విధాత: చిత్తూరు జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పూతలపట్టు-నాయుడుపేట రహదారిపై చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న చిన్నారి సహా ఐదుగురు మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు.
మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 8 మంది ఉన్నట్టు స్థానికులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మంటలార్పి కారులోని మృతదేహాలను బయటకు తీశారు. కారు నంబరు AP39HA 4003గా గుర్తించారు. మృతులు విజయనగరం జిల్లా వాసులుగా పోలీసులు భావిస్తున్నారు.