విధాత: ఏపీ సీఎం చంద్రబాబు 48 మంది ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. పాలనా వ్యవహారాల్లో బిజీ బిజీగా ఉన్న సీఎం పార్టీ వ్యవహారాల విషయంలో దృష్టి సారించారు. పార్టీలో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలపై నజర్ పెట్టారు. ఫించన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనని 48 మంది సొంతపార్టీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. వారి నుంచి వివరణ తీసుకున్నాక చర్యలకూ వెనకాడమోమని సీఎం హెచ్చరించారు. పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న కార్యకర్తలను ఎమ్మెల్యేలు కలుపుకుని వెళ్లాలని సూచించారు.
ఎన్టీఆర్ భరోసా ఫించన్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇచ్చిన మాట ప్రకారం ఫించన్‌ను నాలుగు వేలకు పెంచింది. ఏప్రిల్ నెల నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తోంది. ప్రతి నెల ఒకటో తేదినా సీఎం చంద్రబాబు స్వయంగా జిల్లాల్లో పర్యటించి ఫించన్లను పంపిణీ చేస్తున్నారు. అలాగే మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు.
