ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో బాబు నృత్యం
విధాత, హైదరాబాద్ : ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధితోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆదివాసీ మహిళలతో కలిసి నృత్యం చేసిన సీఎం చంద్రబాబు అనంతరం డప్పు వాయించారు. ఆ తర్వాత అరకు కాఫీ ఉత్పత్తులను పరిశీలించారు. సీఎం చంద్రబాబు, పలువురు ఎమ్మెల్యేలు కాపీ రుచి చూశారు. అరకు కాఫీ మార్కెటింగ్ తదితర అంశాలపై అధికారులతో సీఎం మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆఫ్రికా తర్వాత ప్రపంచంలో రెండో స్థానంలో గిరిజనులు ఉండే దేశం భారత్ అని, అన్ని రంగాల్లో గిరిజనులు ముందుండాలనేదే నా ఆకాంక్ష అన్నారు.
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు.#NaraChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/dLbJAGRYcb
— Telugu Desam Party (@JaiTDP) August 9, 2024
మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజనులు అభివృద్ధి చెందాలని, అప్పుడే సమగ్రాభివృద్ధి సాధించినట్లన్నారు. ఆదివాసీలంటే శౌర్యం, సహజ ప్రతిభ, నైపుణ్యం కలిగిన వ్యక్తులని, దేశవ్యాప్తంగా 10.42 కోట్ల మంది గిరిజనులున్నారని, 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 27.39 లక్షల మంది ఉన్నారని చంద్రబాబు తెలిపారు. గిరిజన, ఆదివాసీలు అల్లూరి సీతారామరాజు, ఏకలవ్యుడిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలన అంతానికి పోరాడి ప్రాణ త్యాగం చేశారని గుర్తు చేశారు. గిరిజన బిడ్డ ద్రౌపది ముర్ము పాఠశాల ఉపాధ్యాయినగా పనిచేస్తూ రాష్ట్రపతి కాగలిగారన్నారు. అంచెలంచెలుగా ఎదిగిన ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏటా ఆదివాసీ దినోత్సవం నిర్వహించామని, ప్రధానికి అరకు కాఫీ రుచి చూపామని, గత ఐదేళ్లలో ఆదివాఈసీ దినోత్సవాన్ని పట్టించుకోలేదన్నారు.