అమరావతి : టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu) అయోధ్య బాలరాముడిని(Ayodhya Ram Temple Balram darshan) దర్శించుకున్నారు. చంద్రబాబు ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అయోధ్య బాలరాముడిని దర్శించుకున్నారు. చంద్రబాబుకు ఉత్తర్‌ప్రదేశ్ అధికారులు, ఆలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. చంద్రబాబుకు ఆయోధ్య ఆలయ నిర్మాణ విశేషాలను వివరించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు ఎక్స్ వేదికగా అయోధ్య బాలరాముడి దర్శనంపై ట్వీట్ చేశారు. ఈ రోజు అయోధ్యలోని దివ్యమైన, అద్భుతమైన శ్రీ రామ జన్మభూమి మందిరంలో దర్శనం చేసుకొని, ప్రార్థనలు చేసే భాగ్యం నాకు లభించిందన్నారు. ఇక్కడ ఉండటం ఒక ప్రశాంతమైన, ఆధ్యాత్మికంగా ఉత్తేజపరిచే అనుభవంగా పేర్కొన్నారు. శ్రీరాముని విలువలు, ఆదర్శాలు కాలాతీతమైనవని, అవి మనందరికీ పాఠాలని సీఎం పేర్కొన్నారు. అవి ఎల్లప్పుడూ మనకు మార్గనిర్దేశం చేస్తూ, స్ఫూర్తిని ఇస్తూ ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.
