YS Jagan| నాయకుడు కాదు.. నాటకాల రాయుడు: చంద్రబాబుపై జగన్ ఫైర్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాయకుడు కాదు.. నాటకాల రాయుడు అని..“క్రెడిట్‌ చోరీ స్కీం’’లో ఆయనకు ఆయనే సాటి అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పేదలకు ఇళ్ల నిర్మాణం విషయంలో చంద్రబాబు తీరుపై మండిపడుతూ ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.

అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM N. Chandrababu Naidu) నాయకుడు కాదు.. నాటకాల రాయుడు అని..“క్రెడిట్‌ చోరీ స్కీం’’లో ఆయనకు ఆయనే సాటి అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy)ఫైర్ అయ్యారు. పేదలకు ఇళ్ల నిర్మాణం విషయంలో చంద్రబాబు తీరుపై మండిపడుతూ ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.

చంద్రబాబు..మీ కథ, స్క్రీన్‌, ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న “క్రెడిట్‌ చోరీ స్కీం’’ చాలా బాగుంది.
పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడానికి ఈ 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించకుండా..ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వకుండా.. ఇళ్ల కోసం ఒక్కపైసా కూడా ఖర్చుచేయకుండా..ఒక్కరికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయకుండా..ఒకే రోజు 3లక్షల ఇళ్లను పూర్తి చేసి ప్రారంభించమని చెప్పుకోవడం మీకే చెల్లిందన్నారు.

గత ప్రభుత్వం అంటే వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి స్థలాల్లోనే, వైయస్సార్‌సీపీ గతంలో శాంక్షన్‌ చేయించిన ఇళ్లను, మా ప్రభుత్వ హయాంలోనే నిర్మాణంలో ఉన్నవాటిని పట్టుకుని “ఇళ్లన్నీ మేమే కట్టేశాం” అంటూ పచ్చి అబద్ధాలను కళ్లార్పకుండా, ఏ మాత్రం సిగ్గుపడకుండా, బల్లగుద్దీ మరీ చెప్తూ… ఆ క్రెడిట్‌ మీదేనంటూ మీరు చేస్తున్న క్రెడిట్‌ చోరీ స్కీం హేయంగా ఉందని జగన్ విమర్శించారు. ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదు, నాటకాల రాయుడు అంటారని జగన్ మండిపడ్డారు.

మీరు ప్రారంభించామని చెప్పుకుంటున్న 3,00,092 ఇళ్లలో ఒక్క ఇంటిపట్టా కూడా మీరు ఇవ్వలేదు. ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయించ లేదు. ఆ 3,00,092 ఇళ్లలో 1,40,010 ఇళ్లు మా హయాంలోనే పూర్తయ్యే దశలో ఉన్నవే. మరో 87,380 ఇళ్లు శ్లాబ్‌ లెవల్‌ వరకూ మా హయాంలోనే కట్టించినవే. శ్లాబ్‌ కంటే కింద స్థాయిలో మరో 66,845 ఇళ్లు మా హయాంలో నిర్మాణంలోఉన్నవేనని జగన్ గుర్తు చేశారు.

ఇవికాక అక్టోబరు 12, 2023న ఒకేసారి 7,43,396 ఇళ్లలో ఒకేరోజు గృహప్రవేశాలతో మా ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. ఇన్ని వాస్తవాలు కళ్ళముందే ఉన్నా…అసలు వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఏమీ చేయనట్టుగా, మీరే అన్నీ చేసినట్టుగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్న మీ స్కీం చాలా హేయం అని జగన్ విమర్శించారు.

మా హయాంలో 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మలకు ఇచ్చి, వారి పేరుమీదే రిజిస్ట్రేషన్‌ చేయించాం. 21.75 లక్షల ఇళ్లను శాంక్షన్‌ చేయించి…కోవిడ్‌లాంటి మహమ్మారి ద్వారా తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొంటూ 9 లక్షలకుపైగా ఇళ్లను మా హయాంలోనే పూర్తిచేసినా, అన్నీ మీరే చేశారన్నట్టుగా మీరు చెప్పడమే కాకుండా, మీ ఎల్లోమీడియా ద్వారా ప్రచారం చేయించుకుని, ఆ క్రెడిట్‌ కొట్టేయాలనుకుంటున్న మీ స్కీం చాలా హేయం అని జగన్ దుయ్యబట్టారు.

మేము 31.19 లక్షల ఇళ్ల పట్టాలను ఇచ్చి, అందులో 21.75లక్షల ఇళ్లు శాంక్షన్‌ చేయించి కట్టడం మొదలుపెట్టాం. మిగిలిన ఆ 10 లక్షల ఇళ్ల స్థలాల్లో పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే కార్యక్రమానికి పూనుకోకుండా, ఆ ఖాళీ స్థలాలను లాక్కునే కార్యక్రమం చేస్తున్న మీరు సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి, నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీకి పాల్పడ్డం అత్యంత హేయం అని చంద్రబాబుపై జగన్ నిప్పులు చెరిగారు. ఒకరి కష్టాన్ని కొట్టేయడంలో, ఒకరి ఐడియాను మీదిగా చెప్పుకోవడంలో, ఆ పేదల ఇళ్లస్థలాలను సైతం లాక్కునే ప్రయత్నం చేయడం, అసలు ఆ క్రెడిట్‌ చోరీలో మీకు మీరే సాటి అని జగన్ ఎద్దేవా చేశారు.