Site icon vidhaatha

YS Jagan Mohan Reddy | నేడు రాష్ట్రానికి చేరుకోనున్న జగన్‌..

15 రోజుల విదేశీ పర్యటన పూర్తి
ప్రజాదీవెనతో మళ్లీ మన ప్రభుత్వమే వస్తుందని ట్వీట్‌

విధాత : ఏపీ సీఎం వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి దంపతులు 15 రోజుల విదేశీ పర్యటన పూర్తి చేసుకుని నేడు శుక్రవారం రాష్ట్రానికి తిరిగి రానున్నారు. గురువారం రాత్రి వారు లండన్ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి వారు చేరుకోనున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో బిజీబిజీగా గడిపిన జగన్ ఈ నెల 17న కోర్టు అనుమతితో లండన్ పర్యటనకు వెళ్లారు. అక్కడి నుంచి కుమార్తెలతో కలిసి ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌లో ఆయన పర్యటించారు. 15 రోజుల అనంతరం రాష్ట్రానికి చేరుకోనున్నారు.

జూన్‌ 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఆయన పార్టీ ముఖ్యులతో కలిసి లెక్కింపు ప్రక్రియపై సమీక్ష చేయనున్నారు. కాగా సీఎం జగన్‌ గురువారం ఏపీ ప్రజలను ఉద్ధేశించి ఆసక్తికర ట్వీట్‌ చేశారు. దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజన మన పార్టీ అధికారంలోకి వచ్చిందని, కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసిందని పేర్కోన్నారు. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుందని ట్వీట్‌లో తెలిపారు. తన ట్వీట్‌కు గతంలో సీఎంగా జగన్‌ ప్రమాణాస్వీకారం చేసిన ఫోటోను పోస్టు చేశారు.

 

Exit mobile version