వేశారు. ట్రయంగిల్ షేప్‌లో ఒక సెంటమీటర్ లోతుకు గాయమైందని, మరి లోతుగా గాయం కాకపోవడంతో ఫ్రమాదం తప్పిందన్నారు. ఆయన యధాతధంగా యాత్ర కొనసాగించవచ్చని వైద్యులు తెలిపారు. వెల్లంపల్లి కన్నుకు కూడా చికిత్స చేసి పంపించారు. అటు సీఎం జగన్‌పై దాడి చేసిన ఆగంతకుడి కోసం పోలీసులు ఆరు బృందాలుగా గాలిస్తున్నారు. బస్సు పక్కనే ఉన్న వివేకానంద స్కూల్ భవనం కిటికిలోంచి అతను రాయి విసిరినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అటు ఎన్నికల సంఘం కూడా సీఎం జగన్‌పై దాడి ఘటనను సీరియస్‌గా తీసుకుంది. ఏపీలో జీరో వయలెన్స్ ఎన్నికలు టార్గెట్‌గా పెట్టుకున్న ఎన్నికల సంఘం ఏకంగా సీఎంపై దాడి జరగడంతో మరింత కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించుకుంది. సీఎం జగన్‌పై జరిగిన దాడికి సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

దాడిపై వైసీపీ నిరసనలు
ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిరసనలకు దిగాయి. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ ఆంశాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు వైసీపీ శ్రేణులు నిరసనల ద్వారా ప్రయత్నించాయి. దాడికి టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్‌. చంద్రబాబునాయుడు ప్రోద్భలంతోనే ఈ దాడి జరిగిందని వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు ప్రభృతులు ఆరోపించారు. మరోవైపు సీఎం జగన్‌పై జరిగిని దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని ఈ దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని చంద్రబాబునాయుడు, పీసీసీ చీఫ్ వైఎస్‌.షర్మిల, బీజేపీ చీప్ పురంధరేశ్వరిలు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సమయంలో ఇలాంటి ఘటనలతో భావోద్వేగాలను రెచ్చగొట్టడం సరికాదన్నారు.

Latest News