Chandrababu Naidu| రాజ్యాంగంతోనే ప్రధానిగా చాయ్‌వాలా : చంద్రబాబు

ఓ చాయ్ వాలా ప్రధాని అయ్యారంటే అది మన దేశ రాజ్యాంగం గొప్పతనమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్‌ అత్యున్నతమైన రాజ్యాంగం రూపొందించారని కొనియాడారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప వాటిలో ఒకటని పేర్కొన్నారు.

అమరావతి : ఓ చాయ్ వాలా ప్రధాని అయ్యారంటే అది మన దేశ రాజ్యాంగం(Indian Constitution) గొప్పతనమని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu Naidu)అన్నారు. డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్‌ అత్యున్నతమైన రాజ్యాంగం రూపొందించారని కొనియాడారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్ప వాటిలో ఒకటని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళగిరిలో ఏపీ హైకోర్టు న్యాయవాదుల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. సుప్రీంకోర్టు సీజేఐ బీఆర్.గవాయ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్, చంద్రబాబులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాజ్యాంగ వ్యవస్థల పటిష్టతతోనే దేశంలోని అందరికి న్యాయం దక్కుతుందన్నారు. ధనిక, పేద, ఇతర బేధాలు లేకుండా ప్రతి ఒకరికి ఓటు హక్కు కల్పించిన ఘనత మన రాజ్యాంగానికి దక్కుతుంది అని చంద్రబాబు తెలిపారు. ప్రజాస్వామ్యం గాడి తప్పినప్పుడు న్యాయ వ్యవస్థే దానిని గాడిన పెడుతోందని పేర్కొన్నారు. విలువలతో కూడిన వ్యక్తిత్వం సీజేఐ గవాయ్ ది.. అందరిని సమానంగా చూడటం గవాయ్ లో గొప్ప లక్షణం అన్నారు.

ఆర్థిక సంస్కరణలు దేశ దిశనే మార్చేశాయని, 2014లో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న మనం ఇప్పుడు నాలుగో ఆర్థిక వ్యవస్థకు చేరాం అని చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది భారత్‌ ప్రపంచంలో మూడో, 2038 నాటికి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కాబోతోందని.. 2047 నాటికి భారత్‌ ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్నది లక్ష్యంగా ఉందని పేర్కొన్నారు. మీడియా రంగంలోనూ ఇటీవల చాలా మార్పులు వచ్చాయని, సోషల్‌ మీడియాలో ప్రతి ఒక్కరూ రైటర్ గా , ఎడిటర్ గా మారిపోయారని, సామాజిక మాధ్యమాలను వ్యక్తిత్వ హననానికి ఉపయోగించడం దురదృష్టకరంఅని చంద్రబాబు అన్నారు. ఈ విధమైన అసంబద్ధ పోకడలపై స్వీయ నియంత్రణ పాటించాలన్నారు.