న్యూఢిల్లీ : నా రాజకీయ జీవితంలో గూగుల్ ఒప్పందం పెద్ద విజయం అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఆ సంస్థతో ఏపీ ప్రభుత్వం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఒప్పందం జరిగింది. గూగుల్ సంస్థ నుంచి గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, నిర్మలా సీతారామన్, మంత్రి నారా లోకేష్ లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ‘భారత్ ఏఐ శక్తి’ పేరుతో జరిగిన ఈ ఒప్పందంతో గూగుల్ సంస్థ విశాఖలో రూ.87520 కోట్ల పెట్టుబడులతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుందని చంద్రబాబు తెలిపారు. ఒక గిగా వాట్ కెపాసిటీతో విశాఖలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుందని..వైద్యారోగ్యం, విద్య, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో సేవలు ఏఐ డేటా సెంటర్ సేవలు అందించనుందన్నారు. విశాఖ నుంచి సింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా దేశాలతో సబ్ సీ-కేబుల్ ద్వారా గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనుసంధానం కానుందని తెలిపారు. గతంలో హైదరాబాద్‌లో హైటెక్ సిటీని అభివృద్ధి చేశాం అని..ప్రస్తుతం విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దబోతున్నాం అని చంద్రబాబు వెల్లడించారు. హైదరాబాద్ లో హైటెక్ సిటి నిర్మాణం, ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఐటీతో నేను చాలా కాలంగా అనుసంధానమై ఉన్నానని, రియల్ టైమ్ డేటా, హిస్టారికల్ డేటాల సాయంతో వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఆస్కారం ఉందన్నారు. ప్రధాని మోదీ టెక్నాలజీని వేగంగా అందిపుచ్చుకునే నేత అని కొనియాడారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ గురించి చెప్పగానే ఆయన వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గ్లోబల్ ఏఐ కాన్ఫరెన్సు నిర్వహించే విషయమై ఆలోచిస్తున్నారన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే టెక్నాలజీ అందిపుచ్చుకోవటంలో భారత్ ప్రత్యేకం అని ప్రశంసించారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలన్నది మా లక్ష్యం అని..ఏఐని ప్రతీ కుటుంబానికి దగ్గర చేసేలా ప్రయత్నిస్తాం అన్నారు.
దేశ పురోగతిలో ఏపీ కీలకం : నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో పాటు సీ కేబుల్ ల్యాండింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తుండటం మంచి పరిణామం అన్నారు. ఈ ప్రాజెక్టు అత్యంత వేగంగా అమల్లోకి రావటం దేశ ప్రగతిలో అత్యంత కీలకంగా మారుతుందని, విజనరీ నేతలు ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు లాంటి వారి ఆలోచనలు, తీసుకువచ్చిన విధానాల వల్ల ఈ ప్రాజెక్టు సాకారం అవుతోందని తెలిపారు. ప్రొగ్రెసివ్ పాలసీలు, నిర్ణయాల్లో డైనమిజం వల్లే ఇది సాధ్యం అన్నారు. కేంద్రంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ తరహా సుపరిపాలన ఉందని, ఏపీలో చాలా సేవలు ప్రజలకు డిజిటల్ గా అందుతున్నాయన్నారు. అందుకే ఈ డేటా సెంటర్ ఏపీలో ఏర్పాటు కావటం సరైందని భావిస్తున్నానన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో వివిధ రాష్ట్ల్రాలు కూడా పోటీ పడుతున్నాయని, 2047 వికసిత్ భారత్ లక్ష్యానికి చేరుకోవడానికి ఇలాంటి పోటీ అవసరం అన్నారు.
సాంకేతికత నైపుణ్యాలకు ఏఐ దోహదం : అశ్వినీ వైష్ణవ్
కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని గూగుల్ నిర్ణయానికి ధన్యవాదాలు అతెలిపారు. దేశంలోని ప్రతీ ఒక్కరి జీవితాలను ఈ నిర్ణయం మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టెక్నాలజీకి ఎక్కువగా ప్రాధాన్యమిచ్చే ఆంధ్రప్రదేశ్‌లాంటి రాష్ట్రాలు దేశ ప్రగతికి కీలకంగా నిలుస్తున్నాయన్నారు. ఏఐ ద్వారా చాలా మంది టెక్ నిపుణుల్లో ఆందోళన ఏర్పడింది అని, కానీ వారి నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా మరిన్ని అవకాశాలు వస్తున్నాయన్నారు. డేటా సెంటర్ పాలసీ ద్వారా ఈ తరహా డేటా సెంటర్లు ఏర్పాటు అవుతున్నాయని, వీటితో పాటు సముద్రగర్భ సీ కేబుల్ వ్యవస్థ ద్వారా దక్షిణాసియా, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు విశాఖ కనెక్ట్ అవుతోందని తెలిపారు. మయన్మార్ వైపు నుంచి ఈశాన్య రాష్ట్రాలకు కూడా కనెక్టివిటిని ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, దీనికి సహకారం అందించాలని గూగుల్ ను కోరుతున్నామని వెల్లడించారు. ప్రస్తుతం రైల్వే లైన్లతో పాటు వేసిన కేబుల్స్ తో ఈశాన్య రాష్ట్రాలు అనుసంధానమై ఉన్నాయని, అందుకే ఈ డేటా సెంటర్ ఏపీలో ఏర్పాటు కావటం సరైందని భావిస్తున్నానని తెలిపారు.
ఏపీకి ఇది చారిత్రాత్మక రోజు : మంత్రి నారా లోకేష్
మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ డేటా సెంటర్లు దేశానికి కొత్త రిఫైనరీల లాంటివి అన్నారు. కేంద్ర సహకారంతోనే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ సాకారం అయ్యిందని స్పష్టం చేశారు. టెక్ ప్రపంచంలో ఏపీకి ఇది చారిత్రాత్మక రోజు అని, గూగుల్ క్లౌడ్‌తో కలిసి ఏపీ ప్రభుత్వం కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందన్నారు. డిజిటల్ ఇన్నోవేషన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లోకి కొత్త అధ్యాయం అన్నారు. రియల్ టైమ్ గవర్నెన్సులాంటి వ్యవస్థలతో ప్రజలకు మెరుగైన సేవలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది అన్నారు. గూగుల్ లాంటి సంస్థలు దీనికి మరింత సహకారం అందించాలని కోరుతున్నాం అని, విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేయటం దేశానికి, రాష్ట్రానికి చాలా కీలకం కాబోతుందన్నారు. ఏపీలో మరిన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయి, డిజిటల్ హబ్‌గా కూడా దేశానికి మంచి గుర్తింపు రాబోతుందన్నారు.